కేసీఆర్ గద్దె దిగడం ఖాయం
♦ సామాజిక న్యాయం సాధించే వరకు ఉద్యమిస్తాం: తమ్మినేని
♦ తెలంగాణలో శ్రమదోపిడీ ఇంకా కొనసాగుతోంది
♦ ఇక లెఫ్ట్ పార్టీలన్నీ ఐక్యంగా పోరాడతాయి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలో గద్దె దిగడం ఖాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించే వరకు ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. ఆదివారమిక్కడ మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘రాజకీయ సంకల్ప బలం, ప్రజల మద్దతుతోనే 4,200 కి.మీ. పాదయాత్ర నిర్వహించా. తెలంగాణ ఏర్పడితే సకల సమస్యలు మాయమవుతాయని భావించా.
కానీ పేదరికం, నిరుద్యోగం, ఆత్మహత్యలు, శ్రమదోపిడీ.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం దుస్థితిని ప్రభుత్వం మార్చలేకపోతోంది. రాష్ట్రంలో పరిశ్రమలు మూత పడుతున్నా చలించడం లేదు. ఇకపై ఆందోళనలు తీవ్రతరం చేయాలని నిర్ణయించాం. వామపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ఉద్యమిస్తాయి. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రైవేటు విద్యా సంస్థలతో సహా అన్ని విద్యాలయాల ముందు ఆందోళనలు చేపడతాం. పోడు భూముల జోలికెళ్తే.. గిరిజనులు, పోలీసులు ప్రత్యక్షంగా తలపడాల్సి వస్తుంది. రాష్ట్రంలో భూములు లాక్కునే సర్కారు కొనసాగుతోంది.
సంపదలో, భూమిలో, రాజకీయాల్లో, పదవుల్లో సమ వాటా అందించడమే సామా జిక న్యాయం. విధానాలు మార్చుకోకపోతే కేసీఆర్‌ను మార్చే పరిస్థితి వస్తుంది’’ అని హెచ్చరించారు. కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే.. ఇచ్చిన హామీలన్నిటికీ చట్టరూపం కల్పించాలన్నారు. కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలంటూ సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు.
ఐక్యంగా ఉద్యమిద్దాం: చాడ
టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించిన నాయకులను అందల మెక్కిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. కోదండరాం వంటి నాయకుడిని నిర్భందించి అరెస్టులకు తెగబడుతోందన్నారు. ఇన్నాళ్లు విడిపోవడంతో కామ్రేడ్లు బలహీనమయ్యారని, ఇకపై ఐక్య ఉద్యమాలను నిర్వహిస్తామని తెలిపారు.
దొరలకే ప్రతినిధి..
కేసీఆర్ వెలమ దొరలకు మాత్రమే ప్రతినిధి అని, ఈ సభతో భూస్వాముల బూతు భాషను దిక్కరించే చైతన్యం వచ్చిందని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. పీఎం, సీఎంలను ఎన్నుకునే శక్తి మనకున్నా... విధానం సరిగ్గా లేదని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య అన్నారు. సరైన వ్యక్తులను ఎన్నుకుంటే ఈ పరిస్థితి వచ్చేదికాదన్నారు. ‘సమర సమ్మేళనం’ మహత్తర రాజకీయ చర్చకు దారి తీసేలా ఉందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని జస్టిస్ చంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాధనంతో నిర్మించిన ప్రగతి భవన్‌ను సీఎం పైరవీల భవన్‌గా మార్చారని మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షుడు అద్దంకి దయాకర్ విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సీమాంధ్ర పాలన కంటే ఘోరంగా ఉందని, గొంతెత్తిన వారిని అణచి వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్క్స్, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఒక వారధి నిర్మించాలని, అందుకు మొదటి ఇటుక తానే వేస్తున్నట్లు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు చెప్పారు. నీల్, లాల్ జెండాలు కలిస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుం దని అన్నారు.
భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున వామపక్ష కార్యకర్తలు, నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు. సుందరయ్య పార్కు ప్రాంగణమంతా ఎర్ర జెండాలతో ఎరుపెక్కింది. కొమ్ము వాయిద్యాలు, డోలకులు, డప్పులు, కోయ, గోండు, ప్రజా నాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కటాఫ్ కవరేజీ ఏరియాలోకి ప్రభుత్వం: కోదండరాం
ప్రభుత్వం ప్రజల పరిధి నుంచి ఔటాఫ్ కవరేజీ ఏరియాలోకి వెళ్లిపోయిందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ మాయగా ఉందని, గతంలో కేటాయించిన వాటిలో సగం నిధులు కూడా ఖర్చు చేయలేదన్నారు.