బుడమేరు మొదటగా ముంచెత్తిన ప్రాంతాల్లో తగ్గని ఉధృతి
ఇంకా ముంపులోనే వన్‌టౌన్ ప్రాంతంలోని అనేక కాలనీలు
నేటికీ సాయం అందడం లేదని బాధితుల ఆందోళన
వ్యాధుల భయంతో ఇళ్లకు తిరిగిరాని బాధితులు
గూడు కోల్పోయినవారికి ఆశ్రయమవుతున్న సొరంగం
బురద, చెత్తతో నిండిపోయిన వీధులు, ఇళ్లు
వారం రోజుల తర్వాత తెరుచుకున్న వాణిజ్య దుకాణాలు
ప్రభుత్వం అక్కడక్కడా సరఫరా చేస్తున్నదీ మురుగునీరే
వంట చేసుకునే పరిస్థితులు కూడా లేవంటున్న బాధితులు
(ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షిప్రతినిధి): ఊహకందని విలయం..మాటలకందని విషాదం నుంచి ఎనిమిది రోజులైనా విజయవాడ నగరం తేరుకోలేకపోతోంది. బుడమేరు చేసిన వరద గాయం నుంచి మానకపోగా, బురద చేస్తున్న కొత్త గాయాలతో అల్లాడుతోంది. గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకూ కంటిమీద కునుకు లేకుండా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్న సింగ్‌నగర్, రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీలతో పాటు వైఎస్సార్ కాలనీ, జక్కంపూడి కాలనీ, పాలఫ్యాక్టరీ ఫ్లై ఓవర్ కింద రామరాజ్యనగర్, పంజాసెంటర్, చిట్టినగర్ సొరంగం, కబేళారోడ్డు, సితార సెంటర్, నిజాంగేట్ సెంటర్, వించిపేట, కంసాలిపేటలో వరద తాజా పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇది.
బుడమేరు ఉగ్రరూపం
గత నెల 31వ తేదీ మధ్యాహ్నం నుంచి కురిసిన భారీ వర్షానికి పరీవాహకప్రాంతం నుంచి బుడమేరుకు భారీగా నీరు వచ్చి చేరింది. మూడు చోట్ల గండి పడింది. వెలగలేరు నుంచి ఆ వరదంతా వచ్చి విజయవాడ నగరాన్ని ఈనెల 1వ తేదీ ఉదయం ముంచెత్తింది. ఆ వరద నీరు ముందుగా ప్రవేశించిన వైఎస్సార్‌కాలనీ, జక్కంపూడి కాలనీ పరిసర ప్రాంతానికి చేరుకున్న తొలిమీడియా ‘సాక్షి’కి అడుగడుగునా బాధితుల కష్టాలు కనిపించాయి.
అక్కడ బుడమేరు నేటికీ ఉగ్రరూపంలోనే ఉంది. పూర్తిగా మునిగిపోయిన ఆ పరిసర ప్రాంతాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. రాకపోకలు లేక అక్కడి ప్రజలు అల్లాడుతూనే ఉన్నారు. ఎనిమిది రోజులుగా నీటిలోనే ఇళ్లు నానిపోతుండటంతో గోడలు ఏ క్షణాన కూలిపోతాయోనని తప్పనిసరై పై అంతస్తుల్లోనే ఆశ్రయం పొందుతున్న బాధితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
కన్నీరేగాని... మంచి నీరేది
బుడమేరు వరదలకు సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన లక్షలాది మందికి తమ భవిష్యత్తు ఏమిటో అర్ధం కావడం లేదు. ముంపు ప్రాంతాల్లో చిధ్రమైన వారి జీవితాలు ఇప్పట్లో కోలుకునేలా లేవు. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రజల కన్నీరు ఇంకిపోతుందేమోగానీ ఆ అభాగ్యుల కష్టాలు తీరేలా కనిపించడం లేదు. కనీసం బురదైనా తొలగడం లేదు. వన్‌టౌన్ ప్రాంతంలో వరద నీటిలో రోజుల తరబడి మునిగిపోయిన కాలనీలు, వీధులు, రోడ్లు, ఇళ్లు బురద, చెత్తతో నిండిపోయాయి. ఆదివారం ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో వాటిని తొలగించుకునేందుకు బాధితులు నానా కష్టాలు పడుతున్నారు. సింగ్‌నగర్, రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ, కంసాలిపేటలో బురదతో పాటు డ్రెయినేజీ నీటితో పాటు, కాలకృత్యాలు కూడా అదే నీటిలో కలిసిపోవడంతో అదంతా భారీగా దుర్ఘందాన్ని వెదజల్లుతోంది.
వరద నీటిలోనే రోజుల తరబడి నరకయాతన అనుభవించిన వారిలో కొందరు ఇళ్లు వదిలి వెళ్లిపోతుంటే, మరికొందరు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. కానీ వీరికి కనీసం తాగేందుకు మంచి నీరు దొరకడం లేదు. వంట సరుకులు, కూరగాయలు తెచ్చుకున్నాగానీ వాడుకునేందుకు నీళ్లు లేక పొయ్యి వెలిగించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఇస్తున్న నీరూ మురుగుతో నిండి ఉంటోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధుల భయంతో చాలా మంది ఇళ్లకు తిరిగిరావడం లేదు. దీంతో వారంగా వేలాది ఇళ్లకు తాళాలు వేసే ఉన్నాయి. పూర్తిగా ఇళ్లు కూలిపోయి గూడు కోల్పోయిన వారిలో కొందరు చిట్టినగర్ వద్ద సొరంగంలో తలదాచుకుంటున్నారు.
స్ఫూర్తినింపుతున్న ప్రజలు
వరద వల్ల లక్షలాది మంది ఉపాధి, వ్యాపారాలు లేక రోడ్డున పడ్డారు. వారిలో కొందరు చిరు వ్యాపారులు విషాదం నుంచి తేరుకుంటున్నారు. దుకాణాల్లో పేరుకుపోయిన బురదను తొలగించుకుని, పాడైపోయిన వస్తువులు, సరుకులు బయటపడేసి మళ్లీ కొత్తగా వ్యాపారం మొదలుపెడుతున్నారు. కోలుకోలేని కష్టం నుంచి తేరుకుని దుకాణాలను తెరిచి స్ఫూర్తినింపుతున్నారు. వృద్ధులు, చిన్నారులను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. సితార సెంటర్, కబేళ రోడ్డు, రామరాజ్య నగర్, వైఎస్సార్ కాలనీ, జక్కంపూడి కాలనీలు నేటికీ వరద నీరు పూర్తిగా తొలగలేదు.
ఇక్కడ పలు వీధులకు ఇప్పటికీ ప్రజల రాకపోకలకు అవకాశం లేదు. అలాంటి చోటికి ప్రభుత్వం నుంచి ఆహారం, తాగునీరు, నిత్యావసరాలు చేరడం లేదు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ వేలాది వాహనాలు నీళ్లలోనే ఉండిపోయాయి. అవన్నీ పాడైపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వదిలేస్తున్నారు. తరలించేందుకు అవకాశం ఉన్నవాటిని అతి కష్టం మీద మరమ్మతులకు తీసుకువెళుతున్నారు. ముంపు తగ్గిన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నప్పటికీ అవి నీటిలో మొరాయిస్తున్నాయి.
సర్వం కోల్పోయాం ఆదుకోవాలి
మేము కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. ఆదివారం ఉదయం బుడమేరు వరద ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కట్టుబట్టలతో బిల్డింగ్‌పైకి పరుగులు పెట్టాం. రెండు రోజుల పాటు ఆహారం, మంచినీరు లేకుండా బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయాం. కరెంట్ లేదు. ప్రభుత్వ సహాయక చర్యలు మాదాకా రాలేదు. తెలిసిన వాళ్ల ద్వారా పడవను తెప్పించుకుని ఒడ్డుకు చేరాం. బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకున్నాం. వారం రోజుల తర్వాత ఇంటిలోకి వెళ్లి చూస్తే గృహోపకరణాలన్నీ వరదలో తడిసి పాడైపోయాయి. ఇళ్లంతా బురద పేరుకుపోయింది. సర్వం కోల్పోయి తీవ్రంగా నష్ట పోయాం. ప్రభుత్వమే మమ్ములను ఆదుకోవాలి. – రేగాని సామ్రాజ్యం, వాంబేకాలనీ, సింగ్‌నగర్
లంటీర్లు ఉంటే ఈ కష్టాలు ఉండేవి కాదు
ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నా. వరదలో ఇల్లు మునిగిపోయింది. ఆటో వరదలో మునిగి పాడైపోయింది. మా దగ్గర చిల్లిగవ్వలేదు. వారం రోజులుగా ఆహారం లేక, మంచినీరు అందక నరకం చూస్తున్నాం. వలంటీర్లు ఉంటే కుటుంబంలో అందరికీ ప్రభుత్వంఅందిస్తున్న సహాయ చర్యలు సక్రమంగా అందేవి. ఇప్పుడు ప్రధాన రోడ్డు వరకే ట్రాక్టర్ వస్తోంది. అక్కడకు వెళితే భోజనం ప్యాకెట్లు, వాటర్ ఇస్తున్నారే తప్ప చిన్న వీధుల్లోకి రావడం లేదు. భోజనం ప్యాకెట్లు తెరిచి చూస్తే వాసన వస్తోంది. తినలేకపోతున్నాం.
– పలిశెట్టి సురేష్, సింగ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment