జిల్లా సరిహద్దు ప్రాంతమైన కొడికొండ చెక్‌పోస్టు పరిధిలోని కోడూరు నుంచి పుట్టపర్తి, ధర్మవరం, బత్తలపల్లి, నాయనపల్లి క్రాస్, తాడిపత్రి, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లి, నంద్యాల, ప్రకాశం జిల్లా గిద్దలూరు, మార్కాపురం, తోకపల్లి మీదుగా గుంటూరు, విజయవాడకు 570 కిలోమీటర్ల మేర ఉన్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్పు చేయనున్నారు.
సాక్షి, అనంతపురం : రాష్ట్ర రాజధానిగా విజయవాడను ప్రకటించిన నేపథ్యంలో సీమ జిల్లాల నుంచి అక్కడికి వెళ్లేందుకు ప్రధాన రహదారి మార్గాన్ని సూచిస్తూ జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సీఎం పేషీ నుంచి జిల్లా జాతీయ రహదారులు అధికారులకు అందిన ఆదేశాల మేరకు వారు ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ప్రస్తుతం
ఆ ఫైలు కేంద్ర ట్రాన్స్‌పోర్టు కమిషనర్ నితిన్ గడ్కారి పరిశీలనకు వెళ్లింది.
వివరాల్లోకెళ్తే.. ఏప్రాంతమైనా వాణిజ్యపరంగా అభివృద్ధి చెందాలంటే రోడ్డు మార్గంతో పాటు విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు అవసరం. ఈ విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఎక్కడికక్కడ విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను రోడ్డు మార్గంతో అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలోని రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్పు చేస్తూ.. క్రిష్ణా జిల్లాలోని క్రిష్ణపట్నం, బందరు పోర్టులను అనుసంధానించేలా చర్యలు తీసుకుంటోంది.
ఈ నేపథ్యంలో ఆర్‌అండ్‌బి రోడ్లను జాతీయ రహదారులుగా మార్పు చేయడానికి అనుమతి కోరుతూ.. కేంద్ర ట్రాన్స్‌పోర్టు మంత్రి నితిన్ గడ్కారికి ఫైలును పంపించారు. ప్రస్తుతం ఆ ఫైలు ఆయన వద్ద పెండింగ్‌లో ఉంది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే భూసేకరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. అయితే అధికారులు తయారు చేసిన రూట్ మ్యాప్‌లో ఐదు జిల్లాలు కవర్ కానున్నాయి. అనంతపురం జిల్లాలో కవర్ అవుతున్న కోడూరు, పుట్టపర్తి, ధర్మవరం, బత్తలపల్లి, నాయనపల్లిక్రాస్,తాడిపత్రి రోడ్డు నాలుగు లైన్ల రోడ్డుగా మారనుంది.
మంగళూరు పోర్టుకు మరో మార్గం
రాష్ట్ర రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే అని తేలిపోవడంతో కర్ణాటకలోని మంగళూరు పోర్టు నుంచి నిజాం పోర్టుకు కనెక్టివిటీ ఉండేలా మార్గాన్ని సర్వే చేయించాలన్న ఎమ్మెల్సీ తిప్పేస్వామి ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం జాతీయ రహదారుల అధికారులను సర్వేకు ఆదేశించింది. ఈ మేరకు సర్వే చేసిన అధికారులు జిల్లా సరిహద్దులోని కోడూరు నుంచి లేపాక్షి, హిందూపురం, మడకశిర మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని శిర నుంచి మంగళూరు పోర్టు, అక్కడి నుంచి నిజాంపోర్టుకు రహదారులను అనుసంధానం చేస్తూ అధికారులు మారో రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ ఫైలు కూడా ప్రస్తుతం కేంద్ర మంత్రి అనుమతి కోసం వేచి ఉంది.
ప్రతిపాదనలు పంపాము..
రాజధానిగా విజయవాడను ప్రకటించాక.. అనంతపురం జిల్లా నుంచి విజయవాడకు దగ్గర మార్గం చూపిస్తూ ప్రతిపాదనలు పంపించాలని సీఎం పేషీ నుంచి మాకు అదేశాలు వచ్చాయి. ఆ మేరకు సర్వే చేసి 570 కిలోమీటర్ల మేర రహదారిని సూచిస్తూ ప్రతిపాదనలు పంపా ము. ఈ రహదారి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి గడ్కారీ నుంచి అనుమతి రావాల్సి ఉంది.
- వైఆర్ సుబ్రమణ్యం, ఎన్‌హెచ్ అనంతపురం సర్కిల్ ఎస్‌ఈ
అనంత టు విజయవాడ
Published Sun, Sep 7 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement
Advertisement