అలీబాబా దోస్తీతో నెస్లే పరుగులు
Published Mon, Jun 6 2016 5:24 PM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM
చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాతో భాగస్వామ్యంలో ప్రపంచ అతిపెద్ద ఫుడ్ రిటైలర్ నెస్లే పరుగులు పెడుతోంది. ఆన్ లైన్ అమ్మకాలను పెంచుకోడానికి అలీబాబాతో భాగస్వామ్యాన్ని మొదలుపెట్టింది. కొత్త డిజిటల్ మార్కెటింగ్ విధానాలతో నెస్లే విభిన్న ఉత్పత్తులను అలీబాబాలో ఆవిష్కరించనున్నట్టు కంపెనీ పేర్కొంది. కాఫీ నుంచి బేబీ ఫార్ములా వరకు 30 బ్రాండ్లను అలీబాబా ఫ్లాట్ ఫామ్ లో అమ్మకాలకు పెట్టనున్నట్లు తెలిపింది. వినియోగదారులను పెంచుకోడానికి అలీబాబాతో ఈ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నామని ఆసియన్, ఓషియేసియన్, ఆఫ్రికన్ మార్కెట్లను పర్యవేక్షించే నెస్లే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెండ్ వాన్ లింగ్ మార్టె తెలిపారు.
అంతర్జాతీయంగా అన్ని దేశాల కంటే చైనా మార్కెట్ ఆన్ లైన్ అమ్మకాల్లో ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. రాబోయే 150 ఏళ్ల మార్కెట్ వృద్ధికి చైనా మార్కెట్టే తగినదని.. సరి కొత్త మార్కెటింగ్ విధానాలను త్వరగా అర్థం చేసుకోవడంలో చైనా కస్టమర్లే ముందంజలో ఉన్నారని చెప్పారు. మ్యాగీ అమ్మకాలు మళ్లీ మార్కెట్లలోకి వచ్చాక, నెస్లే సంస్థ స్నాప్ డీల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. గతేడాది చివర్లో అలీబాబాతోనూ భాగస్వామ్యం కుదుర్చుకుంది. చైనాలో సగం నెస్లే అమ్మకాలు ఆన్ లైన్ లోనే జరిగాయని కంపెనీ పేర్కొంది. చైనాలో ఆన్ లైన్ కొనుగోలు 2011 జనవరి నుంచి 2016 ఏప్రిల్ వరకు 12 రెట్లు పెరిగాయని, తలసరి వినియోగం కూడా 27శాతం పెరిగిందని అలీబాబా ఫైనాన్షియల్ సర్వీసు ప్లాట్ ఫామ్ యాంట్ ఫైనాన్షియల్, ప్రైవేట్ ఎకనామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది. చాలా మంది యువత షాపింగ్ కు ఆన్ లైన్ నే ఆశ్రయిస్తున్నారని అలీబాబా సీఈవో ఝాంగ్ తెలిపారు.
Advertisement