∙పి.ఎస్. శ్రీనివాసులు నాయుడు, కర్నూలు
భారతీయ మహిళల వస్త్రధారణలో చీరకు ఉన్న ప్రత్యేకత ఎన్నటికీ వన్నె తరగనిది. భారత ఉపఖండానికి మాత్రమే పరిమితమైన చీర ఇప్పుడిప్పుడే పాశ్చాత్యులనూ ఆకట్టుకుంటోంది. కాలం తెచ్చిన మార్పుల్లో చీరకట్టు కొంత వెనుకబడింది. ఆధునిక జీవనశైలి ఆదరాబాదరాగా మారడంతో మగువలు సులువుగా ధరించడానికి వీలయ్యే సల్వార్ కమీజ్‌లు, జీన్స్, టీ షర్ట్స్ వంటి దుస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయినప్పటికీ పండుగలు, వేడుకలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల వేళల్లో మాత్రం పట్టుచీరల రెపరెపలు నిండుగా కనువిందు చేస్తున్నాయి. పట్టుచీరల డిజైన్లలోను, వాటి జరీ అంచుల తీరుల్లోను కొత్త కొత్త ఫ్యాషన్లు పుట్టుకొస్తున్నాయి.
దేశంలోని కొన్ని ప్రదేశాలు చేనేతకు చిరునామాలుగా తమ ప్రత్యేకతను ఇంకా నిలుపుకొంటూ వస్తున్నాయి. అలాంటి ప్రదేశాల్లో కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు ఒకటి. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు చేనేతకు పెట్టింది పేరు. విజయనగర సామ్రాజ్యకాలం నుంచే ఇక్కడ నిపుణులైన నేతగాళ్లు ఉండేవాళ్లు. తర్వాతి కాలంలో వనపర్తి సంస్థానాధీశులు, హైదరాబాద్ నవాబులు ఇక్కడి చేనేత వస్త్రాలను బాగా ఆదరించేవారు. స్వాతంత్య్రానికి మునుపే, 1938లో ‘పద్మశ్రీ’ మాచాని సోమప్ప ఇక్కడ ఎమ్మిగనూరు చేనేతకారుల సహకార సంఘాన్ని ప్రారంభించారు. ఇక్కడి చేనేతకారులు మగ్గాల మీద చీరలతో పాటు రుమాళ్లు, తువ్వాళ్లు, పంచెలు, దుప్పట్లు, దోమతెరలు వంటివి కూడా నేస్తున్నారు. తొలినాళ్లలో నూలు వస్త్రాలను నేసే ఇక్కడి చేనేతకారులు, 1985 నుంచి పట్టుచీరల నేత కూడా ప్రారంభించారు.
శుభకార్యాల్లో పట్టుచీరలకే ప్రాధాన్యం
చీరల్లో రకరకాల ఫ్యాషన్లు వస్తున్నాయి. పండుగలు పబ్బాలు, వేడుకలు, శుభకార్యాలలో సందర్భానికి తగిన చీరలు ధరించడానికి మగువలు ఇష్టపడుతున్నారు. ఇటీవలికాలంలో డిజైనర్ శారీలు, వర్క్ శారీలు ఫ్యాషన్‌గా కొనసాగుతున్నాయి. అయినా, పెళ్లిళ్ల వంటి శుభకార్యాల్లో మాత్రం మహిళలు పట్టుచీరలకే ప్రాధాన్యమిస్తున్నారు. పట్టుచీరల తయారీకి మగ్గాలతో పాటు ఇటీవలి కాలంలో యంత్రాలను కూడా ఉపయోగిస్తున్నారు. అయితే, పూర్తిగా మగ్గంపై నేసిన చేనేత పట్టుచీరలకే గిరాకీ ఎక్కువగా ఉంటోంది. పట్టుచీరలతో పాటు సహజమైన రంగులతో నేసిన చేనేత నూలు చీరలను ధరించడానికి చాలామంది మహిళలు ఇష్టపడుతున్నారు. సాధారణ జరీ నుంచి వెండి జరీ వరకు రకరకాల జరీ అంచుల పట్టుచీరలను నేయడంలో ఎమ్మిగనూరు చేనేతకారులు చక్కని నైపుణ్యం కనబరుస్తున్నారు.
తగ్గిన చీర పొడవు
ఇదివరకటి కాలంలో తొమ్మిది గజాల చీరలు, ఏడు గజాల చీరలు, ఆరు గజాల చీరలు విరివిగా వాడుకలో ఉండేవి. కాలక్రమంలో చీరల పొడవు బాగా తగ్గింది. ఇప్పడు చీరల పొడవు ఐదు మీటర్లకే పరిమితమైపోయింది. ఇక వెడల్పు సుమారు 1.2 నుంచి 1.5 మీటర్ల వరకు ఉంటోంది. మగ్గం మీద పట్టుచీర నేయడానికి ఎంతో ఓపిక, శ్రమ, నైపుణ్యం అవసరం. వీటి నేతకు రెండు రకాల మగ్గాలను వినియోగిస్తుం టారు– చిన్న మగ్గాలు, పెద్ద మగ్గాలు. చిన్న మగ్గం మీద చీర నేయడానికి కనీసం నాలుగు రోజులు పడుతుంది. వెయ్యి రూపాయల కూలి దొరుకుతుంది. పెద్దమగ్గంగా చెప్పుకొనే జాకాట్ మగ్గం మీద చీర నేయడానికి నెల రోజులు పడుతుంది. ఒక చీర నేసినందుకు పన్నెండువేల రూపాయల వరకు ప్రతిఫలం దొరుకుతుంది. ఇక్కడ తయారు చేసిన చీరలను మాస్టర్ వీవర్స్ గద్వాల్ చీరలు, ధర్మవరం పట్టుచీరలుగా బ్రాండింగ్ చేసి విక్రయిస్తున్నారు.
⇒ కర్నూలు జిల్లాలో చేనేత కుటుంబాలు 4,000
⇒ ఉమ్మడి జిల్లాలో మగ్గాలు 10,000
⇒ కర్నూలు నగరంలో వస్త్ర దుకాణాలు 700
⇒ పట్టుచీరల రకాలు 10
⇒ నగరంలో పట్టుచీరల గరిష్ఠ ధర రూ. 50,000
⇒ గద్వాల పట్టుచీరల గరిష్ఠ విలువ రూ.25,000
Comments
Please login to add a commentAdd a comment