Minister Tummala
-
అనర్హులకు పథకాలు.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
సాక్షి,సూర్యాపేట జిల్లా: ప్రజలు ఆశించిన మేరకు ఇందిరమ్మ పాలన సాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం(జనవరి26) సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామంలో ప్రజాపాలన- పథకాల ప్రారంభోత్సవంలో తుమ్మల మాట్లాడారు. ‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. అర్హులైన చివరి లబ్ధిదారులకు ప్రజాపాలన పథకాలు అందిస్తాం. రేషన్ కార్డులతో సమానంగా హెల్త్ కార్డులు ఇస్తాం. అనర్హులు ఎవరైనా లబ్ధిపొందితే స్వచ్ఛందంగా వాటిని తిరిగి ఇచ్చేయాలి. అర్హుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలి’అని తుమ్మల కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా జనవరి 26 నుంచి రైతుభరోసా, కొత్త రేషన్‌కార్డులు వంటి పథకాలను ప్రారంభించింది. జిల్లాల్లో మంత్రులు ఈ పథకాలను ప్రారంభించగా కొడంగల్ నియోజకవర్గం చంద్రవంచలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాలను ప్రారంభించారు. -
వీణావాణిలను పరామర్శించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్: అవిభక్త కవలలైన పదమూడేళ్ల వీణావాణిల గురించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. నిలోఫర్ ఆస్పత్రి నుంచి స్టేట్ హోంకు వచ్చిననాటి నుంచి వారు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారని, వారిది ప్రత్యేక పరిస్థితి కావడంతో సర్కారు కూడా వారిని అంతే ప్రత్యేకంగా కంటికి రెప్పలా చూసుకుంటోందని చెప్పారు. వారి చదువుకు అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వం కల్పించింది. వీరి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఆదేశించడంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ వారి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించారు. వారి బాగోగుల కోసం ఏకంగా రూ.6.46 లక్షలను కేటాయించారు. ఈ మొత్తంలో వారిని అనుక్షణం జాగ్రత్తగా చూసుకునే అయాలకే రూ.4.32 లక్షలను కేటాయించారు. వారికి చదువులు చెప్పే కౌన్సిలర్ కోసం రూ.1.14 లక్షలు, నిర్వహణ కోసం మరో రూ.లక్ష కేటాయించారు. వీణావాణిల స్థితిగతులపై మంత్రి తుమ్మల ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు స్టేట్ హోంను సందర్శించిన మంత్రి శుక్రవారం మరోమారు వచ్చి వీణావాణిలను పలకరించారు. వారితో కాసేపు మాట్లాడి వారికి ఇంకేమి కావాలో అడిగి తెలుసుకున్నారు. విద్య, ఇతర సౌకర్యాలు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్టేట్ హోం సిబ్బందికి సూచించారు. -
రాష్ట్రానికి మరో జాతీయ రహదారి
కొత్తకోట–గద్వాల–గూడూరు – మంత్రాలయం మధ్య నిర్మాణం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మరో జాతీయ రహదారి మంజూరైంది. కొత్తకోట– గద్వాల– గూడూరు– మంత్రా లయం మధ్య దీన్ని నిర్మించనున్నారు. హైదరాబాద్– మంత్రాలయం– రాయచూర్ అనుసంధానంగా కర్ణాటక రాష్ట్రం ఈ రోడ్డును ప్రతిపాదించగా.. కేంద్ర భూ ఉపరితల రవాణా శాఖ తాజాగా పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కొత్తకోట వరకు జాతీయ రహదారి ఉండటంతో అక్కడి నుంచి కొత్త జాతీయ రహదారి నిర్మించనున్నారు. రాష్ట్ర భూభాగంలో దాదాపు 70 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ రోడ్డును రోడ్లు భవనాల శాఖ పరిధిలోని జాతీయ రహదారుల విభాగం నిర్మించనుంది. రహదారి నిర్మాణానికి దాదాపు రూ.400 కోట్లు ఖర్చవుతుందని అంచనా. త్వరలో డీపీఆర్‌లు రూపొందించి ఢిల్లీకి పంపనున్నట్లు జాతీయ రహదారుల విభాగం ఈఎన్సీ గణపతిరెడ్డి వెల్లడించారు. కాగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు 2,915 కిలోమీటర్ల నిడివి గల 21 జాతీయ రహదారులను కేంద్రం మంజూరు చేసింది. తాజాగా కర్ణాటక ప్రతిపాదనతో ఈ 22వ జాతీయ రహదారి మంజూరైంది. అనుసంధానమే: మంత్రి తుమ్మల దేశంలోని హైవేలను అనుసంధానించే క్రమంలో ఇలాంటి లింకు రోడ్లను కేంద్రం మంజూరు చేస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. రాయచూర్ 167 నం జాతీయ రహదారితో అనుసంధానించే క్రమంలో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోందన్నారు. -
పడకేసిన ‘రెండు పడకలు’
- హరీశ్, తుమ్మల, ఈటల, జగదీశ్ ఇలాఖాల్లోనే వేగంగా పనులు - మిగతా మంత్రుల తీరుపై సీఎం ఆరా సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మానసపుత్రిక రెండు పడకల గదుల ఇళ్ల పథకం చాలా మంత్రుల ఇలాఖాల్లో బాలారిష్టాలు వీడడంలేదు. నలుగురు మంత్రుల నియోజకవర్గాల్లో మాత్రం అమాంతం వేగం అందుకుని గృహప్రవేశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇళ్లను గరిష్ట సంఖ్యలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయక తప్పని పరిస్థితి నెలకొన్న కీలక దశలోనూ పనులు పడకేసి కనిపిస్తున్నాయి. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం లాభదాయకం కాకపోవటంతో కాంట్రాక్టర్లు మొహం చాటేస్తున్న తరుణంలో కొన్ని చోట్ల వేగం అందుకోవటానికి ఆయా జిల్లాల మంత్రుల చొరవే కారణంగా కనిపిస్తోంది. ఇలా పనులు పట్టాలెక్కి చకచకా పూర్తి అయ్యేలా చూడడంలో కేవలం నలుగురు మంత్రులకే పాస్ మార్కులు దక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ ఇళ్లు కీలక భూమిక పోషించే పరిస్థితి ఉండటంతో కాంట్రాక్టర్ల సహాయ నిరాకరణను సవాల్‌గా స్వీకరించి నలుగురు మంత్రులు ముందడుగు వేస్తుంటే మిగతావారు పెద్దగా చొరవ చూపటం లేదని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు దీన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ఏయే జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం ఊపందుకుందో వివరాలు తెప్పించుకున్నారు. ఇందులో కేవలం నలుగురు మంత్రుల ఇలాఖాల్లోనే సానుకూల అంకెలు కనిపిస్తుండగా, చాలా మంది మంత్రుల జిల్లాల్లో సున్నాలు వెక్కిరిస్తున్నాయి. మంత్రి హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకుని కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ రెండు పడక గదుల ఇళ్లు సిద్ధమయ్యేలా చూస్తున్నారన్న విషయం సీఎం దృష్టికి వెళ్లింది. వారి ఇలాఖాల్లో పనులు చకచకా ముఖ్యమంత్రి దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నరసన్నపేటల్లో 568 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారు. ఇవి పోను సిద్దిపేట జిల్లా పరిధిలో మరో 7 వేల ఇళ్లు వేగంగా రూపు దిద్దుకుంటున్నాయి. ఈ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు రూ.40 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇందులో మంత్రి హరీశ్‌రావు చొరవే ముఖ్యమైంది. ప్రతి వారం కాంట్రా క్టర్లతో చర్చిస్తూ వారిని చైతన్య పరచడం మంచి ఫలితాలని స్తోంది. ఇక్కడ త్వరలో 500 ఇళ్లు గృహప్రవేశాలకు సిద్ధం కాబోతున్నాయి. ఆ తర్వాత రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలాఖాలో ఇళ్ల నిర్మాణం వేగం అందుకుంది. ఖమ్మం జిల్లా పరిధిలో 1,404 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందులో ఉగాది రోజు 22 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారు. త్వరలో మరో 200 ఇళ్లు సిద్ధం కాబోతున్నాయి. సత్తుపల్లి, వైరా, మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో పనులు వేగంగా సాగుతున్నా యి. ఇందులో ఖమ్మం, పాలేరు, సత్తుపల్లిలోని కొంతభా గంలో ఇళ్ల నిర్మాణ బాధ్యత ఆర్ అండ్ బీ పరిధిలో ఉంది. దీంతో రోడ్లు నిర్మించే కాంట్రాక్టర్లను పిలిపించి మంత్రి తుమ్మల తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. స్వయంగా ఆయనే ఆ శాఖను పర్యవేక్షిస్తుండటంతో వారిలో చాలామంది ఇళ్ల పనులు చేపట్టేందుకు ముందుకొస్తున్నారు. ఇక సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా పనుల్లో ఇటీవల చొరవ పెంచారు. ఆయన జిల్లాలో ప్రస్తుతం 470 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా వాటిల్లో 192 ఇళ్లు దాదాపు సిద్ధమయ్యాయి. మే 21న వాటి గృహప్రవేశాలకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ జిల్లా కరీంనగర్లో కూడా పనులు ఊపందుకున్నాయి. అక్కడ 225 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుండగా గృహప్రవేశానికి దాదాపు 55 ఇళ్లు సిద్ధమయ్యాయి. ఇక వరంగల్ పట్టణంలో 1,484 ఇళ్లు, మహబూబ్‌నగర్ పట్టణంలో 1,334 ఇళ్ల నిర్మాణం జరుగుతున్నా ఈ రెండూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రత్యేక చొరవతో మంజూరు చేసి సమీక్షిస్తున్నవే కావటం విశేషం. ఇవి పోనూ మరేమంత్రి ఇలాఖాల్లోనూ ఇళ్లు గృహప్రవేశాలకు సిద్ధం కాలేదు. వారు కాంట్రాక్టర్లతో చర్చించి చొరవ చూపకపోవటమే దీనికి కారణమంటూ స్వయంగా అధికారులు ఆరోపిస్తున్నారు. మిగతా మంత్రుల్లాగా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే తప్ప కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రారని తేల్చి చెబుతున్నారు. -
అమ్మా.. నేను కేసీఆర్‌ను మాట్లాడుతున్నా..
డబుల్ బెడ్రూం ఇంటి లబ్ధిదారు నాగమణికి సీఎం ఫోన్ ఖమ్మం రూరల్ (పాలేరు): ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన డబుల్ బెడ్రూం లబ్ధిదారురాలికి సీఎం కేసీఆర్ ఫోన్ చేసి డబుల్ బెడ్రూం ఇళ్లపై ఆరా తీశారు. బుధవారం ఇదే గ్రామంలో డబుల్బెడ్రూం ఇళ్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 11:28 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి సీఎం పర్సనల్ సెక్రటరీ డబుల్ బెడ్రూం ఇంటి లబ్ధిదారు నాగమణికి ఫోన్ చేసి.. కేసీఆర్ గారు మాట్లాడతారంటూ చెప్పారు. అనంతరం సీఎం కేసీఆర్ ఫోన్లో నాగమణితో మాట్లాడుతూ.. అమ్మా.. మీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి... డబుల్ బెడ్రూం ఇళ్లు ఎలా ఉన్నాయి, గ్రామంలో ఎంతమంది ఒంటరి మహిళలున్నారని అడిగారు. ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తే ఎలా ఉంటుందని అడిగారు. మద్దులపల్లిని మరో గంగదేవిపల్లిలాగా చేసుకోవాలని, అందుకు ప్రభుత్వ సహాయసహకారాలు అందిస్తామన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ రావడం, సీఎంతో ఫోన్లో మాట్లాడే అవకాశం రావడంతో నాగమణి ఆనందానికి అవధుల్లేవు. సాధారణ మహిళనయిన తనతో కేసీఆర్ ఆప్యాయంగా మాట్లాడిన తీరును చెబుతూ ఉబ్బితబ్బిబైంది. -
నియోజకవర్గ కేంద్రాల్లో మహిళా దినోత్సవం
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశించారు. ఈ కార్యక్రమాలకు ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులను ఆహ్వానించాలని కోరారు. మహిళా దినోత్సవం సందర్భంగా 8న (బుధవారం) లలితకళాతోరణంలో ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమాల ఏర్పాట్లను మంగళవారం ఆయన సచివాలయంలో శాఖ కార్యదర్శి జగదీశ్వర్, డైరెక్టర్ విజయేందిర బోయి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణలతో కలసి సమీక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మంత్రి తమ శుభాకాంక్షలు తెలిపారు. అంగన్వాడీ టీచర్లు విధిగా మహిళా దినోత్సవం సందర్భంగా వారి పరిధిలోని మహిళలను చైతన్యపరచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఆరోగ్యలక్ష్మి, ఆసరా, భరోసా, సఖి సెంటర్ల వంటి పథకాలే కాకుండా ఒంటరి మహిళలకు పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లను మహిళలకే కేటాయించేలా చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. -
రాజ్‌భవన్ సిబ్బందికి నూతన గృహాలు
సముదాయాన్ని ప్రారంభించిన గవర్నర్, ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్ సిబ్బంది నూతన గృహాల సముదాయాన్ని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్, ముఖ్యమంత్రి గృహ సముదాయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. రాజ్‌భవన్ సిబ్బంది గృహ సముదాయానికి గతేడాది ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. అత్యాధునిక హంగులతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులను గవర్నర్ నరసింహన్ స్వయంగా పర్యవేక్షించి రికార్డుస్థాయిలో 13 నెలల్లోనే గృహ సముదాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్, విశిష్ట వసతులతో, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో తలపెట్టిన ఈ నిర్మాణం 2.70 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 152 ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులో ఏ, బీ, సీ క్వార్టర్లలో నివాస సముదాయం, పాఠశాల భవనం, కమ్యూనిటీ హాలును నిర్మించారు. ఈ భవనాలకు పూర్తిగా సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గార్డెనింగ్‌కు హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు నీటిని సరఫరా చేయనుంది. -
గొర్రెల పెంపకంపై 75 శాతం సబ్సిడీ
⇒ ప్రతి యాదవ కుటుంబానికి ఒక్కో యూనిట్ ఇస్తాం ⇒ ‘భక్త రామదాసు’ ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ ⇒ ప్రాజెక్టుల కోసం నా చివరి రక్తపు బొట్టునూ ఖర్చు పెడతా ⇒ ఏడాదిన్నరలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం ⇒ ఏడాదిలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచినీరు, ఇంటర్నెట్ ⇒ అర్హులైన హోంగార్డులను పోలీస్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటామన్న ముఖ్యమంత్రి సాక్షి, ఖమ్మం రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై సబ్సిడీని 75 శాతానికి పెంచుతున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రతి యాదవ కుటుంబానికి ఒక గొర్రెల యూనిట్‌ను మంజూరు చేస్తామని, మొత్తంగా నాలుగు లక్షల యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో వృత్తి పనులు కోల్పోయిన వారిని ఆదుకునేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘‘మీ అండదండలు, సహాయ సహకారాలు ఉన్నంత కాలం తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తా.. ప్రాజెక్టుల కోసం నా చివరి రక్తం బొట్టు వరకు ఖర్చు పెడతా.. పోరాటం చేస్తా, అన్ని వర్గాలను సమాన గౌరవంతో ముందుకు తీసుకెళ్తా..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. మంగళవారం రామదాసు జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్మించిన భక్త రామదాసు ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. అనంతరం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఇది అద్భుత ప్రాజెక్టు.. తెలంగాణ వస్తే ఏమొస్తుందని కొందరు మాట్లాడారని, ఈ రోజున మనం ఏం సాధించుకున్నామో పాలేరు ప్రజలను అడిగితే చెబుతారని కేసీఆర్ పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే అతి తక్కువ కాలంలో కేవలం పది నెలల్లో భక్త రామదాసు ప్రాజెక్టును నిర్మించి.. 60వేల ఎకరాలకు నీటిని అందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద ఇంకా కొన్ని గ్రామాలకు నీరు అందాల్సి ఉందని, ఆ పనులను వెంటనే ప్రారంభిస్తున్నామని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లికి చెందిన భక్త రామదాసు జయంతి రోజునే.. ఆయన పేరుతో పెట్టిన ప్రాజెక్టును ప్రారంభించుకోవడం గర్వకారణమన్నారు. సమైక్య రాష్ట్రంలో మనమంతా నిరాదరణకు గురయ్యామని, మన రాష్ట్రంలో మన భక్త రామదాసును గౌరవించుకునే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేలకొండపల్లిలో భక్త రామదాసు మెమోరియల్‌ను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక సీతారామ ప్రాజెక్టును ఏడాదిన్నరలో పూర్తి చేసి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు కాంగ్రెస్ ముఠా ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక ముఠాను తయారు చేసిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పోటీ చేసి ఓడిపోయిన ఓ నాయకుడు మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు వెళ్లి ఆందోళనలు చేశారన్నారు. నిర్వాసితుల ముసుగులో చిత్ర విచిత్రమైన ప్రయత్నాలతో.. సిగ్గూ ఎగ్గూ లేకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదంటూ కాంగ్రెస్ జాతీయ నాయకుడు చిదంబరం మాట్లాడారని.. ఆయన ఇక్కడి నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని స్పష్టం చేశారు. ‘‘గతంలో ఎన్నడూ లేని విధంగా వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు మేం రూ.1,000 పింఛన్ ఇస్తున్న మాట నిజం కాదా..? మీ (కాంగ్రెస్) పాలనలో ఏ రాష్ట్రంలోనైనా ఇలా పింఛన్లు ఇస్తున్నారా? కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడైనా హాస్టళ్లలో, విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం పెట్టాలని ఆలోచించారా? గతంలో కుటుంబంలో ఒక్కో వ్యక్తికి కేవలం నాలుగు కిలోల రేషన్ బియ్యమే ఇచ్చారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇస్తున్న విషయం తెలియదా..’’అని పేర్కొన్నారు. ఏడాదిలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్, మంచినీరు.. రాబోయే సంవత్సర కాలంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి పరిశుభ్రమైన మంచినీటిని, ఇంటర్నెట్ను అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మిషన్ కాకతీయ కింద 46 వేల చెరువుల పునరుద్ధరణ చేపట్టామన్నారు. కాంగ్రెస్ హయాంలో డబ్బాల్లాంటి ఇళ్లు కట్టించి, అదే వైకుంఠం అనుకోమ్మని చెప్పారని.. కానీ ఇప్పుడు తాము డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి ఇస్తున్నామని చెప్పారు. రికార్డు స్థాయిలో హరితహారం చేపట్టామన్నారు. పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో 21 కొత్త జిల్లాలు, 125 మండలాలు, 68 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలూ ముస్లింలు, ఇతర మైనార్టీల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం ముస్లిం మైనార్టీ విద్యార్థులకు 200 రెసిడెన్షియల్ పాఠశాలలు, 71 పాఠశాలలు ఏర్పాటు చేస్తోందని చెప్పారు. విదేశాలకు వెళ్లి చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర పేద విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చేది ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. దళిత, గిరిజన, బీసీ విద్యార్థుల కోసం ఈ ఏడాదిలోనే 501 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభిస్తామన్నారు. అన్ని వర్గాలనూ ఆదుకుంటున్నాం.. మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు తెచ్చి అందరికీ అవకాశాలు కల్పించామని సీఎం కేసీఆర్ చెప్పారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు నిధులు జమ చేశామన్నారు. బ్రాహ్మణుల్లో పేదవారున్నారని, వారికోసం రూ.100 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. గత 60 ఏళ్ల పాలనలో ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏమీ చేయలేదని, తాము వారి కోసం రూ.10 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టు కార్మికులతో రాక్షసంగా పని చేయించారని.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ హయాంలో 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ ట్రాక్టర్లు, ఆటోలపై పన్ను మినహాయింపు ఇచ్చామని తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగాలిస్తాం కాంగ్రెస్, టీడీపీ హయాంలో సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు లేకుండా చేశారని.. ఇప్పుడు తాము తీసుకున్న నిర్ణయంతో 25 వేల మంది నుంచి 30వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. 58 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీల పాలనలో 2,650 కిలోమీటర్ల జాతీయ రహదారులు వస్తే... తమ ప్రభుత్వం 2,776 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేయించుకుందని చెప్పారు. టీఎస్ ఐపాస్ పారిశ్రామిక విధానాన్ని ప్రపంచం మెచ్చుకుంటోందని.. 3 వేల పరిశ్రమలకు 15 రోజుల్లోపు అనుమతులిచ్చామని, 1,600 పైచిలుకు పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయని తెలిపారు. ఇక 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని తాను పేర్కొన్నపుడు... అది జరిగితే అద్భుతమేనని ప్రతిపక్ష నేత జానారెడ్డి తనను అవమానపరచినట్లుగా మాట్లాడారని కేసీఆర్ పేర్కొన్నారు. గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదని... ఇప్పుడు ఇన్వర్టర్లు, జనరేటర్లు అవసరం లేకుండా పోయాయని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధితో కాంగ్రెస్ నేతల కళ్లు బైర్లు కమ్ముతున్నాయని... ఇష్టం వచ్చినట్లు అవాకులు, చెవాకులు పేలితే ఊరుకోమని హెచ్చరించారు. వృత్తి పనులకు తోడ్పాటు వృత్తి పనులు కోల్పోయిన వారిని ఆదుకోవాల్సి ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దాని కోసం రాబోయే బడ్జెట్లో మంచి కార్యక్రమం తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా రాష్ట్రంలోని ప్రతి యాదవ కుటుంబానికి ఒక గొర్రెల యూనిట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. గతంలో యూనిట్‌కు 20 శాతం సబ్సిడీ మాత్రమే ఇచ్చేవారని, తాము 75 శాతం సబ్సిడీతో నాలుగు లక్షల గొర్రెల యూనిట్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. గ్రామీణ వ్యవస్థ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తామని.. మత్స్య, చేనేత కార్మికులకు ఎంత డబ్బు ఖర్చు పెట్టి అయినా తోడ్పాటు అందిస్తామని చెప్పారు. ఇక హోంగార్డులు చాలా ఏళ్ల నుంచి వెట్టిచాకిరీ చేస్తున్నారని, అర్హులైన వారిని పోలీస్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటామని ప్రకటించారు. వారి వేతనాలు కూడా పెంచుతామని, దీనిపై అధికారులకు సూచనలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్రావు, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, బానోతు మదన్‌లాల్, జలగం వెంకట్రావు, కోరం కనకయ్య, రాజయ్య, రెడ్యానాయక్, తాటి వెంకటేశ్వర్లు, భాస్కర్‌రావు, పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, నారదాసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అటు ‘భగీరథ’పరిశీలన.. ఇటు ప్రారంభోత్సవం ఖమ్మం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి తొలుత కూసుమంచి మండలం పాలేరులో మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం కొత్తూరు పంచాయతీ ఎర్రగడ్డ తండా వద్ద భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. తర్వాత తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్ తండాలో రామదాసు పథకం నీటికి పూజలు నిర్వహించారు. అనంతరం మాదిరిపురం వద్ద మిషన్ భగీరథ పనులను పరిశీలించి.. తిరుమలాయపాలెం బహిరంగ సభకు వెళ్లారు. అంతకుముందు మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం అబ్బాయిపాలెం ఎదుళ్లగుట్ట వద్ద మిషన్ భగీరథ పనులను కేసీఆర్ పరిశీలించారు. తుమ్మల ఇంత హుషారు అనుకోలేదు.. ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం తుమ్మల నాగేశ్వరరావు కృషి చేస్తున్నారని, ఆయన ఇంత హుషారని అనుకోలేదంటూ సీఎం కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. తుమ్మల కృషిని పోలుస్తూ ఓ పిట్ట కథ కూడా చెప్పారు. ‘‘ఒక ఊరిలో ఓ ఇంటికి తొందరపడే ఓ చుట్టం వచ్చాడట. ఆయన పోతా.. పోతా అని తొందరపెడితే.. ‘చాలా దూరం పోవాలి కద బిడ్డా.. ఇంకా అన్నం తయారు కాలేదు. రాత్రిది కొద్దిగా చద్దన్నం ఉంది, తినివెళ్లు’అని పెద్దమ్మ అన్నదట. దానికి ఆ చుట్టం బదులిస్తూ... ‘అట్లేం లేదు పెద్దమ్మా.. చద్దన్నం తింటా, ఉడుకన్నం అయ్యే దాక ఉంటా..’అన్నాడట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆ చుట్టం లాగానే ఉన్నాడు. ముందు కొన్ని పనులు చేయించుకుని, అవి పూర్తి కాకముందే.. మరికొన్ని పనులకు హామీలు ఇప్పించుకుంటున్నారు..’’అని వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉంటే ఆశించిన అభివృద్ధి జరుగుతుందన్నారు. ‘మెగా’సంస్థ అధినేతకు సన్మానం తిరుమలాయపాలెం: భక్త రామదాసు పథకాన్ని అనుకున్న గడువుకు ముందే.. కేవలం పది నెలల్లో పూర్తి చేసిన మెగా కన్స్ట్రక్షన్స్ సంస్థ అధినేత కృష్ణారెడ్డిని బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సన్మానించారు. సీతారామ ప్రాజెక్టు పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కృష్ణారెడ్డిని మంత్రి తుమ్మల కోరారు. -
‘భక్త రామదాసు’ నేడు జాతికి అంకితం
-
‘భక్త రామదాసు’ నేడు జాతికి అంకితం
ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే భక్తరామదాసు ప్రాజెక్టును సీఎం కె. చంద్రశేఖర రావు మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు రికార్డు సమయంలో 11నెలల్లోనే పూర్తయింది. ట్రయల్‌రన్ కూడా విజయవంతమైంది. సీఎం శంకుస్థాపన చేసి.. ప్రారంభోత్సవం చేస్తున్న తొలి సాగునీటి ప్రాజెక్టు ఇదే. పాలేరు నియోజక వర్గంలోని భూములకు సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో రూ.335.59 కోట్ల అంచనాతో భక్త రామదాసు ప్రాజెక్టును రూపొందించారు. 2015 డిసెంబర్ 15న రూ.90.87 కోట్లకు పరిపాలన అనుమతులు లభించాయి. 2016 ఫిబ్రవరిలో ఈ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అసలైతే ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావడానికి రెండు సంవత్సరాల సమయం పడుతుంది. అయితే సీఎం కేసీఆర్‌తోపాటు రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రోడ్లు, భవనాలు శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావులు ప్రాజెక్టు పనుల పురోగతిపై పలుసార్లు సమీక్షలు నిర్వహించి.. అధికారులకు సూచనలు చేశారు. దీంతో పనుల్లో వేగం పుంజుకుని.. రికార్డు సమయంలో పూర్తయింది. ప్రాజెక్టు మొత్తం పూర్తికావడంతో మంగళవారం సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటితోపాటు సీతారామ ప్రాజెక్టు పూర్తయితే.. ఆ నీటిని కూడా బయ్యారం ద్వారా ఈ ప్రాజెక్టులోకి తీసుకురానున్నారు. సీఎం రాక కోసం భారీ ఏర్పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం శంకుస్థాపన చేసి.. ప్రారంభోత్సవం చేస్తున్న తొలి ప్రాజెక్టు ఇదే కావడంతో అధికార యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. -
తెలుగు ప్రజల వారధి
- గోదావరిపై మరో వంతెన ప్రారంభం - తెలంగాణ– మహారాష్ట్రల అనుసంధానం సాక్షి, భూపాలపల్లి: తెలంగాణలో కాళేశ్వ రం–మహారాష్ట్రలోని సిరొంచ, అంకీస, ఆసరెల్లి ప్రజలు రాకపోకలు సాగించేందుకు నాటు పడవలను ఆశ్రయించాల్సిన ఇబ్బంది తొలగిపోయింది. గోదావరిపై నిర్మించిన వంతెన శుక్రవారం ప్రారంభమైంది. మహా రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌లతోపాటు తెలంగాణ రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఈ ప్రారంభోత్స వంలో పాల్గొన్నారు. సభలో ‘తెలంగాణ నాజన్మభూమి అయితే, మహారాష్ట్ర నా కర్మభూమి’అని మహరాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు. కేంద్ర రవా ణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ సిరొంచ తాలూకా ఇసుక క్వారీలతో రూ.5 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశామన్నారు. మేడిగడ్డతో నష్టం లేదు: ఫడ్నవీస్ తెలంగాణ నిర్మించతలపెట్టిన మేడిగడ్డ బ్యారేజీ వల్ల సిరొంచ తాలూకాలో ఒక్క గ్రామం, ఒక్క ఇల్లు కూడా ముంపునకు గురి కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రైతులకు హామీ ఇచ్చారు. తెలంగాణ వ్యక్తి మహారాష్ట్ర గవర్నర్‌గా ఉండటం వల్ల మేడి గడ్డ బ్యారేజీ నిర్మాణం కల సాకా రమవుతోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. -
మద్యం దుకాణాలతోనే ప్రమాదాలు
వాటిని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరిన విపక్షాలు సాక్షి, హైదరాబాద్: ‘రోడ్డుకు ఇరువైపులా మద్యం దుకాణాలు ఉండటం ప్రమాదాలకు కారణం అవుతోంది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వాటిని తొలగించాలి’ అని విపక్ష సభ్యులు కోరారు. గురువారం శాసన మండలిలో జాతీయ రహదారులపై స్వల్పకాల చర్చ జరిగింది. దీనిపై బీజేపీ సభ్యులు రామచందర్‌రావు, ఎంఐఎం సభ్యులు జాప్రీ, కాంగ్రెస్ సభ్యులు రాజగోపాల్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వివరణ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు ఉన్న రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉన్న జాతీయ రహదారి 65 మీద చిట్యాల్, చౌకపల్లి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జీల నిర్మాణం చేపడతామన్నారు. హైదరాబాద్– శ్రీశైలం రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా మార్చాలని నివేదించామని తెలిపారు. హైదరాబాద్‌కు 50 కి.మీ దూరంలో 390 కి.మీల రింగ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నట్లు ప్రకటించారు. -
పెరుగుతూ.. తగ్గుతూ
♦ భద్రాచలంలో 52 అడుగుల వద్ద నిలకడగా నీటిమట్టం ♦ వరద నీటితో గ్రామాలకు నిలిచిన రాకపోకలు ♦ అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ♦ విలీన మండలాలకు బస్సులు నిలిపివేత ♦ వరదపై అధికారులతో సమీక్షించిన మంత్రి తుమ్మల సాక్షి ప్రతినిధి, ఖమ్మం/భద్రాచలం : గోదావరి పరీవాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వరద నీరు పోటెత్తుతుండటంతో ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా వరద ప్రవాహం ఇదే రీతిన ఉండగా.. భద్రాచలం వద్ద మంగళవారం 52.4 అడుగుల నీటిమట్టం నమోదైంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో వరద ప్రవాహం ఉండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వరదల వల్ల గోదావరి పరీవాహక మండలాల్లో వేలాది ఎకరాల పంట పొలాలు నీటిలోనే ఉన్నాయి. భద్రాచలం వద్ద స్నాన ఘట్టాలపై.. కల్యాణ కట్టకు ఆనుకుని వరద నీరు ప్రవహిస్తుండటంతో పుష్కరాల సమయంలో చేపట్టిన తాత్కాలిక షెడ్లు, విద్యుత్ స్తంభాలు నీటమునిగాయి. వరద ఉధృతి తగ్గకపోవటంతో పరీవాహక మండలాల్లోని పలుచోట్ల రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిల్వ ఉంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కరకట్ట స్లూయిస్ల లీకేజీల వల్ల వరద నీరు భద్రాచలంలోకి వస్తుండటంతో అశోక్‌నగర్ కొత్తకాలనీ వరదలో చిక్కుకుంది. ఇక్కడున్న ఇరవై ఇళ్ల వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. రాకపోకలకు ఇబ్బందులు గోదావరి వరద ప్రభావం భద్రాచలం, పాల్వంచ డివిజన్లోని తొమ్మిది మండలాలపై చూపుతోంది. భద్రాచలం నుంచి ఇరువైపులా ఉన్న రహదారులపై వరద నీరు చేరుతోంది. వాజేడు మండలంలోని వాజేడు-గుమ్మడిదొడ్డి రహదారి ఇంకా వరద నీటిలోనే ఉంది. దీంతో ఇక్కడికొచ్చే ప్రజానీకం జగన్నాధపురం మీదుగా ఆరు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. చెరుకూరు, కృష్ణాపురం, కడేకల్, పూసూరు, దూలాపురం వద్ద గోదావరి నీరు రోడ్లపైకి ఎక్కింది. వెంకటాపురం మండలంలోని ఎధిర, బోదాపురం, కుక్కెతొర్రె వద్ద రోడ్లపైకి వచ్చిన వరద నీరు రెండు రోజులుగా అలాగే ఉండటంతో అత్యవసర పనుల నిమిత్తం ప్రజలు అదే నీటిలో ప్ర యాణం సాగిస్తున్నారు. దుమ్ముగూడెం బ్రాంచ్ ఆనకట్ట వద్ద వరద నీరు పొంగి పొర్లుతోంది. పర్ణశాలలో సీతవాగు రెండో రోజు నీటిలో మునిగి ఉంది. దుకాణాలు కూడా నీట మునగడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. సున్నంబట్టి, ప్రగళ్లపల్లి గ్రామా ల మధ్య వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు కాశీనగరం మీదుగా మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తున్నారు. భద్రాచలం-చర్ల ప్రధాన రహదారిలో దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక, రేగుబల్లి, నడికుడి రోడ్లపై గోదావరి వరద చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పర్ణశాలకు వెళ్లే మార్గంలోనూ నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పర్ణశాల దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇక్కడి వరద పరిస్థితిని చూసి వెనుదిరుగుతున్నారు. విలీన మండలాలకు బస్సులు బంద్ వరదలతో ప్రధాన రహదారులపైకి నీరు చేరడంతో ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. భద్రాచలం డిపో నుంచి ఏపీలో విలీనమైన మండలాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను పూర్తిగా నిలిపివేశారు. భద్రాచలం నుంచి కూనవరం రహదారిలో రాయన్పేట, నెల్లిపాక, గౌరీదేవిపేట, మురుమూరు, పోలిపాకల వద్ద ఆర్అండ్బీ రహదారిపై మూడు అడుగులకు పైగా వరద నీరు చేరటంతో ఎటువంటి వాహనాలు తిరగలేదు. విలీన మండలాలైన కూనవరం, వీఆర్‌పురం మండలాలకు వెళ్లే వారు ఎటపాక, లక్ష్మీపురం, ఏడుగురాళ్లపల్లి మీదుగా కూటూరు నుంచి ఆయా మండలాలకు చేరుకున్నారు. భద్రాచలం నుంచి వెంకటాపురం రూట్లో 13 సర్వీసులు, విలీన మండలాలకు వెళ్లే 4 సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. దీంతో భద్రాచలం డిపోకు రూ.1.50లక్షల నష్టం వాటిల్లినట్లు డీఎం నర్సింహ తెలిపారు. మంత్రి తుమ్మల పర్యటన గోదావరికి వరద పెరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం భద్రాచలంలో పర్యటించారు. గోదావరి స్నాన ఘట్టాల వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. కరకట్ట స్లూయిస్‌లను పరిశీలించి.. వరద పరిస్థితిపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్షించారు. రెండు రోజులుగా వరద ఒకే రీతిన ఉన్నందున పరీవాహక మండలాల ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆయన ఐటీడీఏ పీఓ రాజీవ్ గాంధీ హన్మంతుకు సూచించారు. -
ఇక ‘హరిత’ రహదారులు
* అన్ని ప్రధాన రోడ్లకూ ఇరువైపులా లక్షల సంఖ్యలో మొక్కలు * వాటి సంరక్షణ బాధ్యత అన్ని ప్రధాన విభాగాలకు కేటాయింపు * ప్రతి రెండు, మూడు నెలలకోమారు సంరక్షణపై సమీక్షలు * ప్రణాళిక సిద్ధం చేసిన రోడ్లు భవనాల శాఖ సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులు పచ్చదనంతో కళకళలాడనున్నాయి. ఇందుకోసం రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఇతర విభాగాలతో కలసి రోడ్లకు ఇరువైపులా లక్షల సంఖ్యలో మొక్కలను పెంచాలని నిర్ణయించింది. తొందరగా పెరగాలన్న ఉద్దేశంతో ఏదో ఒక మొక్క నాటే పద్ధతి కాకుండా నీడనిచ్చే, ఫలాలు అందించే, సీజన్ ప్రకారం రకరకాల పూలతో అందంగా కనిపించే వాటిని మాత్రమే నాటాలని నిర్ణయించింది. భవిష్యత్తులో మళ్లీ రోడ్లను విస్తరిస్తే చెట్లు కోల్పోయే పరిస్థితి దాపురించకుండా రోడ్లకు కాస్త దూరంగా మొక్కలు నాటనున్నారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలో తెలంగాణ సరిహద్దు ముగిసే 160 కిలోమీటర్ల నిడివిలో ఏకంగా లక్షన్నర మొక్కలు నాటబోతున్నారు. ఇక హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిలో విస్తరణ కోసం వేల సంఖ్యలో భారీ వృక్షాలను తొలగించినందున దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ మార్గంలో మొక్కలు నాటి పెంచేందుకు అవసరమైన స్థలం అందుబాటులో లేకపోవటంతో రైతులు, ప్రైవేటు స్థల యజమానులతో చర్చించి వారి స్థలాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. సంరక్షణ బాధ్యతల అప్పగింత.. ఐదు కిలోమీటర్ల చొప్పున నిడివిని విభజించి ఒక్కో భాగాన్ని ఒక్కో విభాగానికి అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. ఆ నిడివిలో మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించే బాధ్యత కూడా ఆ విభాగానిదే. ప్రతి రెండు మూడు నెలలకోమారు ఆ మొక్కల సంరక్షణపై సమీక్ష నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలు అప్పగించాలి. ఒక్కో మొక్కకు రూ.5 చొప్పున నిధులను ఆ విభాగానికి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ సంవత్సరానికిగానూ ఇందుకు రూ.46 కోట్లను కేటాయించింది. ఇక రోడ్లను ఆనుకుని ఉండే పొలాల గట్ల వెంట కూడా మొక్కలు నాటి సంరక్షించేలా రైతుల్లో అవగాహన తేనున్నారు. వారికి ఉచితంగా మొక్కలు అందజేసి వాటిని సంరక్షించేలా రైతులను ప్రోత్సహించాలని రోడ్లు భవనాల శాఖ నిర్ణయించింది. ఇక్కడ రైతులు కోరే మొక్కలనే అందిస్తారు. అడవుల పెంపకానికి ప్రాధాన్యం: మంత్రి తుమ్మల ‘‘భవిష్యత్తుపై ముందుచూపు కొరవడి గతంలో అత్యంత విలువైన వృక్ష సంపదను కోల్పోయాం. ఈ తప్పు తెలంగాణలో ఇక జరగొద్దు. అభివృద్ధి పేరుతో కోల్పోతున్న వృక్షాలను మళ్లీ పొందాల్సి ఉంది. గత 15 ఏళ్లలో అత్యంత వేగంగా అడవులు కోల్పోయిన జిల్లాగా ఖమ్మం నిలిచింది. అందుకే రోడ్లకిరువైపులా మొక్కలు నాటి పెంచాలని నిర్ణయించాం. 26 వేల కి.మీ. మేర మొక్కలు నాటబోతున్నాం. ఇందులో అన్ని ప్రభుత్వ విభాగాలతోపాటు రైతులనూ భాగస్వాములను చేస్తాం. నాటిన ప్రతి మొక్కా వృక్షం కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతాం’’ -
కబ్జా స్థలాలు స్వాధీనం చేసుకోండి
ఆర్అండ్బీ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం సాక్షి, హైదరాబాద్: అన్యాక్రాంతమైన రోడ్లు భవనాలశాఖ స్థలాల ను తిరిగి స్వాధీనం చేసుకుని, వాటి సరిహద్దులు నిర్ధారించి శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వాటిని తిరిగి రికార్డుల్లో పొందుపరచాలన్నారు. సోమవారం ఆయన ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం చేపట్టిన రోడ్లు, వంతెనల పనులను వచ్చే ఆర్థిక సంవత్సరం చివరినాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. భూవివాదాల వల్ల పనుల్లో జాప్యం లేకుం డా చూడాలన్నారు. ఆ వివాదాలను సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించా రు. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చ టం, శిథిలమైన రహదారులకు మరమ్మతు చేయటం, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరసల రహదారుల నిర్మాణం, నదులు, వాగులు వంకలపై చేపట్టిన బ్రిడ్జిల నిర్మాణాన్ని గడువులోగా పూర్తిచేయాలన్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు ఇల్లు, కార్యాలయా ల సముదాయం నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున డిసెంబరు నాటికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలన్నారు. గడువులోగా రోడ్లు పూర్తి చేయని కాంట్రాక్టర్లను ఉపేక్షించబోమన్నారు. హైదరాబాద్‌లో తుదిదశకు చేరుకున్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను డిసెంబరు కల్లా పూర్తిచేయాలన్నారు. ఎర్రమంజిల్‌లో పూర్తయిన రోడ్లు భవనాల శాఖ కార్యాలయ భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఈఎన్సీలు బిక్షపతి, రవీందర్రావు, గణపతిరెడ్డి తదితరులు హాజరయ్యారు. -
త్వరలో కొత్త జాతీయ రహదారులు
1,018 కి.మీ. రోడ్లకు కేంద్ర మంత్రి హామీ * గడ్కారీని కలసిన మంత్రి తుమ్మల, ఎంపీల బృందం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో త్వరలో కొత్తగా 1,018 కి.మీ మేర జాతీయ రహదారులను ప్రకటిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ రాష్ట్ర ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. గత 50 ఏళ్లలో రాని రహదారులను 5 ఏళ్లలో ఇస్తామని భరోసా ఇచ్చారు. రహదారుల గురించి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీలు కవిత, జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బూరనర్సయ్యగౌడ్, మరికొందరు టీఆర్ఎస్ ఎంపీలతో పాటు కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డిలతో కూడిన ప్రతినిధి బృందం సోమవారం ట్రాన్స్‌పోర్టు భవన్లో కేంద్ర మంత్రి గడ్కారీని కలసి వినతి పత్రాన్ని అందచేసింది. భేటీ అనంతరం మంత్రి తుమ్మల, ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని రహదారుల సమస్యను, వామపక్షతీవ్రవాద ప్రాబల్యప్రాంతాల్లో అప్రోచ్‌రోడ్ల నిర్మాణాల అంశాలను గడ్కరీ దృష్టికి తెచ్చామన్నారు. డ్రైపోర్టులు, జలరవాణా మార్గాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. జాతీయ రహదారులుగా ప్రకటించనున్న 1,018 కి.మీలలో 220 కి.మీ కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, కల్వకుర్తి, జడ్చర్ల వరకు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్టు ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి చెప్పారు. కాగా మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో అమలైన పథకాలు, ప్రాజెక్టులన్నిటినీ తెలంగాణకు వర్తింప చేయాలని మంత్రి తుమ్మల.. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీకి విజ్ఞప్తి చేశారు. అశోక గజపతిరాజుతో తుమ్మల భేటీ పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజుతో మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. బేగంపేట విమానాశ్రయాన్ని రక్షణ శాఖ స్వాధీనం చేసుకోవడానికి జరుగుతున్న ప్రతిపాదనలు, కొత్తగూడెం, వరంగల్‌లో విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. బేగంపేట విమానాశ్రయాన్ని రక్షణ శాఖకు ఇచ్చే ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని కోరారు. దానిని పౌరవిమానాశ్రయంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. -
సార్ రాలే..!
♦ రద్దయిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పర్యటన ♦ సీఎం వరాల జల్లుపై ఆశలు.. అడి యూశలు ♦ తొలుత పాలేరు తొలగింపు..ఆ తర్వాత మొత్తానికే రద్దు ♦ జిల్లా పర్యటనన్న ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి... ♦ తీవ్ర జ్వరమే కారణమన్న మంత్రి తుమ్మల ♦ గోదారి పుష్కరాల అనంతరం సీఎం వస్తారని ప్రకటన సారొస్తారనుకున్నారు.. సమస్యలు చెప్పుకుందామని నగర వాసులు సిద్ధమయ్యూరు.. ముఖ్యమంత్రి మన గల్లీల్లో తిరుగుతారని తెగ మురిసిపోయూరు.. సీఎం చంద్రశేఖరరావు పర్యటన తొలుత ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలను కుంటే.. అంతలోనే పాలేరు రద్దరుుంది. సరేలే..! ఖమ్మమైనా వస్తారనుకుని గురువారం నాటి పర్యటనకు అందరూ రెడీ అరుుపోయూరు. ఇంతలోనే టూర్ క్యాన్సిల్. జ్వరం కారణంగా కేసీఆర్ సారు రావట్లేదనే సమాచారంతో అందరిలోనూ నైరాశ్యం. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనన్న ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి వస్తుండటం సర్వత్రా చర్చనీయూంశం. - సాక్షిప్రతినిధి, ఖమ్మం సాక్షిప్రతినిధి, ఖమ్మం : ‘తొలిసారి సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రానికి వస్తుండటంతో అధికారుల హడావుడి.. షెడ్యూల్లో ఖమ్మం నగరంతో పాటు పాలేరు నియోజకవర్గం.. ఆ తర్వాత బుధవారం రాత్రికిరాత్రే పాలేరు తొలగింపు.. ఖమ్మం నగరం ఒక్కటే సీఎం పర్యటన.. సర్వం సిద్ధం చేసిన అధికారులు .. సీఎం రాక కోసం ఎదురుచూపులు.. వెలుగుమట్ల హెలిప్యాడ్ వద్దకు పరుగులు.. సీఎం టూర్ రద్దు అంటూ షెడ్యూల్ సమయానికి గంట ముందే జిల్లా యంత్రాంగానికి సమాచారం.’ ఇలా ముఖ్యమంత్రి పర్యటన రద్దు కావడంతో మళ్లీ ఎప్పుడు ఉంటుందోనని అధికారుల్లో హైరానా.. వరలా జల్లు కురిపిస్తారని ఆశించిన నగర ప్రజల్లో నైరాశ్యం. మొత్తానికి ముఖ్యమంత్రికి తీవ్ర జ్వరం రావడంతో జిల్లా పర్యటనకు ముహూర్తం కుదర్లేదట..సారొస్తే ఓ పని అరుుపోయేదే..మళ్లీ ఎప్పుడు వస్తారో ఏమో..అప్పటిదాకా టెన్షన్ పడాల్సిందేనా.. అంటూ అధికారులు నిట్టూర్చటం కనిపించింది. వారుుదాలే వారుుదాలు.. భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగానే సీఎం కేసీఆర్ జిల్లాలో అడుగు పెట్టారు. ఈ పర్యటనలో భాగంగానే మణుగూరులో భద్రాద్రి విద్యుత్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జిల్లా వైపు చూడలేదు. అయితే అప్పట్లో వారం రోజుల్లో ఖమ్మం నగరం వచ్చి.. రెండు, మూడు రోజులు ఇక్కడే ఉండి నగర అభవృద్ధికి మాస్టర్‌ప్లాన్ తయారు చేయిస్తానని ప్రకటించిన సీఎం..ఆ విషయమే మర్చిపోయూరు. శ్రీరామ నవమి నుంచి ఇప్పటి వరకు సీఎం జిల్లా పర్యటన పలుమార్లు వాయిదా పడింది. గురువారం నాటి పర్యటన కూడా రద్దు కావడంతో అధికారులు మలి పర్యటన ఎప్పుడోనని చర్చించుకున్నారు. తెలంగాణలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో సీఎం పలుమార్లు పర్యటించారు. జిల్లాకు మాత్రం ఒక్కసారే రావడంతో ఖమ్మం అభివృద్ధిపై సీఎం నిర్లక్ష్యంగా ఉన్నారని ఓవైపు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టాయి. గురువారం ఒక్కరోజు పర్యటనకు షెడ్యూల్ రూపొందించారు. మొదట రఘునాథపాలెంలోని వెలుగుమట్ల, రమణగుట్ట, ప్రకాశ్‌నగర్, పాలేరు నియోజకవర్గంలోని ఆరెంపుల, తిరుమలాయపాలెంను పేర్కొన్నారు. మొక్కలు నాటడడంతో పాటు రమణగుట్టలో నిరుపేదలతో మాట్లాడుతారని ప్రకటించారు. ఆ తర్వాత పాలేరు నియోజకవర్గాన్ని షెడ్యూల్ నుంచి తొలగించారు. సీఎం జిల్లా పర్యటన తర్వాత వరంగల్ జిల్లా పర్యటన ఉన్నందున సమయం సరిపోదని పాలేరును తొలగించినట్లు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. అయితే పోడు భూములపై వామపక్షాలు ఆందోళన చేస్తూ సీఎం కాన్వాయ్‌ను అడ్డుకంటాయన్న ఉద్దేశంతోనే పాలేరును షెడ్యూల్ నుంచి తొలగించినట్లు సమాచారం. చివరకు వెలుగుమట్ల, ఖమ్మం నగరం ఒక్కటే టూర్ షెడ్యూల్లో ఉన్నా అదీ రద్దు కావడం గమనార్హం. ఎదరుచూసి.. వెనుదిరిగి రమణగుట్టలో నివాసం ఉంటున్న నిరుపేదలు మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ, వీధి దీపాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూరికికూపంలా ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాజీవ ఆవాస్ యోజన పథకం జాబితాలోకి కూడా ఎక్కింది. ఇక్కడ సమస్యలను సీఎం నేరుగా చూడడంతో పాటు కొంతమంది పేదలతో మాట్లాడుతారని ప్రకటించడంతో ఇక తమ సమస్యలకు మోక్షం కలుగుతుందని ఆశించారు.షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు రమణగుట్టలో సీఎం పర్యటన ఉంది. అయితే సీఎం రావడం లేదని అప్పటి వరకు ఎదురుచూసిన ప్రజలు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. మళ్లీ ఎప్పుడో..? ప్రస్తుతం సీఎం పర్యటన రద్దు కావడంతో మళ్లీ ఎప్పుడు ఉంటుందోనని చర్చ జరుగుతోంది. పుష్కరాల అనంతరం జిల్లాకు సీఎం వస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించినా ఇప్పట్లో లేనట్లేనని సమాచారం. కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా సీఎం పర్యటన కొనసాగే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నగరంలో రెండు, మూడు రోజుల పాటు సీఎం ఇక్కడే ఉండి.. ఖమ్మంపై వరాల జల్లు కురిపిస్తారని సమాచారం. అప్పటి వరకు జిల్లాలో సీఎం అడుగుపెట్టరని అంటున్నారు. పుష్కరాలకు సీఎం జిల్లాకు వచ్చినా మళ్లీ భద్రాచలానికే పరిమితం కావచ్చని భావిస్తున్నారు. వచ్చేనెల లేదా సెప్టెంబర్‌లో సీఎం పర్యటనకు ప్లాన్ చేసే అవకాశం ఉంది. మొక్కలు నాటిన మంత్రి, అధికారులు.. ముఖ్యమంత్రి పర్యటన రద్దు కావడంతో ఉదయం 11.30 గంటలకు వెలుగుమట్ల అటవీ భూములకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు చేరుకొని మొక్కలు నాటారు. లకారం చెరువు పనులను పరిశీలించారు. ‘తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతున్నందు వల్లే సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన వాయిదా పడింది’ అని మంత్రి తుమ్మల మీడియూకు తెలిపారు. గోదావరి పుష్కరాలు ముగిసిన అనంతరం జిల్లా పర్యటనకు సీఎం వస్తారన్నారు. మొక్కలు నాటిన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ, హరితహారం ఇన్చార్జి ప్రియాకం వర్గీస్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ భూపాల్‌రెడ్డి, అటవీ సంరక్షణ ముఖ్య అధికారి అజయ్‌మిశ్రా, డీఐజీ మల్లారెడ్డి, కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి ఉన్నారు. -
రేపు నల్లగొండ జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన
బొమ్మలరామారం : నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు తెలంగాణ రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం శంకుస్థాపన చేయనున్నట్టు టీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి బాల నరసింహ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుడి బావి చౌరస్తా నుండి బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు వరకు రెండు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్ధాపన చేయనున్నారని వివరించారు. మంత్రితో పాటు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. -
రైతులను ఆదుకుంటాం : మంత్రి తుమ్మల
పెనుబల్లి (ఖమ్మం): ఖమ్మం జిల్లా పెనుబల్లి, తల్లాడ మండలాలలో బుధవారం రాత్రి కురిసిన వడగండ్లతో కూడిన భారీ వర్షానికి పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం పెనుబల్లి, తల్లాడ మండలాలలో అకాల వర్షానికి కూలిపోయిన ఇండ్లను, నేల రాలిన మామిడికాయ తోటలను, వడగండ్ల వానకు పంట కోల్పోయిన మొక్కజొన్న తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల.. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతీ రైతు పొలాన్ని ఉద్యాన, వ్యవసాయ శాఖాధికారులు, రెవెన్యూ అధికారులు పరిశీలించి, ప్రభుత్వానికి నష్టపోయిన రైతుల వివరాలతో సమగ్రంగా నివేదిక అందించాలని ఆదేశించారు. నివేదిక అందగానే ప్రభుత్వం నుంచి కొత్త జీవో ప్రకారం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందేలా సాయం చేస్తామన్నారు. ఇళ్లు కోల్పోయిన వారిని గుర్తించి సమాచారాన్ని అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.