పాలనా సంబంధ హెచ్చరికలతో లేఖ
న్యూఢిల్లీ: పాలనా సంబంధ నిబంధనలు ఉల్లంఘించినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి వన్97 కమ్యూనికేషన్స్ తాజాగా హెచ్చరికల లేఖను అందుకుంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆడిట్ కమిటీ లేదా వాటాదారుల అనుమతి లేకుండానే సహచర సంస్థ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్స్(పీపీబీఎల్)తో సంబంధిత పార్టీ లావాదేవీ(ఆర్‌పీటీ)లను నిర్వహించినట్లు లేఖలో సెబీ పేర్కొంది. అయితే సెబీ నిబంధనలను స్థిరంగా అమలు చేస్తున్నట్లు బీఎస్‌ఈకి దాఖలు వివరాలలో పేటీఎమ్ తెలియజేసింది. నిబంధనల అమలులో కంపెనీ అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నట్లు తెలియజేసింది.
అంతేకాకుండా సెబీకి వివరణను సైతం సమర్పించనున్నట్లు పేటీఎమ్ బ్రాండ్ డిజిటల్ చెల్లింపుల కంపెనీ వెల్లడించింది. కాగా, సెబీ లేఖ ప్రకారం పీపీబీఎల్, వన్97 కమ్యూనికేషన్స్ సంబంధ ఫైనాన్షియల్ తదితర సమాచారంపై సెబీ పరిశీలన చేపట్టింది. దీనిలో నిబంధనలు పాటించని అంశం గుర్తించింది. ఆడిట్ కమిటీ లేదా వాటాదారుల అనుమతి లేకుండానే ఆర్‌పీటీలలో పేటీఎమ్ లేదా అనుబంధ సంస్థలు పీపీబీఎల్‌తో అధిక లావాదేవీలు చేపట్టినట్లు సెబీ పేర్కొన్నట్లు వన్97 బీఎస్‌ఈకి తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment