ధర్మవరం టౌన్(అనంతపురం): పొలం అమ్మి అప్పులు తీర్చుకోవాలనుకున్న రైతు కుటుంబం పట్ల ఓ హెడ్ కానిస్టేబుల్ కర్కశంగా వ్యవహరించాడు. ఆ పొలం తనకే అమ్మాలంటూ జులుం చేశాడు. కాదన్న పాపానికి తండ్రీకొడుకులను నిర్బంధించి హింసించాడు. వేధింపులు తాళలేక చివరకు రైతు కుటుంబం ‘సాక్షి’ ఎదుట గోడు వెళ్లబోసుకుంది. ధర్మవరం మండలం వెంకటతిమ్మాపురానికి చెందిన రైతు రవీంద్రరెడ్డికి దర్శినమల గ్రామ పరిధిలో 10 ఎకరాల పొలం ఉంది.
గతంలో తీవ్ర వర్షాభావంతో బోరుబావి ఎండిపోయి, చీనీ చెట్ల సాగులో తీవ్రంగా నష్టపోయాడు. ఈ క్రమంలో అప్పులు పెరిగిపోయాయి. ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో తనకున్న పొలంలో 3.58 ఎకరాలు అమ్మి అప్పులు తీర్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఎకరాకు రూ.3.58 లక్షలు బేరం కుదిరి వేరొకరికి పొలం విక్రయించాడు.
హెడ్‌కానిస్టేబుల్ కన్ను
రైతు అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ధర్మవరం రూరల్ పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ పూజారి పుల్లప్ప... ఆ పొలాన్ని ఎకరా రూ.2 లక్షలతో తనకే అమ్మాలని రైతుపై ఒత్తిడి తీసుకెళ్లాడు. తనకు కాకుండా ఇతరులకు పొలం అమ్మితే కేసులు బనాయిస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఇందుకు రైతు రవీంద్రరెడ్డి ఒప్పుకోలేదు. దీంతో రవీంద్రరెడ్డి, అతని కుమారుడు మారుతీరెడ్డిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకుని చావబాదాడు.
చివరకు బయటకు విడుదల చేసేందుకు రూ.30వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో తమ వద్ద ఉన్న రూ.5వేలను అప్పటికప్పుడు ఫోన్‌పే ద్వారా కానిస్టేబుల్ ఖాతాకు మార్చి, మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తామంటూ తండ్రీకొడుకులు బయటకు వచ్చారు. కానిస్టేబుల్ బారి నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని, లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ బాధిత రైతులు వాపోయారు. కాగా, రైతు ఆరోపణలు అవాస్తమంటూ హెడ్ కానిస్టేబుల్ పుల్లప్ప కొట్టిపాడేశారు. అయితే ఘటనకు సంబంధించి బాధిత రైతులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామంటూ డీఎస్పీ రమాకాంత్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment