మరో 6 జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు
ఇకపై ఎలక్ట్రానిక్స్, ఐటీ పరిశ్రమలకు కోతలుండవ్
ఐటీఈఅండ్‌సీ సెక్రటరీ సంజయ్
సాక్షి, హైదరాబాద్: త్వరలో రూ. వెయ్యి కోట్లతో మహేశ్వరం, ఫ్యాబీ సిటీలోని ఈ-సీటీలో రెండు ఎలక్ట్రానిక్ తయారీ సంస్థల ప్రారంభం కానున్నాయని ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సెక్రటరీ సంజయ్ జాజు చెప్పారు. వీటితో పాటు రంగారెడ్డి, మెదక్, చిత్తూరు, నెల్లూరు, వరంగల్, విశాఖపట్నం జిల్లాల్లో కూడా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. స్థల సేకరణకు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరుగుతోందన్నారు. సోమవారమిక్కడ ‘ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు’ అనే అంశంపై జరిగిన శిక్షణ శిబిరంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘రాష్ట్రాభివృద్ధిలో ఎలక్ట్రానిక్, ఐటీ పరిశ్రమలు ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి పరిశ్రమలు విద్యుత్ కోతలతో నష్టాలు చూస్తున్నాయి. దీనిపై సీపీడీసీఎల్ అధికారులతో మాట్లాడాం. మరో ఆరు నెలల్లో హైటెక్‌సిటీ, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఉన్న ఎలక్ట్రానిక్, ఐటీ పరిశ్రమలకు కోతల్లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుంది’’ అని స్పష్టం చేశారు.