
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ధర్మ పరిరక్షణ అనేది కరువైందని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు చనిపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఈరోజు(సోమవారం) తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన మల్లాది విష్ణు.. ‘హిందూధర్మంపై నిత్యం దాడి జరుగుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే తిరుమల లడ్డూ గురించి విషప్రచారం చేశారు. వైకుంఠ ఏకాదశి రోజు సరైన ఏర్పాట్లు చేయకుండా ఆరుగురు భక్తుల మరణానికి కారకులయ్యారు. కాశీనాయన దివ్యక్షేత్రంలో గోశాల, అన్నదాన సత్రాలను నిలువునా కూల్చేశారు. ఇప్పుడు శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడ్డాయి
తాబేళ్ల సంరక్షనే కాదు, పార్కు నిర్వహణను కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. మా హయాంలో ఏ పొరపాట్లు జరగకపోయినా ఏదో జరిగినట్లు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు హైందవ ధర్మం మీద దాడి జరుగుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదు?, కాశీనాయన క్షేత్రంలో అధికారులే వెళ్లి నిర్మాణాలను కూల్చేస్తే ఎందుకు మాట్లాడలేదు?, శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోతుంటే దేవాదాయ శాఖ ఏం చేస్తోంది?
రెండు వందల తాబేళ్ల పరిరక్షణ కూడా ప్రభుత్వానికి పట్టదా? , మా హయాంలో ప్రతి తాబేలుకూ నెంబర్ ఇచ్చి వాటి పరిరక్షణ చూశాం. కానీ ఈ ప్రభుత్వం తాబేళ్లకు ఎలాంటి పోస్టుమార్టం చేయకుండా ఎలా దహనం చేస్తారు?, అసలు రాష్ట్రంలో హిందూ ధర్మం ఏమవుతోంది? , వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. శ్రీకూర్మం ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు మల్లాది విష్ణు
