ఉగ్ర గోదారి...!
♦ 50 అడుగుల వద్ద నిలకడగా నీటిమట్టం
♦ పరీవాహక మండలాల్లో హైఅలర్ట్
♦ పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్
♦ కరకట్ట స్లూరుుస్‌లలోకి వరద నీరు
ఒక్కసారిగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గంటగంటకూ నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. ఆదివారం రాత్రి 7గంటలకు 23.3 అడుగులు నమోదు కాగా సోమవారం ఉదయం ఐదు గంటలకే 42 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రానికి 51 అడుగులకు చేరింది. ఆపై గోదారమ్మ శాంతించింది. దీంతో 50 అడుగుల వద్ద నీటిమట్టం నిలకడగా ఉంది. ఒక్క రోజు వ్యవధిలోనే గోదావరికి వరద ప్రవాహం పోటెత్తటంతో పరీవాహక ప్రాంత మండలాల ప్రజలను అప్రమత్తం చేశారు.
భద్రాచలం : గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ప్రాజెక్టుల నుంచి వస్తున్న నీరంతా నదిలోకి చేరుతుండటంతో క్రమేపీ నీటిమట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద సోమవారం సాయంత్రం 5 గంటలకు 51 అడుగుల నీటిమట్టం నమోదైంది. 6 గంటల నుంచి 50 అడుగులతో నిలకడగా ప్రవహిస్తోంది. 48 అడుగుల తర్వాత అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 53 అడుగులకు చేరువలో ఉండటంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆదివారం రాత్రి 7 గంటలకు 23.3 అడుగులున్న నీటిమట్టం ఆ తరువాత గంటగంటకూ పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలోనే గోదావరి వరద పోటెత్తడంతో పరీవాహక ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. వాగుల ఎగపోటుతో పొలాల్లోకి నీరు చేరింది.
ముంచెత్తిన వరద..
భద్రాచలం డివిజన్‌లోని వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాలతో పాటు పాల్వంచ డివిజన్‌లోని బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో వేలాది ఎకరాలు నీటమునిగాయి. పత్తి విత్తనాలు కుళ్లిపోయే అవకాశం ఉంది. జామాయిల్ తోటలు జలమయం అయ్యాయి. భద్రాచలం నుంచి వాజేడు వరకు పలు రహదారులపైకి వరద నీరు చేరటంతో రాకపోకలు స్తంభించాయి. దుమ్ముగూడెం మండలం పర్ణశాలలోని సీతమ్మ నారచీరలు, సీతవాగు పోటెత్తడంతో రామాయణ సుందర దృశ్యాలు, దుకాణాలు కూడా జలమయమయ్యాయి. పర్ణశాల వెళ్లే రహదారిపైకి నీరు రావడంతో రాకపోకలు స్తంభించి భక్తులు వెనుదిరిగి వెళ్లారు. స్తంభాలు నీటమునగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దిగువన ఉన్న శబరి నదికి వరదలేకపోవడం, ఈ ప్రాంతంలో వర్షాలు లేకపోవడం కొంత ఉపశమనం కలిగిస్తోంది.
రాకపోకలు బంద్
గోదావరి ప్రవాహంతో వాగులు ఎగపోటేస్తున్నాయి. పలుచోట్ల రహదారులపైకి నీరు చేరింది. వెంకటాపురం మండలంలోని బోదాపురం వాగు, పాలెం గ్రామ సమీపంలోని కుక్కెతొర్రె వాగులకు వద్ద గోదావరి వరదనీరు బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
వాజేడు మండలం వాజేడు, గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్య సుమారు కిలోమీటర్ మేర రహదారి ముంపునకు గురైంది. వాజేడు- ఎడ్జర్లపల్లి మధ్య ఉన్న బ్రిడ్జి నీట మునిగింది. వాజేడు- గుమ్మడిదొడ్డి మధ్య విద్యుత్ స్తంభాలు నీటమునిగాయి. చర్ల మండలం గుండుపేట, సున్నంబట్టి, బైరాగులపాడు మధ్య రాకపోకలు స్తంభించాయి.
నీటమునిగిన స్నానఘట్టాలు
భద్రాచలం వద్ద స్నానఘట్టాలు పూర్తిగా నీట మునిగాయి. కల్యాణ కట్టకు ఆనుకొని వరద నీరు ప్రవహిస్తోంది. భక్తులు దుస్తులు మార్చుకునేందుకు గోదావరి పుష్కరాల సమయంలో నిర్మించిన షెడ్లు నీట మునిగాయి. స్నానఘట్టాల రేవులో వేసిన విద్యుత్ స్తంభాలు కూడా మునగడంతో సరఫరా నిలిపివేశారు. స్నానఘట్టాలకు సమీపంలో వరద నీటిమట్టాన్ని తెలిపే సూచికలు సైతం నీట మునిగాయి. 48 అడుగుల వరకు మాత్రమే సూచికలు కనిపిస్తుండగా, ఆ తరువాత గోదావరి ఎంత పెరుగుతుందనేది చూసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. సూచికల ఏర్పాటులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతోనే గోదావరి వరద ఎంత ఉందనేది ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని స్థానికులంటున్నారు.
స్లూయిస్‌ల లీకేజీతో కొత్తకాలనీ ఇక్కట్లు
కరకట్ట స్లూయిస్‌ల ద్వారా గోదావరిలో నుంచి వరద నీరు లీకవ్వటంతో భద్రాచలం కొత్తకాలనీలోని ఇళ్లను వరద చుట్టుముట్టింది. కొత్తకాలనీలోని 20 ఇళ్లలోకి నీరు చేరింది. అక్కడ ఉన్న వారిని సమీపంలోని పాఠశాల భవనంలోకి తరలించి, పునరావాసాన్ని ఏర్పాటు చేశారు. స్నానఘట్టాల వద్ద ఉన్న స్లూయిస్‌ల మోటార్లను అమర్చి నీటిని గోదావరిలోకి పంపుతున్నారు. ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు మండలాల అధికారులతో సమీక్షిస్తున్నారు. క్షేత్రస్థాయి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.