'ప్రగతి' పాలన | Top In The Country Of Revenue Growth | Sakshi
Sakshi News home page

'ప్రగతి' పాలన

Published Fri, Jun 2 2017 12:56 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

'ప్రగతి' పాలన - Sakshi

'ప్రగతి' పాలన

సరికొత్త పథకాలు, విధానాలతో దూసుకెళుతున్న కేసీఆర్‌ సర్కారు
గత ఏడాది కాలంలో సంచలన నిర్ణయాలు.. కొత్త చట్టాలు
- వివిధ వర్గాలు, కులాల సంక్షేమం కోసం చర్యలు
ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
ఆదాయ వృద్ధిలో దేశంలోనే టాప్‌

రాష్ట్రం ఏర్పాటైన మూడో ఏడాది ‘ప్రగతి’ పాలన దిశగా ప్రభుత్వం దూసుకెళ్లింది. తొలి రెండేళ్లు పలు సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాలపైనే దృష్టి సారించిన కేసీఆర్‌ సర్కారు.. గత ఏడాది కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు చేపట్టడంతోపాటు అభివృద్ధి దిశగా, పాలనాపరమైన సౌలభ్యం కోసం సంచలన నిర్ణయాలు తీసుకుంది. గతేడాది దసరా సందర్భంగా 21 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. అంగన్‌వాడీలు సహా క్షేత్రస్థాయి ఉద్యోగులు, నామమాత్రపు గౌరవ వేతనాలతో పనిచేస్తున్న వారికి కోరినదానికంటే అధికంగా జీతాలు పెంచింది. ఎస్సీ, ఎస్టీలకు మరింత ప్రయోజనం కోసం సబ్‌ప్లాన్‌ల స్థానంలో ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేసింది. ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీలో బిల్లును ఆమోదించడంతోపాటు బీసీ కమిషన్, ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు వంటి చర్యలు చేపట్టింది. ప్రతిష్టాత్మక పథకాలైన మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయలను మూడో ఏడాదిలో మరింత ముమ్మరం చేసింది. ఇక వరుసగా మూడో ఏడాదీ భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో వివిధ రంగాలపై ప్రభావం పడినా ఆదాయ వృద్ధిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.        
 – సాక్షి, హైదరాబాద్‌
 
తెలంగాణ ఏర్పడిన కొత్తలో విద్యుత్‌ కొరత వెంటాడింది. కానీ సీఎం కేసీఆర్‌ స్వయంగా నిరంతరం పర్యవేక్షించి ఈ సమస్యను అధిగమించారు. తొలి ఏడాది వేసవిలోనే 24 గంటల విద్యుత్‌ అందించ గలిగారు. తర్వాత కూడా విద్యుత్‌ కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. విద్యుత్‌ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఉదయ్‌’పథకంలోనూ తెలంగాణ చేరింది. ఇక రైతుల పంట రుణాల మాఫీ పథకం వాయిదాల చెల్లింపు విజయవంతంగా ముగిసింది. మరోవైపు సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రధానంగా గోదావరి, కృష్ణా జలాల సద్వినియోగానికి చేపట్టిన పలు ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర, తెలంగాణల మధ్య ఒప్పందం కుదిరింది.
 
అదే దూకుడు 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ ప్రాజెక్టుల పనులు వేగంగా కొనసాగు తున్నాయి. గతేడాది ఆగస్టు తొమ్మిదిన గజ్వేల్‌లో ప్రధానమంత్రి చేతుల మీదుగా మిషన్‌ భగీరథను లాంఛనంగా ప్రారంభించి.. తొమ్మిది నియోజక వర్గాలకు నీరందిస్తున్నారు. మిషన్‌ కాకతీయలో భాగంగా ఇప్పటివరకు ఇరవై వేలకుపైగా చెరువుల పునరుద్ధరణను పూర్తిచేశారు. ఇక క్షేత్రస్థాయికి సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు ఇచ్చిన కొత్త జిల్లాల ఏర్పాటు హామీని కేసీఆర్‌ నెరవేర్చుకున్నారు. గతేడాది దసరా రోజునే కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేశారు. దీంతో 31 జిల్లాలతో తెలంగాణ కొత్తరూపు దిద్దుకుంది.
 
పట్టుబట్టి కొత్త చట్టాలు
గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక చట్టాలను ప్రవేశపెట్టింది. కేంద్రం అమల్లోకి తెచ్చిన భూసేకరణ చట్టం–2013తో ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతుందంటూ.. తెలంగాణ భూసేకరణచట్టం–2016ను అమల్లోకి తెచ్చింది. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం కూడా సరిగా లేదంటూ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని రూపొందించింది. పూర్తి శిథిలావస్థలో ఉన్న వారసత్వ కట్టడాలను తొలగించడానికి వీలుగా హెరిటేజ్‌ చట్టాన్ని చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ముస్లింలకు పన్నెండు శాతానికి, గిరిజనులకు పదిశాతానికి రిజర్వేషన్లు పెంచే బిల్లును శాసనసభలో ఆమోదింపజేసింది. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పదో పీఆర్సీ బకాయిలను వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయించింది. ఇక సింగరేణి ఉద్యోగులకు సంస్థ లాభాల్లో ఇరవై మూడు శాతం వాటా చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.
 
‘ప్రగతి’ కోసం..
ముఖ్యమంత్రి కొత్త అధికారిక నివాసం ప్రగతిభవన్‌ను రికార్డు సమయంలో నిర్మించారు. అందులోభాగంగానే ఏర్పాటు చేసిన జనహిత సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. అందులో గత ఏడాదిగా వివిధ వర్గాలకు చెందినవారు, అధికారులు, నేతలతో సీఎం సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణం దిశగా ప్రభుత్వం ప్రణాళికను వేగవంతం చేసింది. బైసన్‌ పోలో, జింఖానా గ్రౌండ్‌ను అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా.. సానుకూల స్పందన కూడా వ్యక్తమైంది.
 
మరిన్ని సంక్షేమ పథకాలు
రాష్ట్రంలో ఈ ఏడాది మరిన్ని కొత్త సంక్షేమపథకాలకు టీఆర్‌ఎస్‌ సర్కారు శ్రీకారం చుట్టింది. రైతులకు వచ్చే ఖరీఫ్‌ నుంచి ఏటా రెండు సార్లు ఎకరాకు నాలుగు వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందించే పథకాన్ని కేసీఆర్‌ ప్రకటించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమాఖ్యలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కానుకగా కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. దీని కింద పేద గర్భిణులకు రూ.12 వేల ఆర్థిక సాయం, శిశువులు, బాలింతలకు ఉపయోగపడే వస్తువులతో కూడిన కిట్‌ను అందిస్తున్నారు. ఇక నాలుగు లక్షల మంది గొల్ల, కుర్మలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలను అందించే భారీ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యంత వెనుకబడిన కులాలను ఆదుకోవడం కోసం ప్రణాళిక సిద్ధమవుతోంది.
 
కేంద్రంతో దోస్తీ
గత ఏడాది కాలంలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సత్సంబంధాలు కొనసాగించింది. నోట్ల రద్దు నిర్ణయానికి అన్ని రాష్ట్రాల కంటే ముందుగా మద్దతు ప్రకటించింది. జీఎస్టీ బిల్లును త్వరగా ఆమోదించింది. మరోవైపు రాష్ట్ర భూసేకరణ చట్టానికి పలు సవరణలతో కేంద్రం ఆమోదం తెలిపి సహకరించింది. అయితే ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర పర్యటనలో చేసిన కామెంట్లు, కేసీఆర్‌ కౌంటర్‌ ఇచ్చిన తీరు హాట్‌టాపిక్‌గా మారింది.
 
నత్తనడకన పథకాలు
ప్రభుత్వ హామీల్లో కీలకమైన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం మొదలైనా.. నత్తనడకన సాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి రెండు లక్షల ఇళ్లు నిర్మించకపోతే ఓట్లు అడగబోమని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలోనే సవాల్‌ చేయడం సంచలనం సృష్టించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఇళ్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తంగా రెండు లక్షల అరవై వేల డబుల్‌ ఇళ్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ పరిస్థితీ అంతే. మూడేళ్లలో ఇప్పటివరకు పదివేల ఎకరాల భూపంపిణీ మాత్రమే జరిగింది. గ్రామాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు భూములు అమ్మడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో పథకం అమల్లో జాప్యమవుతోంది. ఇక కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సింగరేణి వారసత్వ ఉద్యోగాలు వంటివి కోర్టు తీర్పుల కారణంగా నిలిచిపోయాయి. 
 
మొక్కులు తీరాయి
గత ఏడాది కాలంలో ప్రభుత్వం తెలంగాణ మొక్కులన్నీ తీర్చింది. ముఖ్యమంత్రి తిరుమలకు వెళ్లి శ్రీవారికి, అమ్మవారికి బంగారు ఆభరణాల మొక్కులు సమర్పించారు. వరంగల్‌ భద్రకాళి అమ్మవారికి నగలు, కురవి వీరభద్ర స్వామికి కోరమీసాలు సమర్పించారు. ఇక యాదాద్రి క్షేత్రం అభివృద్ధి పనులు వేగిరమయ్యాయి. వచ్చే దసరా కల్లా పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. వేములవాడ ఆలయ పునర్నిర్మాణం కోసం డిజైన్లు సిద్ధం చేశారు.
 
అనాలోచిత చర్యలతో మచ్చలు
గత ఏడాదిలో కొన్ని అంశాలు ప్రభుత్వానికి మచ్చ తెచ్చిపెట్టాయి. సీఎస్‌ ప్రదీప్‌చంద్ర పదవీకాలం, ధర్నా చౌక్‌ తరలింపు అంశం, ఖమ్మంలో మిర్చి రైతులకు పోలీసులు బేడీలు వేయటం, ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం కేసీఆర్‌ మాట్లాడకపోవటం, బోధన్‌ వాణిజ్య పన్నుల కుంభకోణం, మియాపూర్‌ భూకుంభకోణం వంటివి పంటి కింద రాయిలా మారాయి. గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎన్నో సందేహాలకు తెరలేపింది. పలువురు పోలీసు అధికారులపై వేటు వేసిన ప్రభుత్వం నయీమ్‌తో అంటకాగిన రాజకీయ నేతలను వదిలివేయడం విమర్శలకు తావిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement