నియోజకవర్గ కేంద్రాల్లో మహిళా దినోత్సవం
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశించారు. ఈ కార్యక్రమాలకు ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులను ఆహ్వానించాలని కోరారు. మహిళా దినోత్సవం సందర్భంగా 8న (బుధవారం) లలితకళాతోరణంలో ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమాల ఏర్పాట్లను మంగళవారం ఆయన సచివాలయంలో శాఖ కార్యదర్శి జగదీశ్వర్, డైరెక్టర్ విజయేందిర బోయి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణలతో కలసి సమీక్షించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మంత్రి తమ శుభాకాంక్షలు తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లు విధిగా మహిళా దినోత్సవం సందర్భంగా వారి పరిధిలోని మహిళలను చైతన్యపరచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఆరోగ్యలక్ష్మి, ఆసరా, భరోసా, సఖి సెంటర్ల వంటి పథకాలే కాకుండా ఒంటరి మహిళలకు పింఛన్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లను మహిళలకే కేటాయించేలా చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు.