సమస్యలపై ఏ‘కరువు’
హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వాలి
రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలివ్వాలి
విత్తన వేరుశనగ సబ్సిడీ చాలట్లేదు
పండ్లతోటలకు రక్షక తడులు అందించాలి
జిల్లా అభివృద్ధి సమీక్షలో ప్రజాప్రతినిధుల వినతి
అనంతపురం అర్బన్ : రైతులు పంటలు కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారని, నీటి ఎద్దడితో జనం అల్లాడిపోతున్నారని, తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు ఏకరువు పెట్టారు. ఆదివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్ష జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్, గ్రామీణ గృహనిర్మాణ, సమాచార శాఖమంత్రి కాలవ శ్రీనివాసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పాల్గొన్నారు. గుంతకల్లు మండలం వైటీ చెరువు తెప్ప ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అనంతరం ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, తీవ్ర కరువు పరిస్థితుల కారణంగా జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు పంటరుణాలు రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలు ఇవ్వడం లేదన్నారు. కేంద్రసాయం, పంటల బీమా కలిపి ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామంటున్నారని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సాయం ప్రకటించకపోతే ఎలా అని ప్రశ్నించారు. కరువును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని, ఇలాగైతే రైతుల కష్టాలు ఎలా తీరుతాయని మండిపడ్డారు. హంద్రీనీవా ద్వారా ఉరవకొండ నియోజకవర్గంలోని ఆయకట్టుకు సాగునీరివ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిపై లోతుగా చర్చించాలని కోరారు. ఇన్‌చార్జి మంత్రి స్పందిస్తూ ట్రయల్‌రన్ నిర్వహించి హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరివ్వాలని అధికారులను ఆదేశించారు. ఇన్‌చార్జి మంత్రి బాధ్యతలు తీసుకున్నాక.. పరిచయం చేసుకుందామని ఇక్కడికి వచ్చానని, త్వరలో మరో సమావేశం నిర్వహించి అన్ని సమస్యలపైనా విస్తృతస్థాయిలో చర్చిస్తానని చెప్పారు.
హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ, విత్తన వేరుశనగకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ సరిపోవడం లేదని, దీనికి తోడు విత్తన నాణ్యత కూడా లేదని తెలిపారు. సైలేజ్ గడ్డిని పశువులు తినడం లేదని, రైతులు కోరిన గ్రాసాన్ని అందజేయాలని సూచించారు. పండ్లతోటలకు రక్షక తడులు అందించి కాపాడాలని, నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని తదితర సమస్యలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం దృష్టికి తెచ్చారు. ఇన్‌చార్జి మంత్రి దేవినేని మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు, అధికారులు అభివృద్ధి రథానికి రెండు చక్రాలు లాంటివారన్నారు. సమష్టిగా జిల్లాను అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. భైరవానితిప్ప, పేరూరు ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. హంద్రీ నీవా కాలువ వెడల్పు కోసం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయనున్నామని, ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయన్నారు. ప్రభుత్వ విప్ యామినీబాల, ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, గోనుగుంట్ల సూర్యానారయణ, వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, ఉన్నం హనుమంతరాయచౌదరి, వీరన్న, జెడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, కత్తినసింహారెడ్డి, శమంతకమణి, గుండుమల తిప్పేస్వామి, కలెక్టర్ జి.వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు.