ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక కళ దాగి ఉంటుంది. అయితే అది వెలుగులోకి రావాలంటే పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలే ధర్మవరానికి చెందిన చేనేత కార్మికుడు జూజారు నాగరాజును ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు వచ్చేలా చేసింది. సాధారణ చీరలు నేసే స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అద్భుతమైన డిజైనర్ పట్టు చీరల సృష్టికర్తగా ఎదిగారు. రొటీన్‌కు భిన్నంగా చీరలపై డిజైన్ చేయడం, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రత్యేక డిజైన్లు రూపకల్పన చేసి తన శక్తి ఏమిటో నిరూపించుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకుంటూ వచ్చిన నాగరాజు విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...
సాక్షి, ధర్మవరం టౌన్: పట్టణానికి చెందిన జూజారు నాగరాజు మగ్గం నేసుకుంటూ డిగ్రీ చదివారు. డిజైనింగ్ మీద మక్కువతో బెంగుళూరు, హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి, ధర్మవరానికి చేరుకున్నారు. అప్పటి నుంచి సరికొత్త డిజైన్లతో పట్టుచీరలు నేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు.
పేదరికాన్ని సవాల్ చేస్తూ..
నాగరాజు తండ్రి జూజారు లక్ష్మణరావు సాధారణ చేనేత కార్మికుడు. నిరుపపేద కుటుంబం కావడంతో ఇంటిల్లిపాది మగ్గం నేస్తేనే జీవనం సాగేది. తండ్రి పడుతున్న కష్టం నాగరాజును కదిలించింది. అందరిలా కాకుండా కొత్తదనాన్ని చూపినప్పుడే తమ ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ నెలకొంటుందని భావించిన అతను.. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేశారు. అప్పట్లో పట్టుచీరలంటే తమిళనాడులోని కాంచీపురం ప్రసిద్ధి. కంచి పట్టు చీర అంటే అంత గొప్పగా భావించేవారు. అదే స్థాయిలో ధర్మవరానికి పేరు తీసుకురావాలని భావించిన నాగరాజు... రేయింబవళ్లూ కొత్త డిజైన్‌ల రూపకల్పనపైనే దృష్టి సారించేవారు. నెమలి పళ్లూ, బ్రోకెట్, కళాంజలి వంటి డిజైన్‌లను ఆధునీకరించి కంచి కంటే విభిన్నమైన 240 డిజైన్‌లతో జాకార్డులను సిద్ధం చేశారు.
ఒక్కో డిజైన్ రూపకల్పనకు రూ.10 వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చు పెట్టారు. క్రమేణ ఈ డిజైన్‌లతో వచ్చిన పట్టుచీరలు ప్రతి ఒక్కరి దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటూ వచ్చాయి. దీంతో కొంతమంది పట్టు చీరల వ్యాపారులు నాగరాజుకు ఖర్చులు పోనూ అదనంగా రూ.3 వేలు చెల్లించి కొత్త డిజైన్‌లను కొనుగోలు చేస్తూవచ్చారు. 2009లో ఔట్‌సోర్సింగ్ ద్వారా హ్యాండ్‌లూమ్‌లో డిజైనర్ ఉద్యోగాలను భర్తీ చేయడంతో ధర్మవరం హ్యాడ్‌లూమ్ క్లస్టర్ డిజైనర్‌గా నాగరాజుకు ఉద్యోగం దక్కింది. విధుల నిర్వహణలో భాగంగా ధర్మవరంతో పాటు ముదిరెడ్డిపల్లి, మంగళగిరి తదితర ప్రాంతాల్లో చేనేతకార్మికులకు డిజైనింగ్ రంగంలో శిక్షణ ఇచ్చారు.
నాగరాజు చేసిన వెరైటీ డిజైన్‌లు
► సాంబ చిత్రంలోని శంఖు, చక్రం, నామాలు కలిగిన డిజైన్‌తో 2004లో నాగరాజు ఓ పట్టు వస్త్రం సిద్ధం చేశారు. ఈ శ్రమకు ఫలితంగా సినిమా నిర్మాతలు నాగరాజును అభినందిస్తూ రూ.లక్ష పారితోషకాన్ని అందజేశారు.
► ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో పట్టు వస్త్రాలపై నేసిన తాజ్‌మహల్ చిత్రాలను ప్రదర్శించి, అందరినీ ఆకట్టుకున్నారు.
► 2016లో లేపాక్షి ఆలయంలోని శిల్పకళా నమూనాలతో పట్టు వస్త్రాన్ని చేనేత మగ్గంపై నేసి అబ్బురపరిచారు.
► 2017 ఫిబ్రవరిలో ఇస్రో రాకెట్ ప్రయోగాల విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇస్రో శాటిలైట్‌లు, రాకెట్ చిత్రాలతో పట్టు వస్త్రం తయారు చేసి విజయవాడలో ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.
► గుంటూరులో ప్రముఖ పుణ్యక్షేత్రం పానకాల లక్ష్మీనరసింహస్వామి ముఖచిత్రం, గాలిగోపురం తెలుగు అక్షరాలతో కూడిన డిజైన్‌ను తయారు చేసి ఆలయానికి బహూకరించారు.
► మహాత్ముని దండియాత్రను పట్టు వస్త్రంపై రూపొందించి 2019లో గాంధీ జయంతి రోజున ఢిల్లీలో జరిగిన నేషనల్ హ్యాండ్‌లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.
► సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని 2019 డిసెంబర్‌లో పట్టు వస్త్రంపై సీఎం జగన్ చిత్రపటాన్ని రూపొందించి హ్యాండ్‌లూమ్ కార్యాలయం తరఫున నేతన్న నేస్తం పథకం ప్రారంభంలో ధర్మవరంలో జగనన్నకు బహూకరించారు.
► ఆరీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సతీమణి అన్నే ఫెర్రర్ చిత్రాన్ని పట్టు వస్త్రంపై నేసి అందజేశారు.
అందుకున్న అవార్డులు..
► 2006లో ఉమ్మడి రాష్ట్రంలో డిజైన్ డెవలప్‌మెంట్‌కు గాను రాష్ట్ర స్థాయి అవార్డును ప్రభుత్వం అందజేసింది.
► 2020 మార్చి నెలలో ఢిల్లీలో నేషనల్ హ్యాండ్‌లూమ్ డెవల్‌మెంట్ కార్పొరేషన్ వారు నాగరాజుకు జాతీయ అవార్డును అందజేశారు. దండియాత్రను గుర్తుకు చేస్తూ పట్టువస్త్రం నేసినందుకు ఈ పురస్కారం దక్కింది.
వైఎస్సార్ హయాంలోనే ప్రతిభకు గుర్తింపు దక్కింది
మగ్గం నేస్తూ డిగ్రీ వరకు చదువుకున్నా. సాంబ సినిమాలో నేను వేసిన డిజైన్ ప్రాచుర్యం పొందింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నాలో ప్రతిభను గుర్తించి, డిజైనర్‌గా హ్యాండ్‌లూమ్ కార్యాలయంలో ఉద్యోగ అవకాశం ఇచ్చారు. ఆ మహానేత గుర్తింపు వల్లనే ఎన్నో డిజైన్‌లను చేయగలిగాను. ఎందరో కార్మికులకు డిజైనింగ్‌లో శిక్షణ ఇస్తున్నా.
– జూజారు నాగరాజు, చేనేత కార్మికుడు, ధర్మవరం
Comments
Please login to add a commentAdd a comment