రిలయన్స్‌ రిటైల్‌తో అలీబాబా జట్టు! | Alibaba in talks with Reliance Retail for joint venture | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ రిటైల్‌తో అలీబాబా జట్టు!

Published Tue, Aug 21 2018 12:47 AM | Last Updated on Tue, Aug 21 2018 12:47 AM

Alibaba in talks with Reliance Retail for joint venture - Sakshi

ముంబై: భారత రిటైల్‌ రంగంలో భారీ జాయింట్‌ వెంచర్‌కు రంగం సిద్ధమవుతోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్‌ రిటైల్‌తో చైనా ఈ కామర్స్‌ దిగ్గజ సంస్థ, అలీబాబా చేతులు కలపనున్నది. ఈ రెండు సంస్థలు కలసి భారత్‌లో భారీ రిటైల్‌ జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ప్రపంచంలో వేగంగా వృద్ది చెందుతున్న మార్కెట్‌గా అవతరించిన భారత్‌లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల జోరుకు చెక్‌ పెట్టడానికి ఈ జాయింట్‌వెంచర్‌ను ఏర్పాటు చేయాలని ఇరు సంస్థలు యోచిస్తున్నాయని సమాచారం. 

అలీబాబా ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జాక్‌ మా గత నెల చివర్లో ముంబైలో రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీతో కలిసి చర్చలు జరిపారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ భేటిలో ఇరువురూ పలు అంశాలపై చర్చలు జరిపారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ చర్చల్లో భాగంగా రిలయన్స్‌ రిటైల్‌లో 50 శాతం వరకూ వాటాను కొనుగోలు చేయాలని అలీబాబా సంస్థ యోచిస్తోందని, దీని కోసం ఆ సంస్థ 500–600 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

అలీబాబాకు స్వల్పమైన వాటాతో ఇరు సంస్థలు కలిసి వ్యూహాత్మక జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం.   భారీ డిజిటల్‌మార్కెట్‌ ప్లేస్‌ను ఏర్పాటు చేసే విషయం కూడా చర్చలు జరిగాయని సంబంధిత వర్గాలు తెలపాయి. ఒక వేళ ఈ డీల్‌ సాకారమైతే, భారత్‌లో అలీబాబాకు ఇదే అతి పెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌ అవుతుంది.  ఈ విషయంలో అలీబాబాకు గోల్డ్‌మన్‌ శాక్స్‌ సలహాదారుగా వ్యవహరిస్తోంది. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి గోల్డ్‌మన్‌  శాక్స్‌ ప్రతినిధి నిరాకరించారు.  

మొత్తం మీద భారత ఈ కామర్స్‌ రంగంలో భారీ పోరుకు తెర లేవనున్నది.  నిధులు పుష్కలంగా ఉన్న రెండు దిగ్గజ సంస్థలు(ఆమెజాన్‌ వర్సెస్‌ ఆలీబాబా) భారత ఈ కామర్స్‌ మార్కెట్లో అగ్రస్థానం కోసం పోటీ పడనున్నాయి. ఈ పోటీ కారణంగా వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణుల అంచనా. మరోవైపు  ఈ డీల్‌ అలీబాబాకు అత్యంత కీలకం కానున్నది. 

ఈ సంస్థకు 49 శాతం వాటా ఉన్న పేటీఎమ్‌కు ఇటీవలనే ఆర్‌బీఐ వినియోదార్ల డేటా విషయమై హెచ్చరిక జారీ చేసింది. పేటీఎమ్‌ కస్టమర్ల డేటాను ఈ చైనా కంపెనీ యాక్సెస్‌ చేస్తోందని ఆర్‌బీఐ ఆనుమానిస్తోంది. కాగా రిలయన్స్‌ రిటైల్‌ 5,200 పట్టణాల్లో మొత్తం 8,533 స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఏడాది కాలానికి రిలయన్స్‌ రిటైల్‌ రూ.2,529 కోట్ల స్థూల లాభం సాధించింది. ఈ కంపెనీ టర్నోవర్‌ 1,000 కోట్ల డాలర్లను దాటేసింది.  

‘ప్రపంచాన్ని మార్చే’ కంపెనీల జాబితాలో రిలయన్స్‌ జియోకు అగ్రస్థానం
ఫార్చ్యూన్‌ సంస్థ రూపొందించిన ప్రపంచాన్ని మార్చే కంపెనీల జాబితాలో రిలయన్స్‌ జియోకు అగ్రస్థానం దక్కింది. ఈ జాబితాలో రెండో స్థానంలో ఫార్మా దిగ్గజం మెర్క్, మూడో స్థానంలో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలు నిలిచాయి. ఐదో స్థానాన్ని  చైనాకు చెందిన అలీబాబా సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement