
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. గురువారం బడ్జెట్ సమావేశాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళా దినోత్సవాన్ని మర్చిపోయారు. ప్రత్యేకంగా మహిళా దినోత్సవంపై మాట్లాడాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ కోరగా తన సీట్లో లేచిన ఆయన ఆ విషయం కాకుండా ఇతర విషయాలు మాట్లాడారు.
విభజన అంశం నుంచి హోదా వరకు పలు కోణాల్లో మాట్లాడి ఇక సెలవు అంటూ కూర్చున్నారు. అయితే, పక్కనున్నవారు మహిళా దినోత్సవాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయగా ఏమిటీ అంటూ అడిగే ప్రయత్నం చేశారు. ఈలోగా స్పీకర్ మరోసారి ఉమెన్స్ డే అంటూ గుర్తు చేశారు. దాంతో వెంటనే లేచిన చంద్రబాబు.. ప్రపంచం మొత్తం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మహిళలకు తన అభినందనలు, శుభాకాంక్షలు అన్నారు. ఈరోజు అన్నిరంగాల్లో మహిళలు రాణిస్తున్నారని అన్నారు. అంతకు ముందు తమ మంత్రి పదవులకు రాజీనామాలు బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు మాట్లాడారు.