సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై ఎట్టకేలకు అన్ని వాహనాల రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్ పడింది. తాజా లాక్‌డౌన్ ఆదేశాల (జీవో 68) ప్రకారం 158 కిలోమీటర్ల రహదారిపై అనుమతి ఉన్న అన్ని వాహనాలకు ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు, భారీ వాహనాలకు మాత్రం 24 గంటల పాటు రాకపోకలు సాగించొచ్చని హెచ్‌ఎండీఏ, సైబరాబాద్, రాచకొండ పోలీసులు సంయుక్త ఆదేశాలిచ్చారు. అయితే మంగళవారం నుంచే ఓఆర్‌ఆర్‌పై అన్ని వాహనాల రాకపోకలకు ఎంట్రీ ఇవ్వకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, నిర్ణయం తీసుకోవడంలో ఇరు ప్రభుత్వ విభాగాలు తాత్సారం చేస్తున్న అంశాలను ప్రస్తావిస్తూ ‘ఔటర్‌పై డౌట్’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది.
దీనిపై స్పందించిన హెచ్‌ఎండీఏ అధికారులు అన్ని వాహన రాకపోకలకు బుధవారం రాత్రి 12 గంటల నుంచి అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే విషయాన్ని సైబరాబాద్, రాచకొండ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాహన రాకపోకలపై మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి నిత్యావసర సరుకులు, అత్యవసర వైద్యసేవల వాహనాలకు మాత్రమే అనుమతి ఉండేదని, ఇక నుంచి అన్ని వాహనాల రాకపోకలు సాగుతాయని, అయితే కొన్ని అంక్షలు ఉంటాయని పేర్కొన్నారు.
(చదవండి: ఔటర్‌పై డౌట్!)
రాత్రిళ్లు అనుమతి లేదు..
రాజధానితో పాటు శివారు ప్రాంతాల రహదారులపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని ఓఆర్‌ఆర్‌లో వాహన రాకపోకలను అనుమతిచ్చారు. అయితే చిన్న, తేలికపాటి వాహనాలు (కారులు, చిన్న సరుకు రవాణా వాహనాలు) కర్ఫ్యూ సమయమైన రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతించరు. ఎక్కువ వేగంతో వెళ్లే వాహనాలు తక్కువ వేగంతో వెళ్లే వాహనాలను ఢీకొట్టే అవకాశం ఉండటంతో రాత్రి సమయాల్లో రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భారీ వాహనాలను విశ్రాంతి కోసంఓఆర్‌ఆర్‌పై నిలిపేస్తున్నారు. ఆ సమయంలో వేగంగా వచ్చే వాహనాలు వీటిని ఢీ కొడితే రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉండటంతో చిన్న, తేలికపాటి వాహన రాకపోకలను రాత్రి పూట నిషేధించారు.
నిబంధనలు పాటించాల్సిందే..
ఓఆర్‌ఆర్‌పై తొలి 2 లేన్లు (సెంట్రల్ మీడియన్‌కు పక్కనే ఉండే కుడివైపు లేన్లు) గంటకు 100 కిలోమీటర్ల వేగంతో, ఎడమవైపు లేన్లలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలి. ప్రయాణికులను తీసుకెళ్లే గూడ్స్ వెహికల్స్‌ను ఓఆర్‌ఆర్‌లో అనుమతించరు. అలాంటి వాటి వివరాలను టోల్ సిబ్బంది సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి అప్పజెప్పుతారు. ‘సురక్షితమైన ప్రయాణం కోసం ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలి. వేగ పరిమితి మించొద్దు. లేన్ రూల్స్ అనుసరించాలి. గతంలోలాగే స్పీడ్ లేజర్ గన్ కెమెరాలతో వాహనాలు వేగాన్ని పసిగట్టి ఈ–చలాన్లు జారీ చేస్తాం’అని సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీలు విజయ్‌కుమార్, దివ్యచరణ్‌రావు తెలిపారు.
ఫాస్ట్‌టాగ్ చెల్లింపులకే ప్రాధాన్యం
ప్రజారోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్‌ఆర్ టోల్‌గేట్ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని హెచ్‌ఎండీఏ నిర్దేశించింది. ఓఆర్‌ఆర్ టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ టాగ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. డిజిటల్ పేమెంట్ పద్ధతిలో ఫాస్ట్‌టాగ్ చెల్లింపులకు అవకాశం ఉంటుంది. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలు చెల్లించాలని హెచ్‌ఎండీఏ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment