
'నాడు హార్వార్డ్ నన్ను పదిసార్లు వద్దంది'
చైనా: ప్రముఖ ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ మరోసారి ఆన్‌లైన్‌లో దూసుకుపోతోంది. రెండుసార్లు ఎంత వైరల్ అయిందో ఇప్పుడు కూడా అంతేస్థాయిలో ఈ వీడియో అందరినీ ఆకర్షిస్తోంది. దావోస్‌లో అలీబాబా వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈ ఎఫ్) సంస్థకు 2015లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత అంశాలతోపాటు తన కంపెనీ విజయం సాధించడానికి గల కారణాలు వెల్లడించారు. ఆ వీడియోను మరోసారి డబ్ల్యూఈఎఫ్ ఫేస్‌బుక్‌లో పబ్లిష్ చేయగా మూడు నిమిషాల నిడివి ఉన్న ఇది కాస్త ఇప్పటికే దాదాపు 17.4మిలియన్లమందిని ఆకట్టుకుంది. ఇందులో జాక్ మా ఏం చెప్పారంటే..
'నేను హర్వార్డ్ యూనివర్సిటీకి పదిసార్లు దరఖాస్తు చేసుకున్నా తిరస్కరించారు. చైనాలోని మా నగరానికి అప్పుడే కేఎఫ్‌సీ వచ్చింది. అందులో ఇంటర్వ్యూకు 24మంది వెళ్లాం. 23మందిని తీసుకొని ఒకరిని తిరస్కరించారు. ఆ ఒక్కడిని నేనే. నేను పెట్టిన అలీబాబా కంపెనీ విజయానికి కారణం మహిళలే. నా కంపెనీలో 47శాతంమంది మహిళలే ఉన్నారు. నాకు తొలుత ఈ ప్రపంచాన్ని మార్చాలి అనిపించేది. కానీ తర్వాత తెలుసుకున్నాను ముందు మారాల్సింది నేనే అని. అలాగే మారాను. ఈ రోజు నీ దగ్గర కొన్ని మిలియన్ల డాలర్ల డబ్బు ఉండొచ్చు. కానీ, ఆ డబ్బు ఈ సమాజమే ఇచ్చిందనే విషయం మర్చిపోవద్దు' అంటూ ఇలా ఎన్నో విషయాలు పంచుకున్న వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.