న్యూఢిల్లీ: జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను త్వరలో తీసుకురానున్నట్టు కేంద్ర రవాణా, రహదారులు, ఎంఎస్‌ఎంఈల శాఖల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. జాతీయ రహదారిపైకి ప్రవేశించిన పాయింట్ నుంచి దిగిపోయిన పాయింట్ వరకు.. ప్రయాణించిన మేరే టోల్ చార్జీలను ఇందులో చెల్లించొచ్చన్నారు. కాకపోతే ఈ వ్యవస్థ రావడానికి రెండేళ్లు పట్టొచ్చని చెప్పారు. జాతీయ రహదారులపై టోల్ వసూళ్ల కోసం ఫాస్టాగ్ విధానాన్ని తప్పనిసరి చేయడం వల్ల వాహనాల రద్దీ గణనీయంగా తగ్గినట్టు తెలిపారు. దీనివల్ల ఏటా రూ.20,000 కోట్ల మేర ఇంధనం రూపంలో ఆదా అవుతుందని, కనీసం రూ.10,000 కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని వివరించారు.
టోల్ ప్లాజాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన వ్యవస్థను మంత్రి సోమవారం ప్రారంభించారు. అదే విధంగా జాతీయ రహదారులకు రేటింగ్ వ్యవస్థను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి ఫాస్టాగ్‌ను దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. టోల్ ప్లాజాల వద్ద జాప్యాన్ని ఒక నిమిషం లోపునకే పరిమితం చేస్తామని మంత్రి చెప్పారు. టోల్ ప్లాజాలను ఆన్‌లైన్లోనే పర్యవేక్షించే వ్యవస్థ ఆదాయపన్ను, జీఎస్‌టీ, ఇతర అధికారులకు ముఖ్యమైన సాధనంగా మారుతుందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం రికార్డు స్థాయిలో రోజుకు 33 కిలోమీటర్లకు చేరుకున్నట్టు మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.11,035 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment