కాల్‌చేస్తే ‘సరి’.. | Solving farmers cultivation problems with just one phone : Andhra pradesh | Sakshi
Sakshi News home page

కాల్‌చేస్తే ‘సరి’..

Published Mon, Oct 23 2023 4:38 AM | Last Updated on Mon, Oct 23 2023 4:38 AM

Solving farmers cultivation problems with just one phone : Andhra pradesh - Sakshi

సాక్షి, అమరావతి:  క్షేత్రస్థాయిలో అన్నదాతలు ఎదుర్కొనే ప్రతీ సమస్యకు చిటికెలో పరిష్కారం చూపిస్తోంది ‘సమీకృత రైతు సమాచార కేంద్రం’. రైతు సమస్యల పరిష్కారం కోసం మూడున్నరేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ కేంద్రం ఇప్పు­డు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఒక్క ఫోన్‌కాల్‌ లేదా వాట్సప్‌ మెసేజ్‌ చేస్తే చాలు.. ఎలాంటి సమస్యకైనా వెంటనే సమాధానం దొరుకుతోంది.

జాతీ­య అంతర్జాతీయ ప్రశంసలు దక్కడమే కాదు అవా­ర్డులు, రివార్డులు కూడా దక్కాయి. ఏపీ స్ఫూర్తితో ఇప్పటికే తెలంగాణలో కాల్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయగా, రాజస్థాన్‌లో ఆచరణలోకి రాబోతోంది. మరికొన్ని రాష్ట్రాలు ఏపీ బాటలోనే సొంతంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటుచేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. చివరికి.. ఆఫ్రికన్‌ దేశం ఇథియోపియాలో కూడా ఏపీ తరహాలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. 

కార్పొరేట్‌ సంస్థలకు ధీటుగా నిర్వహణ
గతంలో జాతీయ స్థాయిలో ఏర్పాటుచేసిన కిసాన్‌ కాల్‌ సెంటర్లు పలు రాష్ట్రాల్లో మొక్కుబడిగా పనిచేసేవి. ఈ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ కలవడమే గగనంగా ఉండేది. ఒకవేళ కలిసినా రికార్డు వాయిస్‌ ద్వారా సల­హాలు, సూచనలు ఇవ్వడమే తప్ప రైతుల వెతలు వినే పరిస్థితి ఉండేది కాదు. దీంతో రైతులు పడరాని పాట్లు పడేవారు. ఈ పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల కోసం పూర్తిస్థాయిలో కాల్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని సంకల్పించారు.

దీంతో.. ఆర్బీకేలతో పాటు విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద ఏర్పాటుచేసిన సమీకృత రైతు సమాచార కేంద్రం–ఐసీసీ కాల్‌ సెంటర్‌కు 2020 మే 30న శ్రీకారం చుట్టారు. కార్పొరేట్‌ స్టైల్‌లో తీర్చిదిద్దిన ఈ కాల్‌ సెంటర్‌లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన  54 మందిని నియమించారు. వీరు ఉ.7 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు రెండు షిఫ్ట్‌లలో సేవలందిస్తున్నారు.

ఫోన్‌ చేయగానే రైతులు చెప్పిన సమస్యలను ఒపిగ్గా వినడమే కాదు.. అత్యంత గౌరవంగా, మర్యాదపూర్వకంగా బదులిస్తున్నారు. తమకు తెలిసినదైతే వెంటనే సమాచారం చెబుతారు. లేదంటే అక్కడే ఉన్న వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన నిపుణులు, శాస్త్రవేత్తలతో మాట్లాడిస్తారు. పంటకు సోకిన పురుగులు, తెగుళ్లకు చెందిన ఫొటోలను వాట్సప్‌లో పంపితే చాలు తగిన పరిష్కారం చూపుతున్నారు.  

రికార్డు స్థాయిలో సమస్యల పరిష్కారం 
ఇక కాల్‌ సెంటర్‌కు సగటున ప్రతీరోజూ 649 ఫోన్‌కాల్స్, 10 మెసేజ్‌లు చొప్పున ఇప్పటివరకు 7,78,878 ఫోన్‌కాల్స్, 11,725 వాట్సప్‌ మెసేజ్‌లు వచ్చాయి. వచ్చే ఫోన్‌ కాల్స్‌లో 80 శాతం వ్యవసాయ శాఖ, 17 శాతం ఉద్యాన శాఖకు సంబంధించిన సమస్యలు ఉంటుండగా, మిగిలిన 3 శాతం మత్స్య, పట్టు, మార్కెటింగ్, పశు సంవర్థక శాఖలకు సంబంధించినవి ఉంటున్నాయి.

ఫోన్‌చేసిన వారిలో 90 శాతం మంది సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. బ్రిటీష్‌ హై కమిషనర్‌ గారేట్‌ వైన్‌ ఓనర్, నీతి ఆయోగ్‌ మెంబర్‌ రమేష్‌ చంద్, సీఏసీపీ కమిషన్‌ చైర్మన్‌ ప్రొ. విజయపాల్‌ శర్మ, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థయిన ఎఫ్‌ఏఓ కంట్రీ హెడ్‌ చిచోరి, ఇథియోపియా దేశ వ్యవసాయ శాఖమంత్రి మెలెస్‌ మెకోనెన్‌ ఐమెర్‌ వంటి ఎంతోమంది æప్రముఖులు కాల్‌సెంటర్‌ నిర్వహణా తీరును ప్రశంసించారు. 

24 గంటల్లో క్షేత్రస్థాయి పరిశీలన.. 
ఇక సమస్య తీవ్రతను బట్టి సంబంధిత జిల్లాల్లోని జిల్లా వనరుల కేంద్రం (డీఆర్సీ) దృష్టికి తీసుకెళ్తారు. దగ్గరలోని పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలతో కలిసి డీఆర్సీ సిబ్బంది 24 గంటల్లో ఆ రైతు పొలాన్ని సందర్శిస్తారు. అప్పటివరకు వాడిన ఎరువులు, మందుల వివరాలు, సాగు పద్ధతులు తెలుసుకుంటారు. అవసరమనుకుంటే గ్రామంలోని రైతులందరినీ సమీపంలోని ఆర్బీకే వద్ద సమావేశపరిచి సామూహికంగా పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. ఇలా ఒక్క ఫోన్‌కాల్‌తో సాగు సమస్యలే కాదు సరికొత్త సాగు విధానాలు, చీడపీడల నియంత్రణ, నివారణోపాయాలు, అధిక దిగుబడికి సలహాలు అందిస్తున్నారు.   

ఐసీసీ టోల్‌ ఫ్రీ నంబర్‌: 155251   వాట్సాప్‌ నంబర్లు: 8331056028, 8331056149, 8331056150, 8331056152, 8331056153, 8331056154 

ఊరంతా మేలు జరిగింది 
నాలుగెకరాల్లో పత్తి వేశా. పంటకు సోకిన తలమాడు తెగులు గుర్తించి సెపె్టంబర్‌ 5న ఫోన్‌చేశా. ఆ మర్నాడే అధికారు లు, శాస్త్రవేత్తలు మా ఊరొచ్చారు. ఊ రంతా ఈ తెగులు ఉందని గమనించి ఆర్బీకే వద్ద రైతులందరిని సమావేశపరిచి పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను చెప్పారు. నా పొలంలో గుర్తించిన గులాబి రంగు పురుగు నివారణకు సిఫార్సులు చేశారు. మందులు వాడడంవల్ల రైతులందరికీ మేలు జరిగింది. ఎకరానికి 9 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.  – జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దమ్మాలపాడు, పల్నాడు జిల్లా 

ఒక్క ఫోన్‌కాల్‌తో సమస్య దూరం 
మా గ్రామంలో దాదాపు వంద ఎకరాల్లో వరి సాగు చేశాం. పైరులో ఉల్లికోడు ఆశించింది. సెపె్టంబర్‌ 20న నేను గన్నవరం కాల్‌ సెంటర్‌కు ఫోన్‌చేశాను. వెంటనే కాకినాడ నుంచి డీఆర్సీ సిబ్బంది, శాస్త్రవేత్తలు గ్రామానికి వచ్చి పరిశీలించారు. సస్యరక్షణ చర్యలు సూచించారు. ఉల్లికోడును తట్టుకునే సురేఖ, దివ్య, శ్రీకాకుళం సన్నాలు వంటి రకాలను సాగుచేస్తే మంచిదని సూచించారు. ఒక్క ఫోన్‌తో మా సమస్యకు పరిష్కారం లభించడం ఎంతో సంతోషం.     – శీలం చినబాబు, కోరంగి, కాకినాడ జిల్లా 

మంచి స్పందన వస్తోంది 
కాల్‌ సెంటర్‌ ద్వారా అందిస్తున్న సేవలకు రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కాల్‌చేసిన వారిలో నూటికి 90 శాతం మంది సంతృప్తి వ్యక్తంచేస్తు­న్నారు. సంతృప్తి ఈ స్థాయిలో ఉండడం నిజంగా గొప్ప విషయం. కాల్‌ సెంటర్‌ సిబ్బంది  కూడా చాలా ఓపిగ్గా వింటూ మర్యాదపూర్వకంగా సమాధానాలు చెబుతున్నారు.     – వై. అనురాధ, నోడల్‌ ఆఫీసర్, ఐసీసీ కాల్‌ సెంటర్‌ 

కాల్‌ సెంటర్‌ బలోపేతానికి చర్యలు 
దేశంలో మరెక్కడా లేని విధంగా మన రైతు సమాచార కేంద్రం అద్భుతంగా పనిచేస్తోంది. కాల్‌ సెంటర్‌ను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు హైదరాబాద్‌కు చెందిన బ్రేన్‌ ఎంటర్‌­ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ముందుకొచ్చింది. ఫోన్‌ రాగానే రైతుల సమస్యలన్నీ ఆటోమెటిక్‌గా సంబంధిత డీఆర్సీతో పాటు జిల్లా, మండల వ్యవసాయ శాఖాధికారులకు క్షణాల్లో చేరిపోతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను కూడా డిజైన్‌ చేస్తున్నాం.     – వల్లూరి శ్రీధర్, స్టేట్‌ కోఆర్డినేటర్, ఐïసీసీ కాల్‌ సెంటర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement