
అమరావతి, సాక్షి: బడి పిల్లలను, వాళ్ల తల్లులను భరోసా పేరిట వంచించాలనుకుంటున్న కూటమి ప్రభుత్వ ప్రయత్నం.. శాసన మండలి సాక్షిగా బయటపడింది. వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్నతో తల్లికి వందనం(Thalliki Vandanam)పై మంత్రి నారా లోకేష్ తప్పుడు లెక్కలు విడుదల చేసి అడ్డంగా దొరికిపోయారు.
అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా.. తల్లికి వందనంపై కూటమి ప్రభుత్వం అడుగు ముందుకు పడడం లేదు. పైగా కిందటి ఏడాది బడ్జెట్‌లో నిధులు కేటాయించినా.. అమలు మాత్రం చేయలేదు. విచిత్రంగా.. ఈ ఏడాది మే నెల నుంచి స్కీమ్ అమలు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ఇవాళ.. ‘‘ఈ ఏడాది తల్లికి వందనం ఎంతమందికి ఇస్తారు?’’ అని విపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. అయితే..
తల్లికి వందనం పథకం లబ్ధిదారుల సంఖ్య చెప్పని మంత్రి నారా లోకేష్.. నిధుల లెక్కలు చూపించాలంటూ అధికారులను పురమాయించారు. ప్రజలను, సభను మభ్యపెట్టేలా విద్యాశాఖ లిఖితపూర్వక సమాధానం ఇప్పించారు. అందులో రూ.9,400 కోట్లు కేటాయించామంటూ బడ్జెట్ లెక్కలు చెప్పారు. కానీ, ఇది వచ్చే ఏడాది పథకం తాలుకా నిధుల లెక్కకు సంబంధించింది.
ఏపీలో పేద విద్యార్థులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఆర్థిక సాయం అందించింది. అయితే.. అదే పథకాన్ని తల్లికి వందనం పేరుతో మార్చేసిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తామని ప్రకటించారు. కూటమి నేతలైన పవన్, నారా లోకేష్ కూడా ఈ విషయాన్నేన్నికల ప్రచారంలో నొక్కి మరీ చెప్పారు. పైగా ఇంట్లో ఎంత మంది ఉంటే(విద్యార్థులు) .. అంత మందికీ వర్తింజేస్తామని ప్రకటించారు. దీనిపై ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడుకు సంబంధించిన వీడియో ఒకటి ఎంతగా వైరల్ అయ్యిందో తెలియంది కాదు.
తీరా అధికారంలోకి వచ్చాక.. మార్గదర్శకాల పేరుతో హడావిడి చేశారే తప్ప పైసా విదిల్చింది లేదు. ఈ నేపథ్యంలో తాజా ప్రకటనతో.. 2024-25 విద్యా సంవత్సరానికి తల్లికి వందనానికి ఎగనామం పెడుతూ .. 80 లక్షల పిల్లలు, వారి తల్లులను చంద్రబాబు సర్కార్ ప్రభుత్వం మోసం చేసినట్లయ్యింది.

Comments
Please login to add a commentAdd a comment