సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఫాస్టాగ్ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. శుక్రవారానికి రాష్ట్రంలో ఫాస్టాగ్ వాహనాల సంఖ్య లక్ష మార్కును దాటింది. శుక్రవారం రాత్రి వరకు అమ్ముడైన మొత్తం ఫాస్టాగ్‌ల సంఖ్య 1.06 లక్షలకు చేరుకుంది. శుక్రవారం నుంచి సంక్రాంతి పండగ రద్దీ మొదలైన నేపథ్యంలో జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద టోల్ చెల్లింపునకు క్యూలు ఏర్పడకుండా ఊరట కలిగించే విషయమిది. వచ్చే 4 రోజుల్లో నగరం నుంచి సొంతూళ్లకు 25 లక్షల మందికిపైగా వెళ్లనున్నారు.
రాష్ట్రంలోని 17 ప్రాంతాల్లో ఉన్న టోల్‌ప్లాజాల వద్ద రుసుము చెల్లించేవారితో రద్దీ ఏర్పడనుంది. ప్రస్తుతం నగదు రూపంలో టోల్ చెల్లించేందుకు 25 శాతం లేన్లు ఉన్నాయి. 75 శాతం లేన్లలో ఫాస్టాగ్ వాహ నాలకే అనుమతి ఉంది. ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు ప్రారంభించిన కొత్తలో, నగదు చెల్లించే వాహనాల సంఖ్యే ఎక్కువగా ఉండటం, వాటికి కేటాయించిన లేన్ల సంఖ్య తక్కువగా ఉండటంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయేవి.
డిసెంబర్ చివరికి వీటి సంఖ్య సగం సగంగా మారింది. ఇప్పుడు టోల్ గేట్ల నుంచి వెళ్లే వాహనాల్లో దాదాపు 51 శాతం వాహనాలు ఫాస్టాగ్‌వే ఉంటున్నాయి. టోల్ రూపంలో వసూలవుతున్న మొత్తంలో 63 శాతం ఫాస్టాగ్ ఉన్న వాహనాల నుంచే వస్తోంది. ఫాస్టాగ్ తీసుకున్న వాటిలో వాణిజ్య వాహనాలు ఎక్కువ ఉండటంతో వసూలయ్యే మొత్తం ఎక్కువే ఉంటోంది.
రద్దీ అధికంగా ఉంటే మరో లేన్....
రాష్ట్రంలో ఫాస్టాగ్ వాహనాల సంఖ్య లక్ష మించినందున సంక్రాంతి ప్రయాణ సమయాల్లో ఇబ్బంది ఉండకపోవచ్చని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు భావిస్తున్నారు. 14 తేదీ వరకు హైబ్రీడ్ విధానం అమలులో ఉండనుంది. అంటే 25% లేన్లు నగదు చెల్లింపులకు ఉంటాయి. ఒకవేళ ఫాస్టాగ్ లేని వాహనాలు ఎక్కువగాఉండి, నగదు చెల్లింపుకు ఎక్కువ సమయం పట్టేలా ఉంటే అదనంగా మరో లేన్‌ను కేటాయించే విషయాన్ని పరిశీలిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయాధికారి కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ఇక 15వ తేదీ నుంచి నగదు చెల్లింపులకు ఒక్క లేన్ మాత్రమే కేటాయించనున్నారు. తర్వాత కూడా నగదు లేన్ వద్ద రద్దీ అధికంగా ఉంటే కేంద్రం నుంచి అనుమతి తీసుకుంటామని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
పండుగ తర్వాతే..
ఇక రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న రహదారులపై సంక్రాంతి తర్వాతే ఫాస్టాగ్ విధానం ప్రారంభించాలని నిర్ణయించారు. హైదరాబాద్–రామగుండం రాజీవ్ రహదారిపై 3 ప్రాంతాల్లో ఉన్న టోల్‌ప్లాజాల వద్ద జనవరి 20–25 మధ్య ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపులు ప్రారంభించాలని శుక్రవారం ఆయా రోడ్లను నిర్వహించే కాంట్రాక్టర్లతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ మార్గంలో 3 ప్లాజాలకు సంబంధించి 28 లేన్లున్నాయి.
ఇక నార్కెట్‌పల్లి–అద్దంకి మార్గంలో ఉన్న ప్లాజా వద్ద ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ విధానం మొదలుకానుంది. ఇక్కడ ఏడు లేన్లు ఉండగా 5 ఫాస్టాగ్‌కు, 2 నగదు చెల్లించేందుకు కేటాయించనున్నారు. పరికరాల బిగింపుకయ్యే వ్యయాన్ని కాంట్రాక్టు సంస్థలే భరించనున్నాయి. ఆ ఖర్చును ప్రభుత్వమే భరించాలని కాంట్రాక్టు సంస్థలు డిమాండ్ చేయగా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ అంగీకరించలేదు.
Comments
Please login to add a commentAdd a comment