భారత్‌ పై అలీబాబా కన్ను..! | Beautiful time for India and China to do business, says Alibaba's Jack Ma | Sakshi
Sakshi News home page

భారత్‌ పై అలీబాబా కన్ను..!

Published Thu, Nov 27 2014 12:42 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

భారత్‌ పై అలీబాబా కన్ను..! - Sakshi

భారత్‌ పై అలీబాబా కన్ను..!

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ రంగంలో జగజ్జేతగా దూసుకెళ్తున్న చైనా దిగ్గజం అలీబాబా... భారత్ ఆన్‌లైన్ మార్కెట్‌పై దృష్టి సారిస్తోంది. ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టడంతోపాటు టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్లతో కలిసి పనిచేస్తామని అలీబాబా వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈఓ జాక్ మా పేర్కొన్నారు. భారత్‌లో తొలి పర్యటనలో భాగంగా బుధవారమిక్కడ ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అలీబాబా కంపెనీ అమెరికా స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూతో రికార్డు సృష్టించి 25 బిలియన్ డాలర్ల మొత్తాన్ని సమీకరించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ 300 బిలియన్ డాలర్లకు చేరువలో ఉంది.

 చిన్న వ్యాపారులకు అండదండలు...
 ‘ఇంటర్నెట్ అనేది ఇప్పుడు అపార అవకాశాలున్న నవ వ్యాపారం. అంతేకాదు ఇది యువత నైపుణ్యంతో దూసుకెళ్తున్న వ్యాపారం కూడా. కోట్లాది మంది యువశక్తితో తొణికిసలాడుతున్న గొప్ప దేశం భారత్. నేను పూర్వాశ్రమంలో ఉపాధ్యాయుడిగా పనిచేశా. ఇంటర్నెట్ అనేది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. భారత్ రూపురేఖలను కూడా ఇదే ఇంటర్నెట్ సమూలంగా మార్చేయగలదని నేను కచ్చితంగా చెప్పగలను. అందుకే ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు నేను కట్టుబడి ఉన్నా.

భారతీయ ఔత్సాహిక వ్యాపారవేత్తలు(ఎంట్రప్రెన్యూర్స్), టెక్నాలజీ సంస్థలు, నిపుణులతో కలిసి పనిచేస్తా’ అని జాక్ మా పేర్కొన్నారు. అనేక భారతీయ వ్యాపార సంస్థలు తమ వెబ్‌సైట్లలో సెల్లర్లుగా నమోదై ఉన్నారని.. భారత్‌కు చెందిన చాక్లెట్లు, సుగంధ ద్రవ్యాలు, టీ ఇతరత్రా ఉత్పత్తులను 4 లక్షలకు పైచిలుకు చైనా కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారని ఆయన తెలిపారు. మరిన్ని అద్భుత ఉత్పత్తులను చైనాకు విక్రయించే సత్తా భారత్ ఉందని కూడా జాక్ మా అభిప్రాయపడ్డారు.

 స్నాప్‌డీల్‌లో వాటాపై కన్ను!
 భారత్ పర్యటనలో ఇక్కడి స్థానిక వ్యాపారులతో జాక్ మా భేటీ కానున్నారు. తద్వారా మరిన్ని భారతీయ ఉత్పత్తులను అలీబాబా ద్వారా విక్రయించేందుకు వీలుకల్పించనున్నారు. అదేవిధంగా దేశీ ఈ-కామర్స్ మార్కెట్లోకి కూడా అడుపెట్టే సన్నాహాల్లో అలీబాబా ఉంది. ప్రస్తుతం భారత్‌లో ఆన్‌లైన్ పరిశ్రమ జోరందుకుంటున్న సంగతి తెలిసిందే. దేశీ కంపెనీ అయిన స్నాప్‌డీల్‌లో అలీబాబా ఇన్వెస్ట్‌చేసే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం.

 చైనా అపర కుబేరుడు...
 50 ఏళ్ల జాక్ మా.. కంపెనీ పబ్లిక్ ఇష్యూ తర్వాత  చైనా అపర కుబేరుల్లో నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత సంపద విలువ 24.4 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.1,50,000 కోట్లు)గా అంచనా. 1999లో అలీబాబాను చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్ రాజధాని అయిన హోంగ్‌ఝూలో ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో ఆయన నెలకొల్పారు.  

రీసెర్చ్ సంస్థ ఐడీసీ గణాంకాల ప్రకారం ప్రస్తుతం అలీబాబా ప్రపంచలోనే అతిపెద్ద ఆన్‌లైన్, మొబైల్ కామర్స్ కంపెనీగా అవతరించింది. 2013 సంవత్సరంలో కంపెనీ స్థూల లావాదేవీల విలువ(జీఎంవీ) ఆధారంగా దీన్ని నిర్ణయించారు. కాగా, చైనా రిటైల్ మార్కెట్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాదికి అలీబాబా గ్రూప్ వెబ్‌సైట్లకు 30.7 కోట్ల మంది వార్షిక యాక్టివ్ కొనుగోలుదారులు నమోదయ్యారు. నెలవారీ యాక్టివ్ కస్టమర్లు కూడా 21.7 కోట్లకు పెరిగినట్లు ఐడీసీ అంచనా.

 అలీబాబా పేరు వెనుక...
 అలీబాబా.. అరేబియన్ జానపద కథల్లో సుప్రసిద్ధమైన ఈ పేరును ఒక చైనా కంపెనీ వాడుకోవడమేంటి? దీని వెనుక పెద్ద కథే ఉంది. పేరు గురించి జాక్ మా ఏమన్నారంటే... ‘అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలోని  ఒక కాఫీ షాపులో ఉండగా.. ఈ పేరును నా కంపెనీకి పెడితే చాలా బాగుంటుందని భావించా. వెంటనే అక్కడ వెయిట్రెస్‌ను పిలిచి అలీబాబా ఎవరో నీకు తెలుసా అంటే వెంటనే అవునని సమాధానం చెప్పింది. ఏం తెలుసని అడిగా. ‘ఓపెన్ సెసేమ్(అలీబాబా నలభై దొంగలు కథలో నిధి ఉన్న గుహను తెరిచేందుకు వాడే మంత్రం)’ అని చెప్పింది. అప్పుడే అనుకున్నా ఇదే సరైన పేరని.

 ఆతర్వాత ఆ వీధిలోని మరో 30 మందిని కూడా ఈ పేరు గురించి వాకబు చేశా. ఇందులో జర్మన్లు, భారతీయులు, జపనీస్, చైనీస్ ఇలా అన్ని దేశాలవారూ ఉన్నారు. వాళ్లంతా కూడా తమకు తెలుసనే చెప్పారు. ఇది సులభంగా పలికేందుకు వీలుండటమేకాకుండా.. ప్రపంచమంతటికీ పరిచయం ఉన్న పేరు కాబట్టే మా వెబ్‌సైట్‌కు దీన్ని ఖాయం చేశాను. మా దృష్టిలో అలీబాబా... ఓపెన్ సెసేమ్ అంటే..  చిన్న వ్యాపార సంస్థలకు ఇదో నిధి, గేట్‌వే లాంటిదని అర్థం.’ అని వివరించారు.

 మోదీపై ప్రశంసల జల్లు...
 భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై జాక్ మా ప్రశంసలు కురిపించారు. ‘మోదీ ప్రసంగాన్ని నేను విన్నా. చాలా ఉత్తేజభరితంగా, స్ఫూర్తినింపేలా ఉంది. ఒక వ్యాపారవేత్తగా నేను కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. గొప్ప దేశాలైన భారత్, చైనా కలిసికట్టుగా పనిచేస్తే మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. అందుకు ఇదే సరైన సమయం. ఇరు దేశాల్లోని ఎంట్రప్రెన్యూర్లకు కూడా ఇది గొప్ప అవకాశంగా నిలుస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement