పెరుగుతూ.. తగ్గుతూ
♦ భద్రాచలంలో 52 అడుగుల వద్ద నిలకడగా నీటిమట్టం
♦ వరద నీటితో గ్రామాలకు నిలిచిన రాకపోకలు
♦ అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
♦ విలీన మండలాలకు బస్సులు నిలిపివేత
♦ వరదపై అధికారులతో సమీక్షించిన మంత్రి తుమ్మల
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/భద్రాచలం : గోదావరి పరీవాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వరద నీరు పోటెత్తుతుండటంతో ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా వరద ప్రవాహం ఇదే రీతిన ఉండగా.. భద్రాచలం వద్ద మంగళవారం 52.4 అడుగుల నీటిమట్టం నమోదైంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో వరద ప్రవాహం ఉండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వరదల వల్ల గోదావరి పరీవాహక మండలాల్లో వేలాది ఎకరాల పంట పొలాలు నీటిలోనే ఉన్నాయి. భద్రాచలం వద్ద స్నాన ఘట్టాలపై..
కల్యాణ కట్టకు ఆనుకుని వరద నీరు ప్రవహిస్తుండటంతో పుష్కరాల సమయంలో చేపట్టిన తాత్కాలిక షెడ్లు, విద్యుత్ స్తంభాలు నీటమునిగాయి. వరద ఉధృతి తగ్గకపోవటంతో పరీవాహక మండలాల్లోని పలుచోట్ల రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిల్వ ఉంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కరకట్ట స్లూయిస్‌ల లీకేజీల వల్ల వరద నీరు భద్రాచలంలోకి వస్తుండటంతో అశోక్‌నగర్ కొత్తకాలనీ వరదలో చిక్కుకుంది. ఇక్కడున్న ఇరవై ఇళ్ల వారిని పునరావాస కేంద్రానికి తరలించారు.
రాకపోకలకు ఇబ్బందులు
గోదావరి వరద ప్రభావం భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లోని తొమ్మిది మండలాలపై చూపుతోంది. భద్రాచలం నుంచి ఇరువైపులా ఉన్న రహదారులపై వరద నీరు చేరుతోంది. వాజేడు మండలంలోని వాజేడు-గుమ్మడిదొడ్డి రహదారి ఇంకా వరద నీటిలోనే ఉంది. దీంతో ఇక్కడికొచ్చే ప్రజానీకం జగన్నాధపురం మీదుగా ఆరు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. చెరుకూరు, కృష్ణాపురం, కడేకల్, పూసూరు, దూలాపురం వద్ద గోదావరి నీరు రోడ్లపైకి ఎక్కింది. వెంకటాపురం మండలంలోని ఎధిర, బోదాపురం, కుక్కెతొర్రె వద్ద రోడ్లపైకి వచ్చిన వరద నీరు రెండు రోజులుగా అలాగే ఉండటంతో అత్యవసర పనుల నిమిత్తం ప్రజలు అదే నీటిలో ప్ర యాణం సాగిస్తున్నారు. దుమ్ముగూడెం బ్రాంచ్ ఆనకట్ట వద్ద వరద నీరు పొంగి పొర్లుతోంది.
పర్ణశాలలో సీతవాగు రెండో రోజు నీటిలో మునిగి ఉంది. దుకాణాలు కూడా నీట మునగడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. సున్నంబట్టి, ప్రగళ్లపల్లి గ్రామా ల మధ్య వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు కాశీనగరం మీదుగా మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తున్నారు. భద్రాచలం-చర్ల ప్రధాన రహదారిలో దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక, రేగుబల్లి, నడికుడి రోడ్లపై గోదావరి వరద చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పర్ణశాలకు వెళ్లే మార్గంలోనూ నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పర్ణశాల దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇక్కడి వరద పరిస్థితిని చూసి వెనుదిరుగుతున్నారు.
విలీన మండలాలకు బస్సులు బంద్
వరదలతో ప్రధాన రహదారులపైకి నీరు చేరడంతో ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. భద్రాచలం డిపో నుంచి ఏపీలో విలీనమైన మండలాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను పూర్తిగా నిలిపివేశారు. భద్రాచలం నుంచి కూనవరం రహదారిలో రాయన్‌పేట, నెల్లిపాక, గౌరీదేవిపేట, మురుమూరు, పోలిపాకల వద్ద ఆర్‌అండ్‌బీ రహదారిపై మూడు అడుగులకు పైగా వరద నీరు చేరటంతో ఎటువంటి వాహనాలు తిరగలేదు. విలీన మండలాలైన కూనవరం, వీఆర్‌పురం మండలాలకు వెళ్లే వారు ఎటపాక, లక్ష్మీపురం, ఏడుగురాళ్లపల్లి మీదుగా కూటూరు నుంచి ఆయా మండలాలకు చేరుకున్నారు. భద్రాచలం నుంచి వెంకటాపురం రూట్‌లో 13 సర్వీసులు, విలీన మండలాలకు వెళ్లే 4 సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. దీంతో భద్రాచలం డిపోకు రూ.1.50లక్షల నష్టం వాటిల్లినట్లు డీఎం నర్సింహ తెలిపారు.
మంత్రి తుమ్మల పర్యటన
గోదావరికి వరద పెరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం భద్రాచలంలో పర్యటించారు. గోదావరి స్నాన ఘట్టాల వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. కరకట్ట స్లూయిస్‌లను పరిశీలించి.. వరద పరిస్థితిపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్షించారు. రెండు రోజులుగా వరద ఒకే రీతిన ఉన్నందున పరీవాహక మండలాల ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆయన ఐటీడీఏ పీఓ రాజీవ్ గాంధీ హన్మంతుకు సూచించారు.