Separate Lane For TSRTC Buses at Toll Plazas Over Sankranti Fever - Sakshi
Sakshi News home page

టీఎస్‌ఆర్టీసీ బస్సులకు టోల్‌ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్‌

Published Sat, Jan 7 2023 8:41 PM | Last Updated on Sat, Jan 7 2023 8:55 PM

Separate lane for TSRTC buses at toll plazas over sankranti fever - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) చర్యలు చేపడుతోంది. టోల్‌ప్లాజాల వద్ద సులువుగా ఆర్టీసీ బస్సులు వెళ్లేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రధాన మార్గాల్లోని టోల్‌ ప్లాజాల వద్ద టీఎస్‌ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్‌లను కేటాయించాలని కోరుతూ నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌.హెచ్‌.ఎ.ఐ), తెలంగాణ ఆర్‌ అండ్‌ బీ విభాగాలకు లేఖలు రాసింది. ఇదే అంశంపై టోల్‌ ప్లాజా నిర్వాహకులనూ సంప్రదించింది. తమ సంస్థ బస్సులకు ప్రత్యేక లేన్‌ను కేటాయించాలని అభ్యర్థించింది. అందుకు ఆయా విభాగాలు అంగీకరించాయి. ఈ నెల 10 నుంచి 14 తేదీ వరకు టీఎస్‌ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్‌ను కేటాయిస్తామని హామీ ఇచ్చాయి. 

ఈ నేపథ్యంలో టోల్‌ ప్లాజాల వద్ద టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. రద్దీ ఎక్కువగా ఉండే  హైదరాబాద్‌-విజయవాడ మార్గంలోని పతంగి, కోర్లపహాడ్‌, హైదరాబాద్‌-వరంగల్‌ మార్గంలోని గూడురు, హైదరాబాద్‌-సిద్దిపేట మార్గంలోని దుద్దేడ, హైదరాబాద్‌-నిజామాబాద్‌ మార్గంలోని మనోహరబాద్‌, హైదరాబాద్‌-కర్నూలు మార్గంలోని రాయికల్‌ టోల్‌ ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. ఆయా టోల్‌ ప్లాజాల వద్ద ఆరుగురు ఆర్టీసీ సిబ్బంది మూడు షిప్ట్‌ల్లో 24 గంటలపాటు విధులు నిర్వహించనున్నారు. ఆర్టీసీ బస్సులు ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక లేన్‌ నుంచి బయటకు వెళ్లేందుకు స్థానిక పోలీసుల సహకారం కూడా టీఎస్‌ఆర్టీసీ తీసుకుంటోంది. 

సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌, ఎంజీబీఎస్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లను టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వాటి ద్వారా రద్దీ సమయాల్లో టోల్‌ ప్లాజాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పడు ఆర్టీసీ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే చర్యలు తీసుకుంటారు.

"సంక్రాంతికి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. 4,233 ప్రత్యేక బస్సులను ఈ నెల 10 నుంచి 14వ తేది వరకు నడుపుతున్నాం.  అలాగే, ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్‌ను కేటాయించాలని ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్‌ అండ్‌ విభాగాలను కోరాం. మా అభ్యర్థనను వారు అంగీకరించారు. ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లి టోల్‌ ప్లాజాల వద్ద ఇబ్బందులు పడే కన్నా.. టీఎస్‌ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ ఈ సంక్రాంతికి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించండి. ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు." అని ప్రజలకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement