నిషేధం ఉన్నా.. నిశ్శబ్దంగా విస్తరిస్తున్నాయ్‌ | Chinese apps are thriving in India, despite being banned for almost a year | Sakshi
Sakshi News home page

నిషేధం ఉన్నా.. నిశ్శబ్దంగా విస్తరిస్తున్నాయ్‌

Published Tue, Aug 31 2021 3:52 AM | Last Updated on Tue, Aug 31 2021 3:52 AM

Chinese apps are thriving in India, despite being banned for almost a year - Sakshi

దేశ భద్రతకు ముప్పు కారణంతో కేంద్ర ప్రభుత్వం పలు చైనా యాప్‌లపై నిషేధం విధించిన నేపథ్యంలో డ్రాగన్‌ కంపెనీలు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నాయి. వివిధ యాప్‌లకు యాజమాన్య సంస్థగా వేరే కంపెనీని ముందు పెట్టి తెర వెనుక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. భారత మార్కెట్లో నిశ్శబ్దంగా విస్తరిస్తున్నాయి. గతేడాది నిషేధం వేటు పడిన ఆలీబాబా, బైట్‌డ్యాన్స్‌ వంటి కంపెనీలే ఈ యాప్‌లను వెనుక నుంచి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలు తమ యాప్‌లను కొత్త సంస్థల పేర్లతో లిస్ట్‌ చేస్తున్నాయి.

యాప్‌ల యాజమాన్యం గురించి ఎక్కువగా బైట సమాచారం పొక్కకుండా, చైనా మూలాల గురించి తెలియకుండా జాగ్రత్తపడుతున్నాయి. దేశీయంగా టాప్‌ 60 యాప్‌ల్లో 8 చైనాకి చెందినవి ఉన్నట్లుగా ఒక పరిశోధనలో తేలింది. వీటికి ప్రతి నెలా సగటున 21.1 కోట్ల మంది యూజర్లు ఉంటున్నారు. చైనా యాప్‌లను గతేడాది జూలైలో నిషేధించినప్పుడు ఇవే యాప్‌ల యూజర్ల సంఖ్య 9.6 కోట్లే. కానీ గడిచిన 13 నెలల్లో ఈ సంఖ్య ఏకంగా 11.5 కోట్ల మేర పెరగడం .. నిషేధం ఉన్నా చైనా యాప్‌లు ఎంత వేగంగా వృద్ధి చెందుతున్నాయో చెబుతోంది.

చైనాతో సరిహద్దుల్లోనూ, దౌత్యపరంగాను ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం గతేడాది చైనా యాప్‌లపై కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఏకంగా 267 చైనా యాప్‌లను నిషేధించింది. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, పబ్‌జీ, హెలో, అలీఎక్స్‌ప్రెస్, లైకీ, షేర్‌ఇట్, మి కమ్యూనిటీ, వుయ్‌చాట్, బైదు సెర్చి, క్యామ్‌స్కానర్, వీబో, బిగో లైవ్‌తో పాటు షావోమీ సంస్థకు చెందిన కొన్ని యాప్‌లు వీటిలో ఉన్నాయి. దేశ ప్రజలు, వారి డేటా భద్రత కారణాల రీత్యా హోం శాఖ సిఫార్సుల మేరకు వీటిపై నిషేధం విధించినట్లు కేంద్రం అప్పట్లో వెల్లడించింది. అయితే, దాదాపు అదే తరహా యాప్‌లు కొత్త అవతారంలో నిశ్శబ్దంగా చాప కింద నీరులాగా విస్తరిస్తుండటం గమనార్హం.  

అత్యధికం మీడియా, వినోద రంగానివే..  
కొత్తగా పుట్టుకొస్తున్న వాటిల్లో చాలా మటుకు యాప్‌లు.. మీడియా, వినోద రంగానికి చెందినవే. 2020లో నిషేధం వేటు పడిన టిక్‌టాక్‌ (యాజమాన్య సంస్థ బైట్‌డ్యాన్స్‌), శ్నాక్‌వీడియో (క్వాయ్‌షో) వంటి సంస్థలు ఇదే విభాగంలో హవా కొనసాగించడం గమనార్హం. ఈ విభాగంలో పెద్ద సంఖ్యలో యూజర్లకు త్వరితగతిన చేరువ కావడానికి వీలుంటుంది కాబట్టి మీడియా, వినోద రంగాలనే చైనా కంపెనీలు ఎక్కువగా ఎంచుకుంటున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దానికి తగ్గట్లే నిషేధం అనంతరం కొత్తగా వచ్చిన వాటిలో కొన్ని యాప్‌లు కేవలం నెలల వ్యవధిలోనే లక్షల కొద్దీ యూజర్లను నమోదు చేసుకోవడం ఈ వాదనలకు ఊతమిస్తోంది.

ఈ యాప్‌లలో కొన్ని పైరసీని ఎరగా చూపి యూజర్లను ఆకర్షిస్తున్నాయి. భారత్‌లో అత్యంత వేగంగా ఎదుగుతున్న చైనా యాప్‌లలో ప్లేఇట్‌ ఒకటి. ఇది ప్రధానంగా పైరసీని అడ్డం పెట్టుకుని వేగంగా వృద్ధి చెందింది. వివిధ వీడియోలను ప్లే చేయడంతో పాటు నెట్‌ఫ్లిక్స్, ఎంఎక్స్‌ప్లేయర్, సోనిలివ్‌ వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంల నుంచి షోలు, సినిమాల కాపీలను డౌన్‌లోడ్‌ చేసుకుని, చూసుకునేందుకు ప్లేఇట్‌ యాప్‌ వీలు కల్పిస్తోంది. పలు యాప్‌లు .. యూజర్ల డివైజ్‌లో ఉన్న సమా చారం, వీడియోలు, ఫొటోలకు సంబంధించిన డేటాను సేకరిస్తున్నాయి. ఆఖరికి యూజరు ఉన్న ప్రాంతాన్ని కూడా ట్రాక్‌ చేయగలుగుతున్నాయి. ఎంతో ఆకర్షణీయంగా ఆయా యాప్‌లు ఉంటున్నాయి.

గుట్టుచప్పుడు కాకుండా లిస్టింగ్‌..
గూగుల్‌ ప్లే స్టోర్‌లో పలు చైనా యాప్‌లు అసలు యాజమాన్య సంస్థ పేరుతో కాకుండా వేరే కంపెనీ పేరుతో లిస్టయి ఉంటున్నాయి. ఫలితంగా వెనుక ఉండి నడిపిస్తున్న అసలు సంస్థ ఆనవాళ్లు దొరకపుచ్చుకోవడం కష్టసాధ్యంగా మారుతోంది. అయితే, ఆయా కార్పొరేట్‌ కంపెనీల వెబ్‌సైట్లలో వాటి భాగస్వామ్య సంస్థల వివరాలు, యాజమాన్యానికి సంబంధించి పబ్లిక్‌గా ఉన్న రికార్డులు, సిబ్బంది నియామకాలకు సంబంధించి లింక్డ్‌ఇన్‌ వంటి పోర్టల్స్‌ను సదరు సంస్థలు ఉపయోగిస్తున్న విధానాన్ని నిశితంగా పరిశీలిస్తే అసలు విషయం అవగతమవుతుంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న పలు యాప్‌లకు, గతంలో నిషేధం వేటుపడిన యాప్‌లకు యాజమాన్య సంస్థ ఒకటే అన్నది తెలుస్తుంది.

చాలా సందర్భాల్లో నిషేధించిన యాప్‌ల ఉద్యోగులనే కొత్త యాప్‌లకు ఆయా కంపెనీలు మారుస్తున్నట్లు లింక్డ్‌ఇన్‌ డేటా బట్టి చూస్తే అర్థమవుతుంది. భారత ప్రభుత్వం నిషేధించిన టిక్‌టాక్‌ యాప్‌ మాజీ హెడ్‌ .. ఈ ఏడాది జూలైలో బైట్‌డ్యాన్స్‌లో మరో విభాగానికి మారినట్లుగా లింక్డ్‌ఇన్‌ వివరాలు చూపడం ఇందుకు నిదర్శనం. మరోవైపు, భద్రత ఏజెన్సీలు ఏవైనా హెచ్చరికలు, సిఫార్సులు చేసిన తర్వాతే ఆయా యాప్‌లపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతేడాది కూడా దేశభద్రత కారణాలతో హోం శాఖ సిఫార్సుల మేరకే కేంద్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ పలు యాప్‌ల నిషేధానికి ఆదేశాలిచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement