ఏపీ అసెంబ్లీలో రక్తికట్టిన మిత్రపక్షాల చర్చ | Chandrababu Not Ready To come Out Of Alliance | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీలో రక్తికట్టిన మిత్రపక్షాల చర్చ

Published Wed, Mar 7 2018 7:25 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Chandrababu Not Ready To come Out Of Alliance - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో అనేక విశేషాలు, వింత పరిణామాలు చోటుచేసుకున్నాయి. కట్టే విరుగదు..! పాము చావదు..!! అన్న చందంగా అధికార టీడీపీ సమావేశాలను రక్తికట్టించింది. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం జరిగిన చర్చ, ముఖ్యమంత్రి సమాధానం ఆసాంతం అధికారంలో ఉన్న టీడీపీ - బీజేపీ నేతలు పరస్పరం నేను గిల్లినట్టు చేస్తా...! నువ్ ఏడ్చినట్టు చేయి...!! అన్నట్టు సాగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ ఎంపీలు ఒకవైపు మంత్రులుగా కొనసాగుతూనే మరోవైపు ప్రత్యేక హోదా కోసమంటూ ఢిల్లీలో పార్లమెంట్‌ బయట ప్లకార్డు ఆందోళన చేస్తున్న తరహాలోనే.. ఏపీ అసెంబ్లీలోనూ అలాంటి దృశ్యాలే ఆవిష్కరించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ కోసం ఆందోళన చేస్తుండటంతో పాటు పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేసేవరకు అసెంబ్లీకి హాజరుకాబోమని ఏకైక ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సభలో ఏకైక ప్రతిపక్షం లేకుండానే శాసనసభ సమావేశాలు సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ ప్రసంగం చేశారు. గడిచిన నాలుగేళ్లుగా చెబుతున్న విషయాలకు పూర్తి భిన్నంగా చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ ప్రయోజనాలు కలిగే ప్యాకేజీ వస్తున్నప్పుడు హోదా ఎందుకని అనేక సందర్భాల్లో మాట్లాడిన చంద్రబాబు ఈరోజు సభలో అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడటం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీలపై 52 పేజీలతో 19 అంశాలపై రూపొందించిన వివరాలను ఆయన తన సుదీర్ఘ ప్రసంగంలో ప్రస్తావించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రంలోని మిత్రపక్ష బీజేపీ ప్రభుత్వాన్ని సుతిమెత్తగా కోరారు. సభలో ప్రతిపక్షం లేకపోవడంతో ఈ అంశాలపై వివరిస్తున్న సందర్భంలో ప్రతిసారీ ఆయన బీజేపీ సభ్యుల వైపు చూస్తూ మాట్లాడారు.
గడిచిన నాలుగేళ్లలో 29 సార్లు ఢిల్లీ వెళ్లినట్టుగా చంద్రబాబు చెప్పుకున్నారు. అయితే వెళ్లిన ప్రతిసారీ ప్రత్యేక హోదా కోసమే వెళ్లినట్టుగా చెప్పుకోవడం గమనార్హం. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టును ప్రకటించిన తర్వాత దాన్ని నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికే అప్పగించాలని అప్పట్లో పట్టుబట్టిన చంద్రబాబు అసెంబ్లీలో మాత్రం అందుకు భిన్నంగా నీతి ఆయోగ్ సూచనల మేరకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్రం తీసుకుందని చెప్పుడం విశేషం.

2014 ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ స్వీకార ప్రమాణం చేయడానికి ముందు జరిగినట్టుగా ఒక కొత్త విషయాన్ని అసెంబ్లీ వేదికగా చంద్రబాబు వెల్లడించారు. పోలవరం నిర్మాణం కోసం తెలంగాణ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలపకపోతే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు భీష్మించినట్టు చంద్రబాబు సభలో చెప్పుకున్నారు. నాలుగేళ్ల కిందట సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడుగానీ ఆ తర్వాత గానీ ఈ విషయం ఇప్పటివరకు ఎందుకు వెళ్లడించలేకపోయారే చంద్రబాబు వివరించలేదు. తాను అలా హెచ్చరిక చేసినందుకే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినేట్ సమావేశంలోనే ప్రధాని మోదీ ఆ మండలాలను కలిపారని చెప్పారు.

నాలుగేళ్లు గడిచినా అడుగు ముందుకు పడని పోలవరం గురించి అంత గట్టిగా హెచ్చరిక జారీ చేసిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఏడు మండలాల కోసం ఆనాడు ఏకంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోనని తేల్చిచెప్పిన చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంగానీ పార్లమెంట్ ద్వారా చేసిన విభజన చట్టంలో ఇచ్చిన హామీల విషయంలో మాత్రం అలాంటి గట్టి హెచ్చరిక ఎందుకు ఇవ్వలేకపోయారో శాసనసభలో చెప్పలేకపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు డిమాండ్ చేసింది. తాము తప్పుకుంటే వాళ్లు దగ్గరవ్వాలని చూస్తున్నారంటూ ప్రతివిమర్శ చేశారే తప్ప ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాలుగేళ్లుగా ఒక్క గట్టి నిర్ణయం తీసుకోలేకపోయారన్నది వాస్తవం. ఏడు మండలాల కోసం ప్రమాణ స్వీకారం చేయనని హెచ్చరించిన చంద్రబాబు రాష్ట్రానికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా కోసం మిత్రపక్షంగా ఉండటం పక్కన పెడితే కేంద్రంలో కనీసం మంత్రిపదవులను వదులుకోవడానికి కూడా సిద్ధపడకపోవడం గమనార్హం. అలాగే, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి చెందిన మంత్రులను నాలుగేళ్లుగా కొనసాగుతుండగా, 29 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఏరోజూ ఆ మంత్రులను వెంటబెట్టుకుని వెళ్లలేదు. కానీ బుధవారం అసెంబ్లీ చర్చ సందర్భంగా మాత్రం బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి అక్కడ కూర్చొని ప్రత్యేక హోదా సాధన కోసం పనిచేయాలని సూచించడం విశేషం.

దాదాపు రెండున్నర గంటలకుపైగా ప్రసంగించిన చంద్రబాబు అనేక పరస్పర విభిన్నమైన రీతిలో మాట్లాడారు. కేంద్రం నుంచి రావలసిన నిధులకు సంబంధించి యుటిలిటీ సర్టిఫికేట్లు (యూసీ) ఇవ్వని కారణంగా నిధులు విడుదల కాలేదని కేంద్రం చెబుతోందని అంటూ ఆ సర్టిఫికేట్లు ఎప్పుడు పంపిందీ చెప్పే ప్రయత్నం చేశారు. తన చేతిలో ఉన్న పత్రాలను చూస్తూ గత నెల ఫిబ్రవరిలో యూసీ సర్టిఫికేట్ పంపినట్టు చదివిన చంద్రబాబు (నెల రోజులు కూడా కాకపోవడం) ఆ తర్వాత ఎందుకనో మిగతా వివరాలు చెప్పకుండా దాటవేశారు. గడిచిన నాలుగేళ్లుగా అనేకసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై ఎప్పుడూ ప్రస్తావించని చంద్రబాబు బుధవారంనాడు మాత్రం ఏకంగా ఒక పుస్తకాన్ని తెచ్చి చదవడం గమనార్హం. హైదరాబాద్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లను అభివృద్ధి చేసింది తానేనని చెబుతూ వాటి నిర్మాణాలకు కేంద్రం నుంచి డబ్బులు తీసుకోలేదని చెప్పుకొచ్చారు. (ఈ రెండూ చంద్రబాబు హయాంలో వచ్చినవి కాదు) నిధులు విడుదల చేయలేదంటూ కేంద్రంపై ఒకవైపు సుతిమెత్త విమర్శ చేస్తూనే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఓఆర్ఆర్ లాంటి వాటికి నిధులు అడక్కుండానే పూర్తి చేశానని చెప్పడం విడ్డూరంగా కనిపించింది.

రాహుల్ గాంధీ సంతకం చేస్తారట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా కల్పనపై గడిచిన నాలుగేళ్ల పాటు ఎందుకు సైలెంట్ గా ఉన్నారన్న విషయం కూడా వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. సభలో బీజేపీ సభ్యులవైపు చూస్తూ "మీరు తప్పుంచుకోలేరు. మిమ్మల్ని ప్రజలు క్షమించరు" అని బీజేపీపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. "ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు... అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తాం" అని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే ఫైలుపైన చేస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అంటున్నారని చెబుతూ, ఆ విషయాన్ని బీజేపీ ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ఆ పార్టీ నేతలకు చంద్రబాబు కర్తవ్యబోధ చేశారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని విద్యా సంస్థలు వాటి కేటాయింపులను చంద్రబాబు ప్రస్తావించారు. తిరుపతిలో తలపెట్టిన ఐఐటీ కోసం ఇప్పటివరకు వంద కోట్లిచ్చారు. మూడువేలకుపైగా కోట్లు అవసరమైన ఐఐటీకి వంద కోట్లు ఇస్తే ఇక అది పూర్తికావడానికి 30 ఏళ్లు పడుతుందని చెప్పుకొచ్చారు. అయితే గడిచిన నాలుగేళ్లుగా ఈ సంస్థలకు జరుగుతున్న కేటాయింపులపై ఎందుకు మాట్లాడలేకపోయారో మాత్రం సభలో ఉన్న బీజేపీ సభ్యులకు చంద్రబాబు వివరించలేదు. ఆ విషయాలను బీజేపీ నేతలు కూడా చంద్రబాబును అడగలేదు.

రోజూ హాయిగా నిద్రపోతున్నా...!
ప్రత్యేక హోదా ఇవ్వాలని ఈరోజు అన్ని పార్టీలు అడుగుతున్నాయి.  కేంద్రంలోని బీజేపీ ఎందుకు కనికరించడం లేదు అంటూ ప్రశ్నించారు. దేశంలో తానే సీనియర్ మోస్ట్ నాయకుడినని, కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ లు ఏర్పాటు చేశామని పేర్కొంటూనే తాను ఎవరికీ భయపడటం లేదని, భయపడే ప్రసక్తే లేదన్నారు. అందుకే ప్రతి రోజూ హాయిగా నిద్రపోతున్నా... అంటూ చెప్పుకొచ్చారు. (నేను పడుకోను.. మిమ్మల్ని పడుకోనివ్వను అంటూ గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు చెబుతుండేవారు)

నాలుగేళ్ల తర్వాత కూడా
ఏపీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారని, ఆ కారణంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారంటూ ఈ రకమైన వివక్ష ఎందుకు చూపిస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇస్తారని, విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తారని నాలుగేళ్లు ఎదురుచూశానని, ఇప్పుడు మళ్లీ అన్యాయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ఎదురుచూసిన చంద్రబాబు ఉన్నఫళంగా ఎందుకు అసెంబ్లీ ఈ చర్చకు తావిచ్చారో సెలవివ్వకపోవడం అధికార పార్టీ సభ్యులకు సైతం అంతుచిక్కలేదు. ప్రత్యేక హోదా కోసం ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలలు, ప్రభుత్వ అసమర్థతపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం... మాట్లాడకపోతే ఇరకాటంలో పడతామన్న ఆందోళనతోనే ఈ అంశానికి అసెంబ్లీ వేదిక చేసుకున్నట్టు కనబడుతోంది.

220 మందిలో నేనొకడిని
గవర్నర్ ప్రసంగంపై చంద్రబాబు సమాధానం చెప్పడానికి ముందు మాట్లాడిన బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు. చంద్రబాబు సీఎం కావడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అంటూ ఆకాశానికెత్తారు. చంద్రబాబు సమాధానం చెబుతున్నప్పుడు మధ్యలో కల్పించుకుని... తామింకా (బీజేపీ) ప్రెండ్లీ పార్టీయేననీ, అదేదో ప్రతిపక్షమైనట్టు మాట్లాడుతున్నారని (టీడీపీ సభ్యులవైపు చూస్తూ) అది సరైంది కాదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి 14 వ ఆర్థిక సంఘం నిబంధనలు, హోదాకు బదులుగా ప్యాకేజీ ఇస్తామని చెప్పడం వంటి వివరాలు చెబుతూ మీకేం కావాలో... రావలసిన నిధుల గురించి వివరాలిస్తే ఢిల్లీకి వెళ్లి వచ్చేట్టుగా తనవంతు కృషి చేస్తానని విష్ణుకుమార్ రాజు చెప్పారు. దేశంలో 220 మందితో ఏర్పడిన బీజేపీ జాతీయ కార్యవర్గం తాను ఒకడినని చెప్పుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement