ఇక ‘హరిత’ రహదారులు
* అన్ని ప్రధాన రోడ్లకూ ఇరువైపులా లక్షల సంఖ్యలో మొక్కలు
* వాటి సంరక్షణ బాధ్యత అన్ని ప్రధాన విభాగాలకు కేటాయింపు
* ప్రతి రెండు, మూడు నెలలకోమారు సంరక్షణపై సమీక్షలు
* ప్రణాళిక సిద్ధం చేసిన రోడ్లు భవనాల శాఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులు పచ్చదనంతో కళకళలాడనున్నాయి. ఇందుకోసం రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఇతర విభాగాలతో కలసి రోడ్లకు ఇరువైపులా లక్షల సంఖ్యలో మొక్కలను పెంచాలని నిర్ణయించింది. తొందరగా పెరగాలన్న ఉద్దేశంతో ఏదో ఒక మొక్క నాటే పద్ధతి కాకుండా నీడనిచ్చే, ఫలాలు అందించే, సీజన్ ప్రకారం రకరకాల పూలతో అందంగా కనిపించే వాటిని మాత్రమే నాటాలని నిర్ణయించింది.
భవిష్యత్తులో మళ్లీ రోడ్లను విస్తరిస్తే చెట్లు కోల్పోయే పరిస్థితి దాపురించకుండా రోడ్లకు కాస్త దూరంగా మొక్కలు నాటనున్నారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలో తెలంగాణ సరిహద్దు ముగిసే 160 కిలోమీటర్ల నిడివిలో ఏకంగా లక్షన్నర మొక్కలు నాటబోతున్నారు. ఇక హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిలో విస్తరణ కోసం వేల సంఖ్యలో భారీ వృక్షాలను తొలగించినందున దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ మార్గంలో మొక్కలు నాటి పెంచేందుకు అవసరమైన స్థలం అందుబాటులో లేకపోవటంతో రైతులు, ప్రైవేటు స్థల యజమానులతో చర్చించి వారి స్థలాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు.
సంరక్షణ బాధ్యతల అప్పగింత..
ఐదు కిలోమీటర్ల చొప్పున నిడివిని విభజించి ఒక్కో భాగాన్ని ఒక్కో విభాగానికి అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. ఆ నిడివిలో మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించే బాధ్యత కూడా ఆ విభాగానిదే. ప్రతి రెండు మూడు నెలలకోమారు ఆ మొక్కల సంరక్షణపై సమీక్ష నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలు అప్పగించాలి. ఒక్కో మొక్కకు రూ.5 చొప్పున నిధులను ఆ విభాగానికి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ సంవత్సరానికిగానూ ఇందుకు రూ.46 కోట్లను కేటాయించింది. ఇక రోడ్లను ఆనుకుని ఉండే పొలాల గట్ల వెంట కూడా మొక్కలు నాటి సంరక్షించేలా రైతుల్లో అవగాహన తేనున్నారు. వారికి ఉచితంగా మొక్కలు అందజేసి వాటిని సంరక్షించేలా రైతులను ప్రోత్సహించాలని రోడ్లు భవనాల శాఖ నిర్ణయించింది. ఇక్కడ రైతులు కోరే మొక్కలనే అందిస్తారు.
అడవుల పెంపకానికి ప్రాధాన్యం: మంత్రి తుమ్మల
‘‘భవిష్యత్తుపై ముందుచూపు కొరవడి గతంలో అత్యంత విలువైన వృక్ష సంపదను కోల్పోయాం. ఈ తప్పు తెలంగాణలో ఇక జరగొద్దు. అభివృద్ధి పేరుతో కోల్పోతున్న వృక్షాలను మళ్లీ పొందాల్సి ఉంది. గత 15 ఏళ్లలో అత్యంత వేగంగా అడవులు కోల్పోయిన జిల్లాగా ఖమ్మం నిలిచింది. అందుకే రోడ్లకిరువైపులా మొక్కలు నాటి పెంచాలని నిర్ణయించాం. 26 వేల కి.మీ. మేర మొక్కలు నాటబోతున్నాం. ఇందులో అన్ని ప్రభుత్వ విభాగాలతోపాటు రైతులనూ భాగస్వాములను చేస్తాం. నాటిన ప్రతి మొక్కా వృక్షం కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతాం’’