
సాక్షి, హైదరాబాద్: టోల్‌ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా వాహనాలు ముందుకు వెళ్లేలా ఉద్దేశించిన ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానం రాష్ట్ర రహదారులపై అందుబాటులోకి రావడానికి జాప్యమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న 17 టోల్‌గేట్ల వద్ద ఈ విధానం ప్రారంభించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ అన్ని ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 1వ తేదీనే ప్రారంభించాల్సి ఉన్నా దేశవ్యాప్తంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కానీ రాష్ట్రంలో మాత్రం అప్పటికే అన్నీ సిద్ధం చేసి పెట్టారు. ఈ నెల 15న రాష్ట్రంలోని జాతీయ రహదారులపై సాఫీగానే ప్రారంభం కానుంది. కానీ రాష్ట్ర రహదారుల విషయానికి వచ్చే సరికి సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర రహదారులపై 4 టోల్‌ప్లాజాలా వద్ద కూడా దీన్ని ప్రారం భించాల్సి ఉంది.
ఫాస్టాగ్‌కు సంబంధించి యంత్ర పరికరాల ఏర్పాటు ఖర్చును ఎవరు భరించాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కాంట్రాక్టర్లకు మధ్య స్పష్టత కుదరలేదు. ఒక గేటుకు మాత్రం ఖర్చులో 50 శాతం కేంద్రం భరించనుంది. మిగతా గేట్లకు సంబంధించిన ఖర్చులను మాత్రం స్థానికంగా సర్ధుబాటు చేసుకోవాలి. ఈ విషయంలో ప్రభుత్వం సహకరించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. దీనిపై వారం, పది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 58 వేల ఫాస్టాగ్‌లు అమ్ముడైనట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment