ముంబై : భారత రిటైల్ రంగంలో భారీ జాయింట్ వెంచర్‌కు రంగం సిద్ధమవుతుందని... రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్‌తో చైనా ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబా చేతులు కలుపబోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, వీటిలో ఎలాంటి ఆధారాలు లేవని, ఊహాగాహనాల వార్తలు మాత్రమేనని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి తేల్చిచెప్పారు.
రిలయన్స్ రిటైల్‌లో 50 శాతం వాటాను 5 బిలియన్ డాలర్లకు అలీబాబా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని, దీనిపై చర్చలు కూడా జరిగాయని వార్తలు వచ్చాయి. కానీ తమ రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌లో వాటాలు కొనుగోలు చేసేందుకు అలీబాబా కానీ, మరే ఇతరులు కూడా చర్చలు జరుపలేదని రిలయన్స్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ప్రకటన పూర్తిగా ఊహాగానాలేనని, అత్యంత బాధ్యతారహితమైనవని చెప్పారు.
అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్‌మా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీతో ఈ ప్రతిపాదనపై జూలై చివరిలో చర్చలు జరిపినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. కానీ జాక్‌మా, తమ చైర్మన్‌ను అసలు ముంబైలో కలువనే లేదని పేర్కొన్నారు.
పేటీఎం మాదిరి రిలయన్స్ రిటైల్ తీసుకురావాలని చూస్తున్నారని రిపోర్టులు చక్కర్లు కొట్టాయి. అయితే ‘రిలయన్స్ రిటైల్ ఇప్పటికే అతిపెద్ద రిటైల్ కంపెనీ. అంతేకాక వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న, ఎక్కువగా లాభాలార్జిస్తున్న కంపెనీ. తమ వృద్ధి ప్రణాళికలను ఇటీవల జరిగిన ఏజీఎంల్లో షేర్‌హోల్డర్స్‌తో చైర్మన్ పంచుకున్నారు. అప్పటి నుంచి ఇక ఎలాంటి కొత్త అప్‌డేట్ లేదు’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి తేల్చి చెప్పారు. రిలయన్స్ రిటైల్‌తో అలీబాబా జతకట్టబోతుందని వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తమేమంటూ క్లారిటీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment