వసూళ్లు ఎక్కువ..వాహనాలు తక్కువ | Fastag Toll Charges Are Steadily Rising In Telangana | Sakshi
Sakshi News home page

వసూళ్లు ఎక్కువ..వాహనాలు తక్కువ

Published Mon, Dec 30 2019 2:46 AM | Last Updated on Mon, Dec 30 2019 2:46 AM

Fastag Toll Charges Are Steadily Rising In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫాస్టాగ్‌ టోల్‌ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఫాస్టాగ్‌ లేన్ల ద్వారా వస్తున్న ఆదా యం భారీగానే పెరుగుతోంది. ఫాస్టాగ్, క్యాష్‌ లేన్ల ద్వారా వస్తున్న ఆదాయం, వాహనాల రాకపోకల విషయంలో వింత పరిస్థితి తలెత్తుతోంది. ప్రస్తుతం తెలంగాణలో 58 శాతం టోల్‌ ఆదాయం ఎలక్ట్రానిక్‌ టోల్‌ చెల్లింపు విధానం (ఫాస్టాగ్‌ లేన్స్‌) ద్వారా వసూలవుతోంది. ఇది నాలుగైదు రోజుల్లో 60 శాతా నికి చేరుకుంటుందని అధికారుల అంచనా. ఫాస్టాగ్‌ గేట్లతో పోలిస్తే క్యాష్‌ లేన్ల నుంచే ఎక్కువ వాహనాలు దూసుకుపోతున్నాయి. రాష్ట్రంలో టోల్‌ ప్లాజాల మీదుగా వెళ్తున్న వాహనాల్లో 48% ఫాస్టాగ్‌ లేన్ల నుంచి, 52% క్యాష్‌ లేన్ల నుంచి వెళ్తున్నాయి. ఫాస్టాగ్‌ లేన్ల ద్వారా టోల్‌ వసూలు ఎక్కువగా, వాహనాల గమనం తక్కువగా ఉంది. క్యాష్‌ లేన్ల నుంచి వాహనాల సంఖ్య ఎక్కువగా, ఆదాయం తక్కువగా ఉంది. ఈ విరుద్ధ వ్యవహారం రాష్ట్రంలో నెలకొంది.

ఆదాయం అదుర్స్‌.. 
ఫాస్టాగ్‌ విధానం రావటానికి కొన్ని నెలల ముందే ప్రయోగాత్మకంగా అధికారులు పరిశీలిస్తూ వస్తున్నారు. కొన్ని లేన్లను ప్రత్యేకంగా వాటికోసం కేటాయించారు. నవంబర్‌ 15న రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న 17 టోల్‌ ప్లాజాల్లో ఫాస్టాగ్‌ లేన్ల నుంచి రూ.96 ఆదాయం మాత్రమే వచ్చింది. అదే క్యాష్‌ లేన్ల ద్వారా రూ.1.95 కోట్ల ఆదాయం వచ్చింది. అదే నెల 26న ఫాస్టాగ్‌ లేన్ల ద్వారా రూ.1.01 కోట్లు వస్తే, క్యాష్‌ లేన్ల ద్వారా రూ.1.59 కోట్లు వసూలయ్యాయి.

డిసెంబర్‌ 13న రూ.1.52 కోట్లు ఫాస్టాగ్‌ లేన్ల ద్వారా, రూ.1.44 కోట్లు క్యాష్‌ లేన్ల ద్వారా వచ్చింది. గత 2 రోజులుగా సగటున ఫాస్టాగ్‌ లేన్ల ద్వారా రూ.1.78 కోట్లు, క్యాష్‌ లేన్ల ద్వారా రూ.1.20 కోట్లు వసూలవుతోంది. ఈ వారాంతానికి ఫాస్టాగ్‌ ద్వారా రూ.2 కోట్లు, క్యాష్‌ లేన్ల ద్వారా రూ.1 కోటి వసూలయ్యే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఫాస్టాగ్‌ వల్ల సగటు ఆదాయం రూ.50 లక్షలు చొప్పు న పెరిగినట్టు అంచనా. మరో 2 రోజుల తర్వాత నెల రోజుల లెక్కలు విడుదల చేయనున్నారు.

పెరగని వాహనాల సంఖ్య.. 
ఫాస్టాగ్‌ వల్ల టోల్‌ చెల్లించే సమయంలో క్యూలో ఉండాల్సిన సమస్య ఉండదని తేలిపోయినా.. ఇంకా వాహనదారులతో కదలిక ఆశించిన వేగంగా ఉండట్లేదు. ఇప్పటికీ 72 వేల వాహనాలకు మాత్రమే రాష్ట్రంలో ఫాస్టాగ్‌ ట్యాగ్లు కొన్నారు. ట్యాగ్‌ లేని వాహనాలే ఎక్కువగా టోల్‌ గేట్ల నుంచి వెళ్తున్నాయి. గత 4 రోజులుగా టోల్‌గేట్ల నుంచి వెళ్తున్న వాహనాల్లో 52 శాతం ట్యాగ్‌ లేనివే ఉండటం విశేషం. వాణిజ్యపరమైన వాహనదారులు ఎక్కువగా, సొంత వాహనాలున్నవారు తక్కువగా ట్యాగ్లు కొంటున్నారు.

కమర్షియల్‌ వాహనాలు టోల్‌ ఎక్కువగా చెల్లిం చాల్సి ఉండటంతో ఫాస్టాగ్‌ వాహనాల సంఖ్య తక్కువగా ఉన్నా.. వాటి ద్వారా వసూలవుతున్న టోల్‌ ఎక్కువగా ఉంటోంది. ఫాస్టాగ్‌ రావటానికి 5 రోజుల ముందు నుంచి ట్యాగ్లు కొనుగోళ్ల వేగం పెరిగింది. సగటున రోజుకు 3 వేల వరకు ట్యాగ్స్‌ కొన్నారు. కొన్ని రోజులుగా సగటున రోజుకు 1,300 ట్యాగ్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి.

14 తర్వాత గందరగోళమే!
ప్రస్తుతం టోల్‌ ప్లాజాల వద్ద 25 శాతం దారులను హైబ్రీడ్‌ వేలుగా మార్చారు. వీటిల్లో ట్యాగ్‌ ఉన్నవాటిని లేని వాటిని అనుమతిస్తున్నారు. జనవరి 14 వరకు ఈ వెసులుబాటుంది. ఆ తర్వాత కేవలం ఒకటి చొప్పున (ఒకవైపు) గేట్లను మాత్రమే క్యాష్‌ చెల్లించేందుకు పరిమితం చేయనున్నారు. అంటే ఫాస్టాగ్‌ లేని వాహనాలన్నీ ఈ ఒక్క గేటు నుంచే ముందుకు కదలాల్సి ఉం టుంది. ఫాస్టాగ్‌ లేన్ల నుంచి వెళ్లే సాధారణ వాహనాలకు రెట్టింపు టోల్‌ వసూలు చేస్తారు. అదే సమయంలో సంక్రాంతి రద్దీ ఉండనుండటంతో టోల్‌గేట్ల వద్ద అయోమయ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది.

కేంద్రం గడువు పొడిగించకుంటే గందరగోళం తప్పదని అధికారులు కలవరపడుతున్నారు. మరో పక్షం రోజుల్లో వీలైనన్ని వాహనాలు ట్యాగ్లు కొంటేనే పరిస్థితి అదుపులో ఉం టుంది. కొనుగోళ్లు ఇదే మందగమనంలో ఉంటే క్యాష్‌ లేన్‌ వద్ద మళ్లీ కిలోమీటరు మేర క్యూలు తప్పేలా కనిపించటం లేదు. పండగ కోసం సొం తూళ్లకు వెళ్లేవారు ఇబ్బంది పడకతప్పేలా లేదు. కనీసం మరో పక్షం రోజులు హైబ్రీడ్‌ లేన్ల కొనసాగింపునకు కేంద్రం అనుమతిని పొడిగించాలన్న అభ్యర్థనలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement