అగనంపూడి టోల్‌ప్లాజ్ వద్దనున్న ఒకే ఒక్క క్యాష్ లైన్
సాక్షి, విశాఖపట్నం : జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద అన్ని లైన్లలోనూ ఫాస్టాగ్ ద్వారానే వాహనాల నుంచి టోల్‌ట్యాక్స్ వసూలు విధానం ఫిబ్రవరి 15వ తేదీ నుంచి అమలు కానుంది. వాస్తవానికి జనవరి 1వ తేదీ నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండగ నేపథ్యంలో సెలవులకు దూరప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో రాకపోకలు సాగించే వాహనాలను దృష్టిలో ఉంచుకుని ఈ గడువును పొడిగించింది. ఆ మేరకు టోల్‌ప్లాజాల వద్ద ప్రస్తుతం ఉన్నట్లుగానే ఒక్క క్యాష్ లైను కొనసాగుతుంది. ఫిబ్రవరి 15వ తేదీలోగా ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్లు శత శాతం పూర్తి చేయాలనే లక్ష్యంతో వాహనదారుల్లో అవగాహన కలిగించడానికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫాస్టాగ్ అనేది ఎలక్ట్రానిక్ టోల్ వసూలు విధానం. దీన్ని కొనుగోలు చేసి ఆ యాప్‌ను అప్‌లోడ్ చేసుకుంటే టోల్ నగదు రూపంలో చెల్లించనక్కర్లేదు. వాహనదారులు టోల్‌ప్లాజా వద్ద ఆగకుండా గేట్లలో నుంచి నేరుగా వెళ్లిపోవచ్చు. వాహనం అద్దంపై ఉన్న ఫాస్టాగ్ స్టిక్కర్‌ను స్కానర్లు గ్రహించడం ద్వారా టోల్ రుసుం ఫాస్టాగ్ కార్డు నుంచి చెల్లింపు జరుగుతుంది. ఏడాది కిందటే ఈ విధానం అమల్లోకి వచ్చింది. కానీ ఇప్పటివరకూ ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాల సంఖ్య 80 శాతం మాత్రమే ఉంది. వీటి కోసం టోల్‌ప్లాజాల వద్ద మూడు గేట్లు కేటాయించారు. నగదు రూపేణా టోలు చెల్లించే వాహనదారులకు ఒకే ఒక్క లైన్ ఉంది. దీంతో అక్కడ వాహనాలు బారులు తీరుతున్నాయి. ఒక్కోసారి ఆ వాహనాలు ఫాస్టాగ్ లైన్లలోకి వెళ్లిపోతుండడంతో ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ వాహనాలకు అడ్డంకి ఏర్పడుతోంది. దీనివల్ల కాలహరణే గాకుండా వివాదాలకు కారణమవుతోంది. ఈ దృష్ట్యా జనవరి 1వ తేదీ నుంచి టోల్‌ప్లాజాల వద్దనున్న అన్ని లైన్లనూ ఫాస్టాగ్‌గా మార్చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రజాప్రతినిధులు, కొన్ని అసోసియేషన్ల నుంచి విజ్ఞాపనలు రావడంతో ఈ గడువును ఫిబ్రవరి 15వ తేదీ వరకూ పొడిగించింది. (ఫాస్టాగ్ ఉంటేనే రాయితీలు)
‘లోకల్’ వాహనాలతోనే ఇబ్బంది
జిల్లాలో నక్కపల్లితో పాటు విశాఖ నగరంలో అగనంపూడి, పోర్టు అనుసంధాన మార్గంలోని పంచవటి, డాక్‌యార్డు టోల్‌ప్లాజాలు ఉన్నాయి. నక్కపల్లి టోల్‌ప్లాజా రాజమండ్రి రీజియన్‌లో ఉంది. మిగతా మూడు విశాఖ రీజియన్ పరిధిలో ఉన్నాయి. జిల్లాలోని టోల్‌ప్లాజాల్లో అగనంపూడి, నక్కపల్లి జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 16)పై ఉండడంతో ఇవి ఎంతో కీలకమైనవి. కరోనా నేపథ్యంలో సొంత లేదా అద్దె కార్లలో ప్రయాణించేవారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అగనంపూడి వద్ద సగటున రోజుకు 75 వేల వాహనాల తాకిడి ఉంటోంది. వాటిలో ప్రస్తుతం ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ ఉన్నవి 80 శాతం వరకే ఉంటున్నాయి. ఫాస్టాగ్ లేని వాహనాల్లో అధిక శాతం స్థానికంగా తిరిగేవేనని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు గుర్తించారు. వాహనదారులంతా ఫాస్టాగ్ తీసుకుని సహకరిస్తే జాతీయ రహదారిపై ప్రయాణంలో కాలహరణ లేకుండా ఉంటుందని చెబుతున్నారు.
ఫాస్టాగ్ ట్యాగ్‌లపై అవగాహన కల్పిస్తున్నాం
స్థానిక వాహనదారులు తాము ఎక్కువగా ప్రయాణించే ప్రాంతంలోని టోల్‌ప్లాజాకు మాత్రమే వర్తించేలా ఫాస్టాగ్ ట్యాగ్ తీసుకుంటే సరిపోతుంది. టోల్‌ప్లాజాలతో పాటు ఎన్‌హెచ్‌పైనున్న పెట్రోల్ పంపులు, ఆర్‌టీవో కార్యాలయాలు, ట్రాన్స్‌పోర్టు హబ్‌లు, ప్రజాసేవా కేంద్రాలు (సీఎస్‌సీ), బ్యాంకుల వద్ద ఫాస్టాగ్ ట్యాగ్ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశాం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, పేటీఎం, బ్యాంకింగ్ మొబైల్ యాప్స్, మై ఫాస్టాగ్ యాప్, సుఖద్‌యాత్ర యాప్‌తో పాటు ఎన్‌హెచ్‌ఏఐ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనిపై వాహనదారుల్లో అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తున్నాం.
– పి.శివశంకర్, ప్రాజెక్టు డైరెక్టర్, ఎన్‌హెచ్‌ఏఐ విశాఖ రీజియన్
Comments
Please login to add a commentAdd a comment