ధరల బాదుడుకు రాచబాట | Industry goes online to press for GST Bill | Sakshi
Sakshi News home page

ధరల బాదుడుకు రాచబాట

Published Wed, Dec 23 2015 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 2:24 PM

ధరల బాదుడుకు రాచబాట

ధరల బాదుడుకు రాచబాట

విశ్లేషణ
జీఎస్‌టీ సంస్కరణ భారాన్ని వినియోగదారులపైకి నెట్టకుండా ఉండడం ముఖ్యం. పార్లమెంటులోనూ, ఇప్పుడు సన్నద్ధం చేస్తున్న జీఎస్‌టీ నమూనా చట్టంలోనూ ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి. సర్వీస్ ట్యాక్స్‌పై గరిష్టపరిమితికి అవధిని నిర్ణయించి తీరాలి. సర్వీస్ ట్యాక్స్‌ను కనిష్ట స్థాయి రేటైన 12 శాతానికి పరిమితం చేయాలని నా సూచన. కార్పొరేట్ రంగానికి ఏటా ఇంచుమించు జీడీపీలో 2.7 శాతం మేరకు పన్ను మినహాయింపులను ఇస్తున్నారు. వాటికి స్వస్తి పలకడం ద్వారా ప్రభుత్వం పన్నుల పునాదిని విస్తరింపజేసుకోవాలి.
 
 మా పొరుగింటాయన తన ఇంటిని కూలగొట్టి, అత్యాధునికంగా పునర్నిర్మించుకొని ఆ నిర్మాణ వ్యయం బిల్లులను నాకు పంపితే ఎలా ఉంటుంది? ‘వినూత్నమైనది’, ‘చరిత్రాత్మకమైనది’, ‘నేటి పరిస్థితిని పూర్తిగా మార్చేసేది’ అంటున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్‌టీ) పై జరుగుతున్న చర్చ సరిగ్గా దీన్నే విస్మరిస్తోంది. భారత కార్పొరేట్ రంగానికి సంబంధించి జీఎస్‌టీ సమూల మార్పును తెస్తుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పదేపదే చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వాట్), లగ్జరీ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ వగైరాలన్నిటి స్థానంలో జీఎస్‌టీ అమల్లోకి వస్తుంది. పన్నుల దొంతర ఫలితంగా వృద్ధి కుంటు పడడాన్ని ఇది చాలా వరకు తగ్గిస్తుందని ఆశిస్తున్నారు. తద్వారా స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 0.9 నుంచి 1.7 శాతం పెరుగుతుందని భావిస్తు న్నారు.  ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థలో రకరకాల పన్నులను లేదా కొందరు అనేట్టు పన్ను మీద పన్ను విధించడం మాత్రమేగాక, ఇది పన్నుల వసూలులోని ప్రతి దశలోనూ విచ్చలవిడి అవినీతిని అనుమతించింది. అందుకు కారణాలు ఏవైనా, చివరికి రిటైల్ ధరలను చెల్లించే కొనుగోలు దారులే ఈ అధిక పన్నుల భారాన్నంతా మోయాల్సి వస్తోంది.

కార్పొరేట్ల సౌఖ్యానికి సామాన్యునిపై భారం
జీఎస్‌టీ, వస్తుసేవల ఉత్పత్తిదారులకు ఏ ప్రయాసాలేని పన్నుల వ్యవస్థను అందుబాటులోకి తెస్తుంది. పలు చోట్ల పలు రకాల పన్నులను చెల్లించాల్సి రావడానికి బదులుగా వారు ఇప్పుడు ఒకే ఒక్క పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఇంతా చేసి అది వృద్ధి రేటును పెంపొందింపజేస్తుందా, లేదా? అనే విషయాన్ని పక్కన పెడదాం. అంతకంటే ముఖ్యంగా అది వ్యాపారం సులువుగా సాగే అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. బాగానే ఉంది గానీ, చివరికి ఈ సంస్కరణకు అయ్యే వ్యయ భారాన్ని వినియోగదారులు ఎందుకు భరించాలో అంతుబట్టడం లేదు. జీఎస్‌టీ సరిగ్గా మా పొరుగింటాయన కథ లాంటిదే. ఇంటి పునర్నిర్మాణం చేపట్టినవారే ఆ వ్యయాన్ని భరించాలి. అలాగే ఈ పన్నుల సంస్కరణ ఎవరి కోసమో వారే దీని భారాన్ని భరించాలి. దీనివల్ల లబ్ధి పొందేది మన కార్పొరేట్ రంగమే. ఆ వ్యయాన్ని చెల్లించాలని వారినే అడగాల్సింది పోయి, దాన్ని వినియోగదారులపైకి నెట్టారు.    

 ఈ అధిక జీఎస్‌టీ రేటు వినియోగదారులకు మింగుడుపడేలా చేయాలనే అరుణ్ జైట్లీ 2015 బడ్జెట్‌లో సర్వీసు ట్యాక్స్‌ను 12.36 నుంచి 14 శాతా నికి పెంచారు. 2015-16లో సామాన్యుల జేబుల నుంచి ఇలా ఎంత గుం జారో 2016 బడ్జెట్ నాటికిగానీ తెలియదు. అయితే గత ఏడాది సర్వీస్ ట్యాక్స్ ద్వారా మాత్రమే ప్రభుత్వానికి రూ. 50,000 కోట్లు అదనపు రాబడి వచ్చిందనే దాన్ని బట్టి ఒక అంచనాకు రావచ్చు. సర్వీసు ట్యాక్స్ క్రమంగా పెరుగుతూ పోవడాన్ని బట్టి రేపు 18 శాతం ప్రామాణిక రేటు చొప్పున జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక అమాయక ప్రజాబాహుళ్యం దాదాపు రూ. 2.5 లక్షల కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుందని నా అంచనా. మరోవిధంగా చెప్పాలంటే, జీఎస్‌టీ సంస్కరణలకు అయ్యే వ్యయ భారాన్నంతటినీ భరించాల్సింది వినియోగదారులే. కాగా, దాని ఏకైక లబ్ధిదారైన కార్పొరేట్ రంగం మాత్రం ఏమీ చెల్లించదు.

 జీఎస్‌టీ అంటే ఒకే పన్ను రేటు కాబట్టి సర్వీసు ట్యాక్స్ కూడా అందులోనే  కలిసిపోయి ఉంటుంది. కానీ ప్రస్తుతం అమల్లో ఉన్న ‘రెవెన్యూ న్యూట్రల్ రేట్’ (ఆర్‌ఎన్‌ఆర్) పద్ధతిలోనే పన్నుల వసూలు జరగడానికి హామీ ఉండ టం, అది ఇప్పటికంటే పడిపోకుండా ఉండటం ఆవశ్యకం కావచ్చు. ప్రస్తుతం ఉన్న పలు దొంతరల పన్నుల విధానంలో కంటే జీఎస్‌టీ వల్ల  ప్రభుత్వ రాబడి పడిపోతుంది. ఆ లోటును భర్తీచేసుకునే  ఉత్తమ మార్గం సామాన్యుల పైన భారాన్ని మరింత పెంచడమేనని ప్రభుత్వం భావిస్తోంది. ‘రెవెన్యూ న్యూట్రల్ రేట్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ రేట్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్’పై  నియమించిన అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ ఉద్దేశపూర్వకంగానే పన్నుల వసూళ్ళు అధిక రేటులో ఉండేందుకు కృషి చేసిందని దాని నివేదికే తెలిపింది. అది సగటున 15-15.5 శాతం ఆర్‌ఎన్‌ఆర్ రేటునూ, రెండు రకాల పన్నుల విధానాన్నీ సూచించింది. కొన్ని వస్తువులకు 12 శాతాన్ని, మిగతా వాటికి 17-18% ప్రామాణిక రేటును సూచించింది.

పదాల గారడీయే ధరల తగ్గుదలా?  
వ్యాట్ కూడా ఒక విధమైన జీఎస్‌టీనే. వ్యాట్‌ను ప్రవేశపెట్టిన 165 దేశాల్లో చాలా వరకు పలు సమస్యలను ఎదుర్కొన్నాయని కూడా అది చెప్పింది. ఒకే జీఎస్‌టీ రేటును లేదా రెండు రేట్లను ప్రవేశపెట్టినాగానీ ప్రవేశపెట్టినాగానీ అది ఒక సవాలే. ఫెడరల్ వ్యవస్థను కలిగిన పెద్ద ఆర్థికవ్యవస్థలు ఉన్న యూరోపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండోనేసియా వంటి దేశాలు సైతం ఈ పన్నుల విధానం అమలులో తీవ్ర సమస్యలను ఎదు ర్కోవాల్సి వచ్చింది. ఆ సాధకబాధకాలను గురించి నేను మాట్లాడటం లేదు. దానివల్ల సామాన్యునిపై పడుతున్న అదనపు భారాన్ని గురించి మాత్రమే చర్చిస్తున్నా.

 ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లలో జీఎస్‌టీ అమలు ఫలితంగా ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగిందని ఆ నివేదికే పేర్కొంది. ఆ దేశాలలో జరిగి నట్లుగానే ఇక్కడ కూడా మొదట ధరలు పెరిగినా, తరువాత తగ్గుతాయనడం ఆర్థిక పద మాయాజాలంతప్ప మరేం కాదు. పప్పుల ధరలనే తీసుకుందాం. జూన్-అక్టోబర్ మధ్య సామాన్యులు వాడే కందిపప్పు ధర రూ.70 నుంచి రూ.170-200కు పెరిగింది. ప్రస్తుతం అది రూ. 120 కి తగ్గిందనుకుంటే, మూల ధర రూ. 70 స్థాయి నుంచి చూస్తే కచ్చితంగా ద్రవ్యోల్బణం తగ్గినట్టే. కానీ వాస్తవంలో ధర రూ.70 నుంచి పెరిగి రూ. 120 వద్ద నిలిచినట్టే. వచ్చే ఏడాది తిరిగి పప్పుధర పెరిగితే ఆ పెరుగుదలను కిలోకు రూ. 70 నుంచి గాక, రూ.120 ప్రాతిపదికన లెక్కగడతారు. దీనికితోడు సర్వీస్ ట్యాక్స్ పెరగడం ఒక్కదానివల్లనే ధరలు గణనీయంగా పెరుగుతాయని ఆశించ వచ్చు. 24 సేవలను ఈ జాబితాలో చేర్చారు. ఈ పన్నుల భారానికి తోడు పెరిగే ద్రవ్యోల్బణం ప్రజలపై అదనంగా మోపే పరోక్ష పన్ను అవుతుంది. అంటే ఆచరణలో మీపై రెండుసార్లు పన్ను విధిస్తారు.

 కట్టెకు నూనె రాసి కొట్టడం అంటే ఇదే   
 పెట్రోలియం (తొలి కొన్నేళ్లు మాత్రమే), విద్యుత్తు, రియల్ ఎస్టేట్, ఆల్క హాల్ జీఎస్‌టీ పరిధికి వెలుపలే ఉన్నాయి. పెట్రోలియం, ఆల్కహాల్ రాష్ట్రా లకు అతిపెద్ద రాబడి వనరనీ,  వాటి మొత్తం పరోక్షపన్నుల రాబడిలో 29 శాతమనీ, రాష్ట్రాల మొత్తం రాబడిలో 41.8 శాతం జీఎస్‌టీలో కలిసిపో తుందనీ ఆ నివేదికే తెలిపింది. జీఎస్‌టీ రెండంతస్తుల పన్నుల వ్యవస్థ.  కేంద్రం (సీజీఎస్‌టీ), రాష్ట్రాలు (ఎస్‌జీఎస్‌టీ) ఇలా రెండుసార్లు పన్ను విధిం చడం వల్లనే  జీఎస్‌టీ వల్ల కలుగుతుందంటున్న ప్రయోజనంలో అత్యధిక భాగం హరించుకుపోతుంది.

 ప్రామాణికమైన పన్ను స్లాబు గరిష్టంగా 18 శాతం ఉంటుందని ఇంత వరకు చెబుతున్నారు. కానీ దాన్ని రాజ్యాంగబద్ధమైన పరిమితిగా చేయ డానికి ఆర్థికమంత్రి అంగీకరించడం లేదు. అంటే గరిష్ట పరిమితి పెంచడానికి అవకాశాన్ని తెరచి ఉంచినట్టే. జీఎస్‌టీ రేటుకు రెండు అంతస్తుల రేట్లతో పూర్తి పొందికను సాధించాక, కనిష్ట రేటును 12 శాతంగా, గరిష్ట రేటును  22 శాతంగా నిర్ణయిస్తారని నిపుణుల విశ్వాసం. అంటే సర్వీస్ ట్యాక్స్‌ను 22 శాతానికి పెంచే అవకాశం ఉన్నట్టే. అందుకే గరిష్ట పరిమితిపై అవధి విధింపునకు అంగీకరించడం లేదు. సర్వీసు ట్యాక్స్‌ను 12.36 నుంచి 14 శాతానికి ఈ ఏడాది పెంచినప్పుడు ఎవరూ గగ్గోలు పెట్టలేదు. పైగా దానిపైన 0.5 శాతం స్వచ్ఛ భారత్ సెస్‌ను కూడా విధించారు. ఈ విధంగా క్రమక్రమంగా, దశలవారీ పద్ధతిలో ఎప్పటికప్పుడు సర్వీస్ ట్యాక్స్‌ను పెంచ డం వల్ల అదనపు పన్నుల భారం వినియోగదారులకు తేలికగా మింగుడు పడుతుంది. కట్టెకి నూనె రాసి కొట్టడం అంటే ఇదే.

 అందువలన జీఎస్‌టీ సంస్కరణ భారాన్ని వినియోగదారులపైకి నెట్ట కుండా ఉండడం ముఖ్యం. పార్లమెంటులోనూ, ఇప్పుడు సన్నద్ధం చేస్తున్న జీఎస్‌టీ నమూనా చట్టంలోనూ ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాల్సి ఉంది. సర్వీస్ ట్యాక్స్‌పై గరిష్టపరిమితికి అవధిని నిర్ణయించడం మాత్రమే అందుకు మార్గం. మన దేశం రెండు రేట్ల విధానాన్ని అనుసరించాలని భావిస్తోంది కాబట్టి, సర్వీస్ ట్యాక్స్‌ను కనిష్ట స్థాయి రేటైన 12 శాతానికి పరిమితం చేయాలని నా సూచన. ప్రామాణిక రేటు 18 శాతం, బహుశా హెచ్చుతగ్గులకు వీలైనది. కానీ దాని కనిష్ట స్థాయి 12 శాతానికి మించి పెరగడాన్ని అనుమతించరాదు. కార్పొరేట్ రంగానికి ఏటా ఇంచుమించు జీడీపీలో 2.7 శాతం మేరకు పన్ను మినహాయింపులను ఇస్తున్నారు. వాటి కి స్వస్తి పలకడం ద్వారా ప్రభుత్వం పన్నుల పునాదిని విస్తరింపజేసుకోవాలి.  
 వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు : దేవిందర్ శర్మ(hunger55@gmail.com)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement