జిల్లాలో మరో కేంద్ర బృందం పర్యటన
జిల్లాలో మరో కేంద్ర బృందం పర్యటన
Published Mon, Mar 6 2017 10:20 PM | Last Updated on Fri, Jun 1 2018 8:54 PM
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల అధ్యయనం కోసం గత జనవరిలో ముగ్గురు సభ్యులతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం పర్యటించి వెళ్లగా సోమవారం ఇద్దరు బృందం సభ్యులతో కూడిన మరో బృందం పలు మండలాల్లో పర్యటించింది. ఈ పర్యటనను జిల్లా యంత్రాంగం గోప్యంగా ఉంచడం విశేషం. బృందం వెంట కలెక్టర్ కోనశశిధర్ వెళ్లినా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులు కూడా ఎలాంటి వివరాలు అందించకపోవడం గమనార్హం. పలువురు అధికారులకు ఫోన్లు చేసినా బృందం సభ్యుల పేర్లు, పర్యటన గురించి చెప్పడానికి నిరాకరించారు. అనధికార వర్గాల సమాచారం ప్రకారం కేంద్ర బృందం సభ్యులు పుట్లూరు మండలం మడుగుపల్లి, కూడేరు మండలం కమ్మూరు, ఆత్మకూరు మండలం కొత్తపల్లి, రాప్తాడు మండలం బండమీదపల్లి, రూరల్ మండలం ఆలమూరు ప్రాంతాల్లో పర్యటించారు. డ్రిప్ ద్వారా పండ్లతోటల సాగు, ముఖ్యంగా తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న పుట్లూరు మండలంలో అరటి తోటల సాగు, రైతుల ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్నారు. హంద్రీ–నీవా ప్రాజెక్టు, అక్విడెక్ట్ పనులు, ఫారంపాండ్స్, ఉపాధి పనులు పరిశీలన, కూలీలతో ముఖాముఖి, చెరువుల పరిశీలన, నీరు–చెట్టు కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. జిల్లా పరిస్థితి గురించి పవర్‌పాయింట్ ద్వారా అధికారులు తెలియజేశారు. మంగళవారం కూడా కేంద్ర బృందం పర్యటన కొనసాగనుందని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర బృందం వెంట కలెక్టర్ కోనశశిధర్‌తో పాటు ఏపీఎంఐపీ, ఉద్యానశాఖ, భూగర్భజలశాఖ, జలవనరుల శాఖ అధికారులు ఉన్నారు.
Advertisement