
న్యూఢిల్లీ: డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్‌లో మిగిలిన ప్రత్యక్ష వాటాను సైతం చైనీస్ కంపెనీ అలీబాబా తాజాగా విక్రయించింది. పేటీఎమ్ బ్రాండుతో సర్వీసులందించే వన్97లో బ్లాక్‌డీల్ ద్వారా 3.16 శాతం వాటాను అమ్మివేసినట్లు తెలుస్తోంది. డీల్ విలువ రూ. 1,360 కోట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతో అలీబాబాకు పేటీఎమ్‌లో ప్రత్యక్షంగా ఎలాంటి వాటా మిగల్లేదని తెలియజేశాయి.
2022 డిసెంబర్‌కల్లా 6.26 శాతం ప్రత్యక్ష వాటాను కలిగి ఉన్న అలీబాబా తొలుత ఈ జనవరిలో 3.1 శాతం వాటాను విక్రయించింది. కాగా.. గ్రూప్ సంస్థ యాంట్(ఏఎన్‌టీ) ఫైనాన్షియల్ ద్వారా పేటీఎమ్‌లో 25 శాతం వాటాను అలీబాబా కలిగి ఉన్న సంగతి తెలిసిందే. బ్లాక్‌డీల్ ద్వారా శుక్రవారం(10న) మొత్తం 2.8 కోట్ల పేటీఎమ్ షేర్లు విక్రయమైనట్లు తెలుస్తోంది. అలీబాబాతోపాటు ఇతరులు సైతం లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపట్టి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రూ. 645–655 ధరలో లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది.
బ్లాక్‌డీల్ నేపథ్యంలో పేటీఎమ్ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 8% పతనమై రూ. 651 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 640 వరకూ క్షీణించింది.
Comments
Please login to add a commentAdd a comment