మగువలు మెచ్చే పట్టు చీరలు.. వెడ్డింగ్ శారీలు.. ఫంక్షన్లలో స్పెషల్ లుక్కుతో ఆకట్టుకునే డిజైన్లు చేయడంలో నారాయణవనం నేతన్నలు ఆరితేరిపోయారు. తరతరాలుగా మగ్గాలపైనే తమ నైపుణ్యాన్నంతా రంగరించి రకరకాల పట్టు చీరలు తయారు చేస్తుంటారు. సింగిల్ త్రెడ్, డబుల్ త్రెడ్, వెండి జరీ, బంగారు జరీ చీరలు డ్రాబీ, జాకాడ్ డిజైన్లతో అత్యద్భుతంగా నేసి ఆకట్టుకుంటున్నారు. ఇక్కడ తయారయ్యే చీరలు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని ప్రముఖ బ్రాండెడ్ షాపులకు ఎగుమతి చేస్తుంటారు. కంచి, ఆరణి, ధర్మవరం పట్టు చీరలను కలగలిపి ఒకే పట్టు.. ఒకే బ్రాండ్ చీరలుగా నేయడం వీరి ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా నారాయణవనం పట్టు చీరలపై ప్రత్యేక కథనం..
పూర్వీకుల కాలం నుంచి నారాయణవనం పట్టువ్రస్తాలకు పెట్టింది పేరు. ఇక్కడ గతంలో 600 కుటుంబాలకుపైగా మగ్గాలు పెట్టుకుని పట్టువ్రస్తాలు నేసేవారు. ప్రస్తుతం వందకుపైగా కుటుంబాల వారు తమ కులవృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరు నేసే పట్టు చీరలు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ వస్త్ర దుకాణదారులు కొనుగోలు చేసి వివిధ బ్రాండ్ల పేరుతో విక్రయిస్తుంటారు. మరికొందరు సొంతంగా షాపులు పెట్టుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. సాధారణంగా వెండి, బంగారు జరీ పట్టు చీరలను తమదైన శైలిలో నేసి మగువుల మనసు దోచుకుంటున్నారు. ఒక్కో చీర రూ.5 వేల నుంచి రూ.65 వేల వరకు విక్రయిస్తుంటారు.
ఒకే బ్రాండ్.. ఒకే పట్టు
పట్టుతో నేసే చీర ఒకటే. కానీ జాకాడ్, డ్రాబీలపై వివిధ డిజైన్లతో తయారయ్యే చీరలు కొత్తకొత్త పేర్లతో మార్కెట్లోకి వస్తుంటాయి. కొత్త రకం చీరకు కొత్తపేరుతో మార్కెట్లోకి తెచ్చి విక్రయిస్తుంటారు. పట్టులో వెండిని, బంగారాన్ని స్వల్పంగా కలిపి జరీ చీరలను నేస్తుంటారు. నారాయణవనంలో సాధారణ, బంగారు జరీ చీరలు పోస్టర్ డిజైన్లతో జాకాడ్, డ్రాబీలతో తయారు చేస్తున్నారు. పేర్లు ఎన్నైనా వాడే పట్టు నాణ్యత, పోగుల సంఖ్య, వెండి, బంగారం, డిజైన్ల ఆధారంగానే బరువు ఉంటుంది.
చేయూత కోసం ఎదురుచూపు
గతంలో పట్టు కొనుగోలుకు కిలోకు రూ.150 చొప్పున నెలకు గరిష్టంగా రూ.600ను ప్రభుత్వం నేరుగా నేతన్నల బ్యాంక్ ఖాతాకు జమచేసేది. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే వైఎస్సార్ నేతన్న నేస్తంతో ఐదేళ్లు వరుసగా ఏడాదికి ఒకేసారి రూ.24 వేలు బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అండగా నిలిస్తే పెట్టుబడి భారం తగ్గించుకునే ఆస్కారం ఉంటుందని నేతన్నలు చెబుతున్నారు.
చేనేతపైనే మగువులకు మక్కువ
చేనేత మగ్గాలపై తయారయ్యే పట్టు చీరల నాణ్య త, డిజైన్, సున్నితత్వంపైనే స్త్రీలు మక్కువ చూపు తున్నారు. ఈ నేపథ్యంలో నారాయణవనంలోని నేతన్నలు వారి మనసుకు నచ్చేవిధంగా డిజైన్లు తయారు చేస్తున్నారు. మాస్టర్ వీవర్లు కంచి, ధర్మ వరం నుంచి ముడిపట్టును తెప్పించుకుని స్థానికంగా రంగులు అద్ది సొంత డిజైన్లతో డ్రాబీ, జాకాడ్‌పై తయారైన చీరలను చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని ప్రముఖ వస్త్ర దుకాణాలకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడ వీటిని వివిధ బ్రాండ్లుగా విభజించి వ్యాపారులు విక్రయాలు సాగిస్తున్నారు.
ధరలో భారీ వ్యత్యాసం
బ్రాండెడ్ షాపుల్లో అమ్మే పట్టుచీరల ధరలతో పోల్చుకుంటే ఇక్కడ ఉత్పత్తిదారుల వద్ద దొరికే పట్టుచీరలు 30 శాతం తక్కువకే దొరుకుతాయి. డైలీ వేర్ సింగిల్ త్రెడ్ పట్టు చీర 3000 గ్రాముల బరువుతో రూ.5 వేల నుంచి విక్రయిస్తున్నారు. డబుల్ త్రెడ్ పార్టీ వేర్ చీరలైతే రూ.7 వేల నుంచి రూ.25 వేల వరకు దొరుకుతాయి. రెండు గ్రాముల బంగారంతో అత్యధికంగా 700 గ్రాముల బరువు తో స్పెషల్ వెడ్డింగ్ శారీ రూ.65 వేలకే నేస్తున్నారు. ఆర్డర్లపై నచ్చిన డిజైన్, రంగులతోనూ 20 రోజులకే పట్టుచీరలను నేతన్నలు అందిస్తున్నారు.
మాయ చేస్తున్న ఇమిటేట్ పట్టు
ఇమిటేట్ పట్టు మార్కెను ఆకట్టుకుంటోంది. బంగారం, వెండి జరీతో పట్టుచీరలకు పోటీగా రాగి జరీతో ఇమిటేట్ పట్టు చీరలు తయారవుతున్నాయి. జరీ, డిజైన్, కొంగు రాగి రంగుతో పట్టుచీరలకు దీటుగా తక్కు వ ధరకే అంటే రూ.500కే మార్కెట్లో దొరు కుతున్నాయి. ఇమిటేట్ పట్టు(కాపర్ పట్టు) చీరను ఉతికితే జరీ ముడతలతో కుంచించుకుపోవడంతో పాటు మెత్తదనం కోల్పోతుంది. నారాయణవనంలో తయారయ్యే వెండి, బంగారంతో కలిసిన నాణ్యమైన పట్టు చీరలను డ్రైక్లీనింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఎన్ని సార్లు డ్రైక్లీనింగ్ చేసినా చీరలో జరీ, డిజైన్, కొంగులో నాజూకుతనం అలాగే ఉంటుంది.
ఇమిటేట్‌తో ఇబ్బంది
చౌకగా లభించే ఇమిటేట్ కాపర్ జరీ పట్టుచీరలతో ఇబ్బందులెదురవుతున్నాయి. పట్టుచీర తక్కువ బరువుతో సున్నితంగా ఉంటుంది. 300 గ్రాముల నుంచి 700 గ్రాముల వరకు బరువుండే పట్టుచీరల్లో పోస్టర్ డిజైన్ జాకాడ్ స్పెషల్ వెడ్డింగ్ శారీలు అందుబాటులో ఉన్నాయి. 2 గ్రాముల బంగారంతో జరీ చీరలను రూ.40 వేల నుంచి రూ.65 వేల వరకు విక్రయిస్తున్నాం. వెండి జరీ చీరలను స్పెషల్ లుక్‌తో పార్టీ వేర్‌గా అందిస్తున్నాం. ఆర్డర్లపై నచ్చిన రంగులు, డిజైన్లతో 20 రోజుల్లో చీరను తయారు చేస్తాం.
– మునస్వామి, మాస్టర్ వీవర్, నారాయణవనం
మెచ్చుకుంటే చాలు!
పెద్దల నుంచి నేర్చుకున్న వృత్తిని నమ్ముకుని బతుకుతున్నా. నేను తయారు చేసిన చీర బాగుందని మెచ్చుకుంటే చాలు ఆ తృప్తే వేరు. కూలీ గిట్టకపోయినా.. పట్టుచీర తయారీతో కలిగే తృప్తితో పడిన కష్టాన్ని మరిచిపోతున్నాం. రోజుకు ఐదు గంటలు పనిచేస్తే వారానికి ఒక చీర తయారవుతుంది. భారీ చీరకు 20 రోజులు పడుతుంది. తమిళనాడు తరహాలో 200 యూనిట్ల విద్యుత్ రాయితీ, మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తే పట్టు పరిశ్రమకు ప్రోత్సహం లభిస్తుంది.
– మునీశ్వరయ్య, కార్మికుడు, నారాయణవనం
ప్రభుత్వం ఆదుకోవాలి
గతంలో నెలకు 4 కిలోల ముడిపట్టు కొనుగోలుకు రూ.600 అందేది. జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే నేతన్న నేస్తం పథకంతో ఐదేళ్ల పాటు రూ.24 వేల చొప్పున అందించి ఆదుకున్నారు. చేనేతకు మరమగ్గాల ఉత్పత్తులు పోటీ రావడంతో చీరలను అమ్ముకోలేని పరిస్థితి ఎదురవుతోంది. మార్కెటింగ్ సదుపాయంతో పాటు విద్యుత్, పట్టుపై సబ్సిడీని ప్రభుత్వం అందించాలి.
–పరంధామయ్య, పాలమంగళం నార్త్
Comments
Please login to add a commentAdd a comment