అలీబాబాలో వాటా విక్రయించనున్న సాఫ్ట్ బ్యాంక్
టోక్యో: చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాలో ఉన్న తనకున్న వాటాలో కొంత భాగాన్ని విక్రయించనున్నది సాఫ్ట్‌బ్యాంక్. రుణ భారం తగ్గించుకోవడం కోసం అలీబాబాలో ఉన్న వాటాలో దాదాపు 7.9 బిలియన్ డాలర్లకు సమానమైన భాగాన్ని విక్రయిస్తామని సాఫ్ట్‌బ్యాంక్ పేర్కొంది. సాఫ్ట్‌బ్యాంక్ ఇటీవల అమెరికాకు చెందిన మొబైల్ కంపెనీ స్ప్రింట్‌ను 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం వంటి తదితర కారణాల వల్ల బ్యాంక్ ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. దీని రుణ భారం మార్చి చివరి నాటికి 106 బిలియన్ డాలర్లుకు చేరినట్లు తెలుస్తోంది. అలీబాబాలోని పెద్ద షేర్‌హోల్డర్లలో సాఫ్ట్‌బ్యాంక్ కూడా ఒకటి. వాటా విక్రయం జరిగితే అలీబాబాలో 32.2%గా ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ వాటా 28%కి తగ్గనున్నది. విక్రయించనున్న వాటాలో 2 బిలియన్ డాలర్ల విలువైన వాటాను అలీబాబానే కొనుగోలు చేసే అవకాశం ఉంది.