
న్యూఢిల్లీ: టోల్ గేట్ల దగ్గర రద్దీని తగ్గించే దిశగా వాహనాలకు ఫాస్టాగ్‌లను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. ట్యాగ్ లేని వాహనాలకు టోల్ ఫీజు భారం రెట్టింపు కానుంది. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ (ఎన్‌హెచ్‌ఏఐ) ఒక ప్రకటనలో ఈ వివరాలు తెలిపింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లోని అన్ని లేన్లను ఫిబ్రవరి 15/16 అర్ధరాత్రి నుంచి ’ఫాస్టాగ్ లేన్లు’గా మారతాయని పేర్కొంది. ‘నిబంధనల ప్రకారం ఫాస్టాగ్ లేని వాహనాలు, చెల్లుబాటు కాని ఫాస్టాగ్ ఉన్న వాహనాలు గానీ ఫాస్టాగ్ లేన్‌లోకి వచ్చిన పక్షంలో రెట్టింపు ఫీజు వర్తిస్తుంది‘ అని ఎన్‌హెచ్‌ఏఐ వివరించింది.
డిజిటల్ విధానం ద్వారా టోల్ ఫీజుల చెల్లింపును ప్రోత్సహించేందుకు, ప్లాజాల దగ్గర నిరీక్షించే సమయాన్ని, ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు కొత్త నిబంధనలు తోడ్పడగలవని తెలిపింది. 2016లో తొలిసారిగా ఫాస్టాగ్‌లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1 నుంచి నాలుగు చక్రాల ప్యాసింజర్ వాహనాలు, గూడ్స్ వాహనాలకు ఫాస్టాగ్ అమర్చడాన్ని తప్పనిసరి చేసింది. ఆ తర్వాత డెడ్‌లైన్‌ను ఫిబ్రవరి 15 దాకా పొడిగించింది.
ఇక డెడ్‌లైన్ పొడిగించేది లేదు: మంత్రి గడ్కరీ
ఫాస్టాగ్ అమలుకు సంబంధించిన డెడ్‌లైన్‌ను మరింత పొడిగించే ప్రసక్తే లేదని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. గడువును ఇప్పటికే రెండు, మూడు సార్లు పొడిగించామని పేర్కొన్నారు. వాహనదారులు ఇకపై తప్పనిసరిగా ఫాస్టాగ్ తీసుకోవాల్సిందేనన్నారు. కొన్ని రూట్లలో ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ 90 శాతం దాకా ఉంటోందని, తీసుకోని వారి సంఖ్య కేవలం పది శాతమే ఉండొచ్చని మంత్రి చెప్పారు. టోల్ ప్లాజాల దగ్గర కూడా ఇది అందుబాటులో ఉంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment