గొర్రెల పెంపకంపై 75 శాతం సబ్సిడీ | TRS government subsidies on sheeps, says kcr | Sakshi
Sakshi News home page

గొర్రెల పెంపకంపై 75 శాతం సబ్సిడీ

Published Wed, Feb 1 2017 3:03 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

గొర్రెల పెంపకంపై 75 శాతం సబ్సిడీ - Sakshi

గొర్రెల పెంపకంపై 75 శాతం సబ్సిడీ

ప్రతి యాదవ కుటుంబానికి ఒక్కో యూనిట్‌ ఇస్తాం
‘భక్త రామదాసు’ ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్‌
ప్రాజెక్టుల కోసం నా చివరి రక్తపు బొట్టునూ ఖర్చు పెడతా
ఏడాదిన్నరలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం
ఏడాదిలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచినీరు, ఇంటర్నెట్‌
అర్హులైన హోంగార్డులను పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోకి తీసుకుంటామన్న ముఖ్యమంత్రి


సాక్షి, ఖమ్మం
రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై సబ్సిడీని 75 శాతానికి పెంచుతున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రతి యాదవ కుటుంబానికి ఒక గొర్రెల యూనిట్‌ను మంజూరు చేస్తామని, మొత్తంగా నాలుగు లక్షల యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో వృత్తి పనులు కోల్పోయిన వారిని ఆదుకునేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘‘మీ అండదండలు,  సహాయ సహకారాలు ఉన్నంత కాలం తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తా.. ప్రాజెక్టుల కోసం నా చివరి రక్తం బొట్టు వరకు ఖర్చు పెడతా.. పోరాటం చేస్తా, అన్ని వర్గాలను సమాన గౌరవంతో ముందుకు తీసుకెళ్తా..’’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. మంగళవారం రామదాసు జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్మించిన భక్త రామదాసు ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. అనంతరం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

ఇది అద్భుత ప్రాజెక్టు..
తెలంగాణ వస్తే ఏమొస్తుందని కొందరు మాట్లాడారని, ఈ రోజున మనం ఏం సాధించుకున్నామో పాలేరు ప్రజలను అడిగితే చెబుతారని కేసీఆర్‌ పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే అతి తక్కువ కాలంలో కేవలం పది నెలల్లో భక్త రామదాసు ప్రాజెక్టును నిర్మించి.. 60వేల ఎకరాలకు నీటిని అందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద ఇంకా కొన్ని గ్రామాలకు నీరు అందాల్సి ఉందని, ఆ పనులను వెంటనే ప్రారంభిస్తున్నామని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లికి చెందిన భక్త రామదాసు జయంతి రోజునే.. ఆయన పేరుతో పెట్టిన ప్రాజెక్టును ప్రారంభించుకోవడం గర్వకారణమన్నారు. సమైక్య రాష్ట్రంలో మనమంతా నిరాదరణకు గురయ్యామని, మన రాష్ట్రంలో మన భక్త రామదాసును గౌరవించుకునే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేలకొండపల్లిలో భక్త రామదాసు మెమోరియల్‌ను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక సీతారామ ప్రాజెక్టును ఏడాదిన్నరలో పూర్తి చేసి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు కాంగ్రెస్‌ ముఠా
ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఒక ముఠాను తయారు చేసిందని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పోటీ చేసి ఓడిపోయిన ఓ నాయకుడు మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు వెళ్లి ఆందోళనలు చేశారన్నారు. నిర్వాసితుల ముసుగులో చిత్ర విచిత్రమైన ప్రయత్నాలతో.. సిగ్గూ ఎగ్గూ లేకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదంటూ కాంగ్రెస్‌ జాతీయ నాయకుడు చిదంబరం మాట్లాడారని.. ఆయన ఇక్కడి నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదివి వెళ్లారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని స్పష్టం చేశారు. ‘‘గతంలో ఎన్నడూ లేని విధంగా వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు మేం రూ.1,000 పింఛన్‌ ఇస్తున్న మాట నిజం కాదా..? మీ (కాంగ్రెస్‌) పాలనలో ఏ రాష్ట్రంలోనైనా ఇలా పింఛన్లు ఇస్తున్నారా? కాంగ్రెస్‌ చరిత్రలో ఎన్నడైనా హాస్టళ్లలో, విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం పెట్టాలని ఆలోచించారా? గతంలో కుటుంబంలో ఒక్కో వ్యక్తికి కేవలం నాలుగు కిలోల రేషన్‌ బియ్యమే ఇచ్చారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇస్తున్న విషయం తెలియదా..’’అని పేర్కొన్నారు.
ఏడాదిలో ప్రతి ఇంటికి ఇంటర్‌నెట్, మంచినీరు..

రాబోయే సంవత్సర కాలంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి పరిశుభ్రమైన మంచినీటిని, ఇంటర్నెట్‌ను అందిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మిషన్‌ కాకతీయ కింద 46 వేల చెరువుల పునరుద్ధరణ చేపట్టామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో డబ్బాల్లాంటి ఇళ్లు కట్టించి, అదే వైకుంఠం అనుకోమ్మని చెప్పారని.. కానీ ఇప్పుడు తాము డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టి ఇస్తున్నామని చెప్పారు. రికార్డు స్థాయిలో హరితహారం చేపట్టామన్నారు. పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో 21 కొత్త జిల్లాలు, 125 మండలాలు, 68 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలూ ముస్లింలు, ఇతర మైనార్టీల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం ముస్లిం మైనార్టీ విద్యార్థులకు 200 రెసిడెన్షియల్‌ పాఠశాలలు, 71 పాఠశాలలు ఏర్పాటు చేస్తోందని చెప్పారు. విదేశాలకు వెళ్లి చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర పేద విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్‌షిప్‌ ఇచ్చేది ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. దళిత, గిరిజన, బీసీ విద్యార్థుల కోసం ఈ ఏడాదిలోనే 501 రెసిడెన్షియల్‌ స్కూళ్లు ప్రారంభిస్తామన్నారు.

అన్ని వర్గాలనూ ఆదుకుంటున్నాం..
మార్కెట్‌ కమిటీలలో రిజర్వేషన్లు తెచ్చి అందరికీ అవకాశాలు కల్పించామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు నిధులు జమ చేశామన్నారు. బ్రాహ్మణుల్లో పేదవారున్నారని, వారికోసం రూ.100 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. గత 60 ఏళ్ల పాలనలో ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏమీ చేయలేదని, తాము వారి కోసం రూ.10 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలనలో కాంట్రాక్టు కార్మికులతో రాక్షసంగా పని చేయించారని.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ హయాంలో 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ ట్రాక్టర్లు, ఆటోలపై పన్ను మినహాయింపు ఇచ్చామని తెలిపారు.

డిపెండెంట్‌ ఉద్యోగాలిస్తాం
కాంగ్రెస్, టీడీపీ హయాంలో సింగరేణి డిపెండెంట్‌ ఉద్యోగాలు లేకుండా చేశారని.. ఇప్పుడు తాము తీసుకున్న నిర్ణయంతో 25 వేల మంది నుంచి 30వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. 58 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీల పాలనలో 2,650 కిలోమీటర్ల జాతీయ రహదారులు వస్తే... తమ ప్రభుత్వం 2,776 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేయించుకుందని చెప్పారు. టీఎస్‌ ఐపాస్‌ పారిశ్రామిక విధానాన్ని ప్రపంచం మెచ్చుకుంటోందని.. 3 వేల పరిశ్రమలకు 15 రోజుల్లోపు అనుమతులిచ్చామని, 1,600 పైచిలుకు పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయని తెలిపారు. ఇక 25 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామని తాను పేర్కొన్నపుడు... అది జరిగితే అద్భుతమేనని ప్రతిపక్ష నేత జానారెడ్డి తనను అవమానపరచినట్లుగా మాట్లాడారని కేసీఆర్‌ పేర్కొన్నారు. గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదని... ఇప్పుడు ఇన్వర్టర్లు, జనరేటర్లు అవసరం లేకుండా పోయాయని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధితో కాంగ్రెస్‌ నేతల కళ్లు బైర్లు కమ్ముతున్నాయని... ఇష్టం వచ్చినట్లు అవాకులు, చెవాకులు పేలితే ఊరుకోమని హెచ్చరించారు.

వృత్తి పనులకు తోడ్పాటు
వృత్తి పనులు కోల్పోయిన వారిని ఆదుకోవాల్సి ఉందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. దాని కోసం రాబోయే బడ్జెట్‌లో మంచి కార్యక్రమం తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా రాష్ట్రంలోని ప్రతి యాదవ కుటుంబానికి ఒక గొర్రెల యూనిట్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. గతంలో యూనిట్‌కు 20 శాతం సబ్సిడీ మాత్రమే ఇచ్చేవారని, తాము 75 శాతం సబ్సిడీతో నాలుగు లక్షల గొర్రెల యూనిట్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. గ్రామీణ వ్యవస్థ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తామని.. మత్స్య, చేనేత కార్మికులకు ఎంత డబ్బు ఖర్చు పెట్టి అయినా తోడ్పాటు అందిస్తామని చెప్పారు. ఇక హోంగార్డులు చాలా ఏళ్ల నుంచి వెట్టిచాకిరీ చేస్తున్నారని, అర్హులైన వారిని పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోకి తీసుకుంటామని ప్రకటించారు. వారి వేతనాలు కూడా పెంచుతామని, దీనిపై అధికారులకు సూచనలు చేశామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, బానోతు మదన్‌లాల్, జలగం వెంకట్రావు, కోరం కనకయ్య, రాజయ్య, రెడ్యానాయక్, తాటి వెంకటేశ్వర్లు, భాస్కర్‌రావు, పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, నారదాసు లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

అటు ‘భగీరథ’పరిశీలన.. ఇటు ప్రారంభోత్సవం
ఖమ్మం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి తొలుత కూసుమంచి మండలం పాలేరులో మిషన్‌ భగీరథ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం కొత్తూరు పంచాయతీ ఎర్రగడ్డ తండా వద్ద భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. తర్వాత తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్‌ తండాలో రామదాసు పథకం నీటికి పూజలు నిర్వహించారు. అనంతరం మాదిరిపురం వద్ద మిషన్‌ భగీరథ పనులను పరిశీలించి.. తిరుమలాయపాలెం బహిరంగ సభకు వెళ్లారు. అంతకుముందు మహబూబాబాద్‌ జిల్లాలోని మరిపెడ మండలం అబ్బాయిపాలెం ఎదుళ్లగుట్ట వద్ద మిషన్‌ భగీరథ పనులను కేసీఆర్‌ పరిశీలించారు.

తుమ్మల ఇంత హుషారు అనుకోలేదు..
ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం తుమ్మల నాగేశ్వరరావు కృషి చేస్తున్నారని, ఆయన ఇంత హుషారని అనుకోలేదంటూ సీఎం కేసీఆర్‌ పొగడ్తలతో ముంచెత్తారు. తుమ్మల కృషిని పోలుస్తూ ఓ పిట్ట కథ కూడా చెప్పారు. ‘‘ఒక ఊరిలో ఓ ఇంటికి తొందరపడే ఓ చుట్టం వచ్చాడట. ఆయన పోతా.. పోతా అని తొందరపెడితే.. ‘చాలా దూరం పోవాలి కద బిడ్డా.. ఇంకా అన్నం తయారు కాలేదు. రాత్రిది కొద్దిగా చద్దన్నం ఉంది, తినివెళ్లు’అని పెద్దమ్మ అన్నదట. దానికి ఆ చుట్టం బదులిస్తూ... ‘అట్లేం లేదు పెద్దమ్మా.. చద్దన్నం తింటా, ఉడుకన్నం అయ్యే దాక ఉంటా..’అన్నాడట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆ చుట్టం లాగానే ఉన్నాడు. ముందు కొన్ని పనులు చేయించుకుని, అవి పూర్తి కాకముందే.. మరికొన్ని పనులకు హామీలు ఇప్పించుకుంటున్నారు..’’అని వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉంటే ఆశించిన అభివృద్ధి జరుగుతుందన్నారు.

‘మెగా’సంస్థ అధినేతకు సన్మానం
తిరుమలాయపాలెం: భక్త రామదాసు పథకాన్ని అనుకున్న గడువుకు ముందే.. కేవలం పది నెలల్లో పూర్తి చేసిన మెగా కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ అధినేత కృష్ణారెడ్డిని బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ సన్మానించారు. సీతారామ ప్రాజెక్టు పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కృష్ణారెడ్డిని మంత్రి తుమ్మల కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement