పేటీఎంలోకి ఆలీబాబా మరో రూ.1,200 కోట్లు!
న్యూఢిల్లీ: పేటీఎం ఈ–కామర్స్ సంస్థలో చైనా ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా, మరో ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ఎస్‌ఏఐఎఫ్ (సెయిఫ్) పార్ట్‌నర్స్ దాదాపు 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,350 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఆలీబాబా సింగపూర్ ఈ–కామర్స్ సంస్థ 177 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1,200 కోట్లు), మిగతా మొత్తం సెయిఫ్ పెట్టుబడి పెట్టనున్నాయి.
తాజా పెట్టుబడుల అనంతరం పేటీఎం ఈ–కామర్స్‌లో ఆలీబాబా సింగపూర్ ఈ–కామర్స్ వాటాలు 36.31 శాతంగాను, సెయిఫ్ పార్ట్‌నర్స్ వాటా 4.66 శాతంగాను ఉండనున్నాయి. ఈ డీల్‌తో పేటీఎం వేల్యుయేషన్ దాదాపు 1 బిలియన్ డాలర్లకు చేరనుంది. గతంలో 60 మిలియన్ డాలర్లు సమీకరించినప్పుడు పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ వేల్యుయేషన్ 4.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వన్ 97 కమ్యూనికేషన్స్‌కి ప్రస్తుతం పేటీఎం ఈ–కామర్స్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం మొబైల్ సొల్యూషన్స్ అనే మూడు వ్యాపార విభాగాలు ఉన్నాయి.
దేశీ సంస్థ ఫ్లిప్‌కార్ట్, అమెరికన్ ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ ఆధిపత్యం చెలాయిస్తున్న దేశీ ఈ–కామర్స్ మార్కెట్లో చోటు దక్కించుకునేందుకు ప్రస్తుత డీల్ ఆలీబాబాకు ఉపయోగపడనుంది. దూకుడుగా దూసుకెళుతున్న అమెజాన్ తన మార్కెట్ వాటాను గణనీయంగా పెంచుకుంటోంది. మరోవైపు, నిధుల కొరతతో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సంస్థలు సతమతమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆలీబాబా రాక.. దేశీ ఆన్‌లైన్ రిటైల్ పరిశ్రమ ఓ కుదుపు కుదపగలదని పరిశీలకుల అంచనా. 2015లో 11 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్ 2016 చివరికి 14–16 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది 2020 ఆర్థిక సంవత్సరం నాటికి 69 బిలియన్ డాలర్లకు చేరుతుందని కన్సల్టెన్సీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ అంచనా.