‘భక్త రామదాసు’ నేడు జాతికి అంకితం
ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే భక్తరామదాసు ప్రాజెక్టును సీఎం కె. చంద్రశేఖర రావు మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు రికార్డు సమయంలో 11నెలల్లోనే పూర్తయింది. ట్రయల్‌రన్ కూడా విజయవంతమైంది. సీఎం శంకుస్థాపన చేసి.. ప్రారంభోత్సవం చేస్తున్న తొలి సాగునీటి ప్రాజెక్టు ఇదే. పాలేరు నియోజక వర్గంలోని భూములకు సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో రూ.335.59 కోట్ల అంచనాతో భక్త రామదాసు ప్రాజెక్టును రూపొందించారు. 2015 డిసెంబర్ 15న రూ.90.87 కోట్లకు పరిపాలన అనుమతులు లభించాయి.
2016 ఫిబ్రవరిలో ఈ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అసలైతే ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావడానికి రెండు సంవత్సరాల సమయం పడుతుంది. అయితే సీఎం కేసీఆర్‌తోపాటు రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రోడ్లు, భవనాలు శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావులు ప్రాజెక్టు పనుల పురోగతిపై పలుసార్లు సమీక్షలు నిర్వహించి.. అధికారులకు సూచనలు చేశారు. దీంతో పనుల్లో వేగం పుంజుకుని.. రికార్డు సమయంలో పూర్తయింది. ప్రాజెక్టు మొత్తం పూర్తికావడంతో మంగళవారం సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటితోపాటు సీతారామ ప్రాజెక్టు పూర్తయితే.. ఆ నీటిని కూడా బయ్యారం ద్వారా ఈ ప్రాజెక్టులోకి తీసుకురానున్నారు.
సీఎం రాక కోసం భారీ ఏర్పాటు
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం శంకుస్థాపన చేసి.. ప్రారంభోత్సవం చేస్తున్న తొలి ప్రాజెక్టు ఇదే కావడంతో అధికార యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.