సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గాన్ని ఫిబ్రవరి రెండో వారంలో విస్తరించనున్నారు. అత్యున్నత అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 10వ తేదీ వసంత పంచమి పర్వదినాన మంత్రివర్గ విస్తరణ జరగనుంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండటం, మంచి ముహూర్తాలు లేకపోవడంతో మంత్రివర్గ విస్తరణను ఫిబ్రవరిలో పెట్టుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అయితే తొలి విడతలో ఎనిమిది మందికే చోటు ఉంటుందని, లోక్‌సభ ఎన్నికల తరువాత జరిగే విస్తరణలో మరో ఎనిమిది మందికి అవకాశం కల్పించి పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. మంత్రివర్గాన్ని ఎప్పుడు విస్తరిస్తారు, ఎవరెవరికి స్థానం లభిస్తుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. విస్తరణలో మంత్రి పదవులు పొందే ఆ ఎనిమిది మంది ఎవరన్నదానిపై అధికార పార్టీలో ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు.
ఈసారి విస్తరణలో కొత్త వారికి అవకాశం ఇవ్వకపోవచ్చని, అందరూ పాతవారే ఉంటారని కొందరంటుంటే కనీసం ఇద్దరు కొత్త వారు ఉండే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం రాని వారికి ఇతరత్రా కీలక పదవులు కూడా అప్పుడే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఎవరెవరు మంత్రివర్గంలో ఉండాలి, అవకాశం లేని వారిని ఏ పదవుల్లో నియమించాలన్న విషయంలో సీఎం ఇప్పటికే పలుమార్లు కరసత్తు చేసినట్లు సమాచారం. కేబినెట్ హోదా ఉండే పదవుల్లో డిప్యూటీ స్పీకర్‌తోపాటు శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్, మండలిలో చీఫ్ విప్, శాసనసభలో, మండలిలో ఇద్దరు లేదా ముగ్గురేసి చొప్పున విప్‌ల పదవులు ఉండనున్నాయి. ఇవి కాకుండా పార్లమెంటరీ కార్యదర్శుల పేరుతో మరికొందరికి కూడా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
ఆ ఎనిమిది మంది ఎవరు?
తొలి దశ మంత్రివర్గ విస్తరణలో పాత మంత్రులకే అవకాశం లభించవచ్చు. టీఆర్‌ఎస్‌లో, ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నేతలకు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి అభీష్టం మేరకు మంత్రి మండలి ఉంటుందని, ఈ విషయంలో ఆయన తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని ఓ సీనియర్ నేత అన్నారు. ‘ముఖ్యమంత్రి ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలన్నీ పరిశీలిస్తే పాత వారికి దాదాపుగా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందనే అనుకుంటున్నా. శాసనసభ ఎన్నికల్లో అనేక మంది సిట్టింగ్‌లు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని తెలిసినా ఆయన నలుగురు మినహా పాత వారందరికీ టికెట్లు ఇచ్చారు. మహమూద్ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలకు కీలక పదవులిచ్చారు. ఇవన్నీ గమనిస్తే ముఖ్యమంత్రి అందరికీ ఏదో విధంగా న్యాయం చేస్తారనిపిస్తోంది’అని ఆ సీనియర్ నేత విశ్లేషించారు. మంత్రివర్గంలో ఎవరు ఉంటారన్న విషయంలో ముఖ్యమంత్రి తన మనోగతాన్ని ఇప్పటిదాకా ఎవరితోనూ పంచుకోలేదని పార్టీ ముఖ్య నాయకులు అంటున్నారు. అయితే సమయం చిక్కినప్పుడల్లా ఆయన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల జాబితా ముందు పెట్టుకొని ఎవరికి ఏ అవకాశం ఇవ్వాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నారని ఓ మాజీ మంత్రి అన్నారు.
తొలి దశ విస్తరణ రేసులో ఉన్నది వీరే...
తొలి మంత్రివర్గ విస్తరణలో స్థానం పొందే వారిలో ఈటల రాజేందర్ (కరీంనగర్), కడియం శ్రీహరి (జనగామ), జి. జగదీశ్‌రెడ్డి (సూర్యాపేట), సి. లక్ష్మారెడ్డి (మహబూబ్‌నగర్), కేటీ రామారావు (సిరిసిల్ల), టి. హరీశ్‌రావు (సిద్దిపేట), తలసాని శ్రీనివాస్ యాదవ్ (గ్రేటర్ హైదరాబాద్), జోగు రామన్న (ఆదిలాబాద్) ఉండొచ్చని ఒక అంచనా. తొలి దశలోనే ఎస్టీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం భావిస్తే డీఎస్ రెడ్యానాయక్ (మహబూబాబాద్ జిల్లా)కు అవకాశం రావచ్చని అంటున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్‌గా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ పేరు వినిపిస్తోంది. స్పీకర్ పదవిని ఇప్పటికే రెడ్డి సామాజికవర్గానికి కేటాయించడంతో ఈసారి పద్మాదేవేందర్‌రెడ్డికి ఆ అవకాశం లేకపోవచ్చు.
ఆమెకు మలి దశ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి లేదా మరో కేబినెట్ హోదా పదవి లభించొచ్చు. అయితే మలి విడత మంత్రివర్గ విస్తరణలో పదవులు ఆశించే వారి సంఖ్య రెండు డజన్ల దాకా ఉంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువ మంది శాసనసభకు ఎన్నిక కావడంతో పోటీ కూడా తీవ్రంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల తరువాత విస్తరించనున్న మంత్రివర్గంలో ముగ్గురు రెడ్లకు అవకాశం లభించవచ్చు. ఈ కోటాలో మంత్రి పదవి కోసం నాయిని నర్సింహారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. వారిలో ఒకరిద్దరికి చీఫ్ విప్, విప్ పదవులు కట్టబెట్టే అవకాశం లేకపోలేదు.
ప్రస్తుతానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్...
కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాతే రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల మంత్రివర్గ విస్తరణ తరువాత మార్చి రెండో వారంలో తాత్కాలిక బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తికాగానే మలి విడత మంత్రివర్గ విస్తరణ చేపట్టి జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్‌కు సిద్ధం కావాలని ఆయన యోచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment