న్యూఢిల్లీ: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ నుంచి పెట్టుబడుల జపనీస్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ పూర్తిగా వైదొలగింది. పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ పేమెంట్ తదితర సేవలందించే వన్97లో సాఫ్ట్‌బ్యాంక్ 2017లో దశలవారీగా 150 కోట్ల డాలర్లు(సుమారు రూ. 12,525 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. అయితే ఈ పెట్టుబడులపై 10–12 శాతం నష్టానికి పేటీఎమ్ నుంచి పూర్తిగా బయటపడినట్లు తెలుస్తోంది. వెరసి పెట్టుబడులపై 15 కోట్ల డాలర్ల(సుమారు రూ. 1,250 కోట్లు) నష్టం వాటిల్లినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తొలుత భారీ వాటా
సాఫ్ట్‌బ్యాంక్ తొలుత అంటే 2021 పబ్లిక్ ఇష్యూకి ముందు పేటీఎమ్‌లో 18.5 శాతం వాటా పొందింది. ఎస్‌వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్(కేమన్) ద్వారా 17.3 శాతం, ఎస్‌వీఎఫ్ పాంథర్(కేమన్) లిమిటెడ్ ద్వారా మరో 1.2 శాతం వాటాను కలిగి ఉంది. ఐపీవోలో పూర్తి వాటాను ఎస్‌వీఎఫ్ పాంథర్ 22.5 కోట్ల డాలర్ల(రూ. 1,689 కోట్లు)కు విక్రయించింది. ఈ సమయంలోనే సొంత ప్రణాళికలకు అనుగుణంగా సాఫ్ట్‌బ్యాంక్ 24 నెలల్లోగా మిగిలిన వాటాను అమ్మివేయనున్నట్లు ప్రకటించింది. నిజానికి పేటీఎమ్‌లో వాటాను షేరుకి రూ. 800 సగటు ధరలో సాఫ్ట్‌బ్యాంక్ చేజిక్కించుకుంది.
లిస్టింగ్‌లో డీలా
ఇష్యూ ధర షేరుకి రూ. 2,150కాగా.. పేటీఎమ్ 9 శాతం తక్కువగా రూ. 1,955 ధరలో లిస్టయ్యింది. తదుపరి ధర పతనమవుతూ వచ్చింది. సహచర సంస్థ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(పీపీబీఎల్)ను ఆర్‌బీఐ నిõÙధించడంతో షేరు ధర మరింత దిగజారింది. ఈ ఏడాది మే 9న చరిత్రాత్మక కనిష్టం రూ. 310ను తాకింది. పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై నిషేధం నేపథ్యంలో గతేడాది(2023–24) చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో రూ. 550 కోట్ల నష్టాలను ప్రకటించింది. ఈ కాలంలో పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాల భవిష్యత్ అనిశ్చితుల రీత్యా పీపీబీఎల్‌లో రూ. 227 కోట్ల పెట్టుబడుల(39 శాతం వాటా)ను రద్దు చేసింది.
ఈ బాటలో మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 1,422 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అయితే అంతక్రితం ఏడాది(2022–23)లో రూ. 1,776 కోట్లకుపైగా నష్టం వాటిల్లిన విషయం విదితమే. కాగా.. 7 నెలల క్రితం యూఎస్ బిలియనీర్ వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథవే సైతం పేటీఎమ్ నుంచి నష్టాలకు వైదొలగడం గమనార్హం! షేరుకి దాదాపు రూ. 1,280 ధరలో కొనుగోలు చేసిన బెర్క్‌షైర్ నవంబర్‌లో రూ. 877.3 సగటు ధరలో అమ్మివేసింది. దీంతో రూ. 2,179 కోట్ల పెట్టుబడులకుగాను రూ. 1,371 కోట్లు అందుకుంది.
గత వారాంతాన పేటీఎమ్ షేరు బీఎస్‌ఈలో 2.5 % నష్టంతో రూ. 467 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment