ఎంటర్ ద ‘డ్రాగన్’...
అలీబాబా రికార్డు లిస్టింగ్
* అమెరికాలో అతి పెద్ద ఐపీఓగా చరిత్ర
* ఐపీఓ ధర 68; 92.70 డాలర్ల వద్ద లిస్ట్
* మార్కెట్ క్యాప్ 200 బిలియన్ డాలర్ల పైకి
న్యూయార్క్: చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా.... అమెరికా స్టాక్ మార్కెట్లో చరిత్రలో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) రికార్డును సొంతం చేసుకుంది. ఒక్కో షేరుకు 68 డాలర్ల ఆఫర్ ధర చొప్పున 21.8 బిలియన్ డాలర్లను(రూ.1,30,800 కోట్లు) సమీకరించింది. శుక్రవారం న్యూయార్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్(నాస్‌డాక్)లో ఏకంగా 92.70 డాలర్లకు కంపెనీ షేరు లిస్ట్ కావడంతో ఈ షేర్లను దక్కించు కున్న ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. ఐపీఓ ద్వారా మొత్తం 32 కోట్ల షేర్లను ఆఫర్ చేశారు. లిస్టింగ్ ప్రారంభ ధర ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్-మొత్తం షేర్ల విలువ) తొలిరోజే 228 బిలియన్ డాలర్లను (రూ.13,68,000 కోట్లు) తాకడం విశేషం. ఆఫర్ ధర ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ 168 బిలియన్ డాలర్లు.
వీసా, ఫేస్‌బుక్‌లు వెనక్కి...
ఇప్పటిదాకా అమెరికా స్టాక్ మార్కెట్‌లో విసా ఇన్‌కార్పొరేటెడ్ అతిపెద్ద ఐపీఓగా నిలుస్తూ వస్తోంది. 2008లో ఐపీఓకి వచ్చిన ఈ కంపెనీ 19.7 బిలియన్ డాలర్లను సమీకరించింది. ఇక 2012లో వచ్చిన ఫేస్‌బుక్ ఐపీఓ సమీకరణ విలువ 16 బిలియన్ డాలర్లు. ఫేస్ బుక్ ఒక్కో షేరును గరిష్టంగా 38 డాలర్లకు ఆఫర్ చేయగా.. లిస్టింగ్ రోజున షేరు ధర గరిష్టంగా 45 డాలర్లకు ఎగసింది. చివరకు 38 డాలర్ల స్థాయిలోనే ముగిసింది. దీని ప్రకారం ఫేస్‌బుక్ మార్కెట్ విలువ 104 బిలియన్ డాలర్లు(రూ.6,24,000 కోట్లు). తాజాగా(లిస్టింగ్‌కు రెండేళ్ల తర్వాత) ఈ కంపెనీ మార్కెట్ విలువ 200 బిలియన్ డాలర్లను అధిగమించడం తెలిసిందే.
అయితే, అలీబాబా ఐపీఓ లిస్టింగ్ తొలి రోజే 200 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అధిగమించడం విశేషం. ఇప్పటిదాకా ప్రపంచంలో అతిపెద్ద ఐపీఓగా చైనాకు చెందిన అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా నిలిచింది. ఇప్పుడు రెండో అతిపెద్ద ఐపీఓగా కూడా చైనా కంపెనీ అలీబాబాయే నిలవడం విశేషం. 2010లో హాంకాంగ్ మార్కెట్‌లో లిస్టయిన అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా... 22.1 బిలియన్ డాలర్లను సమీకరించింది. కాగా, ఇప్పటిదాకా అమెరికాలోని టెక్నాలజీ ఐపీఓల్లో ఫేస్‌బుక్ నంబర్ వన్ స్థానంలో నిలుస్తూవస్తుండగా... దీన్ని కూడా అలీబాబా వెనక్కినెట్టింది. కాగా, నాస్‌డాక్‌లో ‘బాబా’ పేరుతో అలీబాబా స్టాక్ ట్రేడవుతోంది. మరోపక్క, మార్కెట్ విలువ పరంగా ప్రపంచ టెక్నాలజీ కంపెనీల్లో నాలుగో స్థానానికి అలీబాబా చేరింది. తొలి మూడు స్థానాల్లో యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ కొనసాగుతున్నాయి.
యాహూకి జాక్‌పాట్..
అమెరికాలో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)గా చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా రికార్డు సృష్టిస్తే.. అందులో కీలక వాటాదారుగా ఉన్న యాహూ కంపెనీ బంపర్ జాక్‌పాట్‌తో బిలియన్లకొద్దీ డాలర్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఐపీఓ లిస్టింగ్ ద్వారా గరిష్టంగా 140 మిలియన్ షేర్లకుపైగా విక్రయించిన యాహూకి సుమారు 8.3-9.5 బిలియన్ డాలర్ల మొత్తం(పన్ను చెల్లింపునకు ముందు) లభించనున్నట్లు అంచనా. ఐపీఓలో వాటా విక్రయం తర్వాత కూడా యాహూ అలీబాబాలో దాదాపు 16 శాతం వాటాను(దాదాపు 40 కోట్ల షేర్లు) కొనసాగించనుంది.
అపార్ట్‌మెంట్ నుంచి అగ్రస్థానానికి..
* చైనాలో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా వెలుగొందుతున్న అలీబాబాను చైనా ఎంట్రప్రెన్యూర్ జాక్ మా... హాంగ్‌ఝూలోని చిన్న అపార్ట్‌మెంట్ కేంద్రంగా ప్రారంభించారు.
* 1999లో తొలిసారిగా అలీబాబా.కామ్ పేరుతో ఈ-కామర్స్(బిజినెస్ టు బిజినెస్.. అంటే ఉత్పత్తిదారులకు, ట్రేడర్లకు అనుసంధానకర్తగా) పోర్టల్‌ను మొదలుపెట్టారు.
* చైనాలోని ఆన్‌లైన్ షాపింగ్ మార్కెట్లో అలీబాబా వాటా ఇప్పుడు 80%కిపైనే. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ స్థాయికి ఎగబాకింది కూడా.
* అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఈ-బేల మొత్తం స్థూ అమ్మకాల విలువ కంటే జూన్‌తో ముగిసిన 2013-14 ఆర్థిక సంవత్సరంలో అలీబాబా అమ్మకాల విలువే(276 బిలియన్ డాలర్లు) ఎక్కువ.
* కాగా, 2013-14 ఏడాది(మార్చి 31తో ముగిసిన)లో కంపెనీ నికర లాభం 3.77 బిలియన్ డాలర్లుగా ఉంది. మొత్తం ఆదాయం 8.46 బిలియన్ డాలర్లలో లాభం 44.7%.
* కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతున్న జాక్ మా(49 ఏళ్లు) ప్రస్తుతం వాటా 9 శాతంగా ఉంది. ఆఫర్ షేరు ధర 68 డాలర్ల ప్రకారం దీని విలువ 10 బిలియన్ డాలర్లుగా అంచనా.
* ఐపీఓ ద్వారా 12.8 మిలియన్ షేర్లను మా విక్రయించారు. దీని విలువ(షేరుకి 68 చొప్పున) 86.7 కోట్ల డాలర్లుగా అంచనా.