అఫ్జల్‌గంజ్: విధి నిర్వహణలో ఆయనదో విలక్షణ ముద్ర. పోలీస్ అధికారిగా ఆయనది సంచలన చరిత్ర. ఏ శాఖలో పనిచేసినా తనదైన శైలిలో దూసుకువెళ్లే ప్రత్యేకత. ఆయనే ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలోనే ఆర్టీసీలో ఎన్నో సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. సంస్థ అభివృద్ధికి, ప్రయాణికుల అభిమానాన్ని చూరగొనేందుకు ఇతోధికమైన కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం మహాత్మా గాంధీ బస్‌స్టేషన్‌లో ఆయన పర్యటించారు.
బస్సులోకి వెళ్లి డ్రైవర్లను ఆప్యాయంగా పలకరించారు. ప్రయాణికులకు నమస్కరించారు. వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. బస్సులో ఓ తల్లి ఒడిలో ఉన్న చిన్నారిని ఎత్తుకుని అలరించారు. ఆర్టీసీ ప్రచార కళాకారులతో కలిసి ఫొటో దిగారు. సంక్రాంతి వేళ భారీ రద్దీ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటించి గమ్యస్థానాలకు సురక్షితంగా వెళ్లాలని ప్రయాణికులకు ఆయన సూచించారు. ఎంతైనా సజ్జనార్.. సజ్జనారే!
పండగ రద్దీ
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ కోసం సిటీ నుంచి జనం బుధవారం కూడా భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఏపీ, టీఎస్ ఆర్టీసీలతోపాటు ప్రైవేట్ బస్సులు కిక్కిరిసిపోయాయి. విజయవాడ, విశాఖపట్టణం, రాజమండ్రి, అమలాపురం తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ నిండిపోయాయి. పండగ రద్దీతో ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్ తదితర ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి.
Comments
Please login to add a commentAdd a comment