టీడీపీ నుంచి భారీగా ఆశావహులు
జనసేనకు 5, బీజేపీకి 2 పదవులు
తమకూ అవకాశం ఇవ్వాలంటున్న కొత్త ఎమ్మెల్యేలు
కత్తిమీద సాములా మంత్రివర్గ కూర్పు
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. టీడీపీ నుంచి 135 మంది ఎమ్మెల్యేలుగా గెలిచినందున ఆశావహుల సంఖ్య భారీగా ఉంది.
అయితే మొత్తం 24 మంత్రి పదవులే ఇచ్చే అవకాశం ఉన్నందున అందులోనే మూడు పార్టీలకు సర్దుబాటు చేయడం కత్తిమీద సాములా మారింది. జనసేనకు కనీసం ఐదు మంత్రి పదవులు దక్కుతాయనే ప్రచారం జరుగుతుండగా బీజేపీకి రెండు పదవులు ఇచ్చే అవశాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రెండు పార్టీలకూ ఇవ్వగా మిగిలిన మంత్రి పదవులను టీడీపీ సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.
అచ్చెన్నా..! రామ్మోహనా!
ఉమ్మడి శ్రీకాకుళం నుంచి టీడీపీ సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర మంత్రివర్గంలో ఆయన సోదరుడి కుమారుడు రామ్మోహన్ నాయుడికి అవకాశం దక్కితే మాత్రం అచ్చెన్నాయుడికి ఛాన్స్ ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ఒక కుటుంబంలో ఒకరికే పదవి ఇచ్చే యోచన ఉంటే వీరిలో ఒకరికే అవకాశం లభించవచ్చు. అదే జిల్లా నుంచి కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా నుంచి గెలిచిన కళా వెంకట్రావు, అదితి గజపతిరాజు పేర్లు సైతం పరిశీలనలో ఉన్నాయి.
విశాఖ జిల్లాలో ఈసారి గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కకపోవచ్చని చెబుతున్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడికి కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని.. మహిళ, ఎస్సీ కోటాలో వంగలపూడి అనితకు అవకాశం లభిస్తుందనే చర్చ నడుస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకునే వీలుందని చెబుతున్నారు. సీనియర్ల అవసరం ఉందని భావిస్తే యనమల రామకృష్ణుడిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఆయన కుమార్తె దివ్య తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా యనమలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు.
నిమ్మలకు పక్కా
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడికి మంత్రివర్గంలో పక్కాగా చోటు దక్కుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. క్లిష్ట సమయంలో పార్టీ కోసం చురుగ్గా పని చేసి చంద్రబాబు, లోకేశ్‌కి దగ్గరవడంతో ఆయనకు అవకాశం కచ్చితంగా లభిస్తుందని చెబుతున్నారు. బీసీ కోటాలో పితాని సత్యనారాయణ పేరు బలంగా వినిపిస్తోంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకి మంత్రి పదవిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఆయన మంత్రిగా పని చేయరని పార్టీలో కొందరు చెబుతుండగా, ఇస్తే తీసుకుంటారని మరి కొందరు వాదిస్తున్నారు.
చింతమనేని ప్రభాకర్ పేరు కూడా రేసులో వినిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర ఖాయంగా మంత్రి అవుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ నేతగా పని చేసిన అనుభవం, ప్రతిపక్షంలోనూ చురుగ్గా వ్యవహరించడంతో ఆయనకు అవకాశం ఖాయమని భావిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, రామాంజనేయులు, నక్కా ఆనంద్‌బాబు పేర్లు సైతం వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి అవకాశం లభించవచ్చని చెబుతున్నారు.
నారాయణకు మళ్లీ ఛాన్స్
ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డి. బాలవీరాంజనేయస్వామిలో ఒకరికి మంత్రి పదవి దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లా నుంచి గెలిచిన వారిలో పి.నారాయణ గ్యారంటీగా మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనతోపాటే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్లు కూడా చంద్రబాబు పరిశీలనలో ఉన్నాయి.
చిత్తూరు జిల్లా నుంచి అమర్‌నాథ్‌రెడ్డి, పులివర్తి నానిలో ఒకరిని మంత్రిగా చేస్తారని చెబుతున్నారు. కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవి, వరదరాజులరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మంత్రి అవుతారని చెబుతున్నారు. అనంతపురం జిల్లా నుంచి గెలిచిన వారిలో పయ్యావుల కేశవ్, పరిటాల సునీతలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు. కాల్వ శ్రీనివాసుల పేరు కూడా పరిశీలనలో ఉంది.
పవన్‌కు పదవిపై అస్పష్టతే..
జనసేన నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్‌కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే విషయంపై స్పష్టత రాలేదు. నాదెండ్ల మనోహర్ మంత్రివర్గంలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కొణతాల రామకృష్ణ, పంతం నానాజీ, కందుల దుర్గేష్, పులపర్తి రామాంజనేయులు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
బీజేపీ కోటాలో సుజనా
బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరికి మంత్రివర్గంలో చోటు పక్కాగా ఉంటుందని చెబుతున్నారు. కామినేని శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తున్నా ఎంత వరకు అవకాశం దక్కుతుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుజనా చౌదరి పోటీలో ఉన్నందున ఆయనకు అవకాశాలు సన్నగిల్లాయి. సత్యకుమార్, విష్ణుకుమార్‌రాజులో ఒకరిని మంత్రి పదవి వరించే అవకాశం ఉందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment