లోయలో పడిన బస్సు నుంచి క్షతగాత్రులను బయటకు తీసుకొస్తున్న దృశ్యం, ధర్మవరంలోని మారుతీనగర్‌లో పెళ్లికుమారుడు వేణు ఇంటి వద్ద గుమిగూడిన కాలనీవాసులు
ధర్మవరం టౌన్(అనంతపురం జిల్లా) : నిశ్చితార్థ వేడుక ఘనంగా చేయాలనుకున్నారు. దగ్గరి బంధువులందరినీ పిలిచారు. ప్రైవేటు బస్సును అద్దెకు తీసుకుని సంతోషంగా బయలుదేరారు. తిరుచానూరులో కార్యక్రమం కావడంతో అందరిలోనూ ఉత్సాహం కనిపించింది. తిరిగొచ్చేటప్పుడు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని రావచ్చనుకున్నారు. కానీ గమ్యం చేరకముందే ఘోరం జరిగిపోయింది. శనివారం రాత్రి చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద ఘాట్‌రోడ్డులో బస్సు లోయలోకి బోల్తా పడింది. అర్ధరాత్రి వరకు అందిన సమాచారం మేరకు ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. 49 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురు ధర్మవరం పట్టణంలోని మారుతీనగర్‌కు చెందిన వారు కాగా..మరికొందరు చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి వాసులు. దీంతో ఆయా ప్రాంతాల్లో విషాదం నెలకొంది.
చదవండి: 300 అడుగుల లోతు.. చిమ్మ చీకటి.. ప్రాణాలను ఫణంగా పెట్టి..
ఉత్సాహంగా పయనం..మధ్యలో విషాదం
ధర్మవరం పట్టణంలోని మారుతీనగర్‌కు చెందిన మలిశెట్టి మురళి, లలిత దంపతులు. వీరికి కుమారుడు వేణు, కుమార్తె కోమలి సంతానం. మురళి పట్టణంలో సిల్‌్కహౌస్ నిర్వహిస్తున్నాడు. వేణు తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు. వేణుకు పుత్తూరు సమీపంలోని నారాయణవనంకు చెందిన అమ్మాయితో నిశి్చతార్థం కుదిరింది. ఆదివారం తిరుచానూరులోని రాధాకృష్ణ కల్యాణ మండపంలో నిశ్చితార్థ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ధర్మవరం నుంచి శనివారం ఉదయం 11 గంటలకు కేఏ 30ఏ 4995 నంబర్ బస్సులో బయలుదేరారు. మలిశెట్టి మురళి కుటుంబంతో పాటు వారి బంధువులు, పరిచయస్తులు అదే కాలనీకి చెందిన మునుస్వామి, సరస్వతి, కాంతమ్మ (వేణు పిన్ని), సునీత, శశితో పాటు పలు ప్రాంతాలకు చెందిన 55 మంది పయనమయ్యారు.
అయితే..బస్సు మార్గమధ్యంలోని భాకరాపేట ఘాట్‌రోడ్డులో 300 అడుగుల లోతున్న లోయలోకి పడిపోయింది. అతి వేగంతో పాటు ఫిట్‌నెస్ లేని బస్సు కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి, 49 మందికి తీవ్ర గాయాలయ్యాయన్న సమాచారం రావడంతో ధర్మవరంలోని బంధువులు, కాలనీ వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. క్షతగాత్రుల్లో పెళ్లికుమారుడు వేణు కూడా ఉన్నాడు. మలిశెట్టి మురళి పట్టణంలో చేనేత ప్రముఖుడు కావడంతో చాలా మంది చేనేతలు నిశ్చితార్థానికి బయలుదేరి వెళ్లారు. దీంతో ఘటనలో తమ వారికి ఏమైందోనన్న ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్‌చైర్మన్ చందమూరి నారాయణరెడ్డి బాధితుల బంధువులను పరామర్శించి..ధైర్యం చెప్పారు.
దిక్కుతోచడం లేదు
మా అన్న కుమారుడు మలిశెట్టి వేణు నిశ్చితార్థానికి మా కుటుంబ సభ్యులంతా బయలు దేరి వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే బస్సు లోయలో పడిందని టీవీలో చూశాను. ఎవరికి ఏమయ్యిందోనన్న బాధతో దిక్కుతోచడం లేదు.
–మలిశెట్టి శివ, మారుతీనగర్, ధర్మవరం
ఫొటోలు తీయడానికి వెళ్లి..
చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన రామాంజినమ్మ, వెంకటేశులు కుమారుడు చంద్రశేఖర్ (28) ధర్మవరంలోని ఓ స్టూడియోలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. నిశ్చితార్థ వేడుకలో ఫొటోలు తీయడం కోసం బయలుదేరాడు. ప్రమాదంలో అతను చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతనికింకా వివాహం కాలేదు.
అక్క కుమారుడి నిశ్చితార్థం చూడాలని..
అక్క కుమారుడి నిశ్చితార్థ వేడుక చూడాలని సంతోషంగా బయలుదేరిన కాంతమ్మ (52) బస్సు ప్రమాదంలో చనిపోయింది. ఈమె వేణుకు స్వయాన పిన్ని కావడం గమనార్హం. ఈమె భర్త శివ ధర్మవరంలోనే ఉండిపోయాడు. భార్య చనిపోయిందన్న వార్త విని తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment