కబ్జా స్థలాలు స్వాధీనం చేసుకోండి
ఆర్‌అండ్‌బీ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
సాక్షి, హైదరాబాద్: అన్యాక్రాంతమైన రోడ్లు భవనాలశాఖ స్థలాల ను తిరిగి స్వాధీనం చేసుకుని, వాటి సరిహద్దులు నిర్ధారించి శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వాటిని తిరిగి రికార్డుల్లో పొందుపరచాలన్నారు. సోమవారం ఆయన ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం చేపట్టిన రోడ్లు, వంతెనల పనులను వచ్చే ఆర్థిక సంవత్సరం చివరినాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. భూవివాదాల వల్ల పనుల్లో జాప్యం లేకుం డా చూడాలన్నారు.
ఆ వివాదాలను సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించా రు. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చ టం, శిథిలమైన రహదారులకు మరమ్మతు చేయటం, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరసల రహదారుల నిర్మాణం, నదులు, వాగులు వంకలపై చేపట్టిన బ్రిడ్జిల నిర్మాణాన్ని గడువులోగా పూర్తిచేయాలన్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు ఇల్లు, కార్యాలయా ల సముదాయం నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున డిసెంబరు నాటికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలన్నారు.
గడువులోగా రోడ్లు పూర్తి చేయని కాంట్రాక్టర్లను ఉపేక్షించబోమన్నారు. హైదరాబాద్‌లో తుదిదశకు చేరుకున్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను డిసెంబరు కల్లా పూర్తిచేయాలన్నారు. ఎర్రమంజిల్‌లో పూర్తయిన రోడ్లు భవనాల శాఖ కార్యాలయ భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఈఎన్‌సీలు బిక్షపతి, రవీందర్‌రావు, గణపతిరెడ్డి తదితరులు హాజరయ్యారు.