చంద్రబాబు, పవన్, పురందేశ్వరి సైసై.. స్థానిక నేతలు నైనై
సీట్ల కేటాయింపును తప్పు పడుతున్న మూడు పార్టీల శ్రేణులు
చంద్రబాబు, పవన కళ్యాణ్‌లు తమను మోసం చేశారని సీట్లు రాని నేతల ఆవేదన
అన్ని నియోజకవర్గాల్లోనూ మూడు పార్టీలు కలవడం కల్లే
బీజేపీ, జనసేన శ్రేణులు టీడీపీ సభలకు దూరం
జనసేన, బీజేపీ పోటీలో ఉన్న చోట ముఖం చాటేస్తున్న టీడీపీ నేతలు
తెనాలిలో పవన్ కళ్యాణ్ సభకు దూరంగా ఆలపాటి రాజా
బాలకృష్ణ యాత్రలో కనిపించని బీజేపీ, జనసేన నేతలు
ఆ ముగ్గురి ఆరాటమే తప్ప క్షేత్ర స్థాయిలో అమలు కాని పొత్తు
ఇలాగైతే ఓట్ల బదిలీ సాధ్యం కాదంటున్న విశ్లేషకులు
► చంద్రబాబు కాళ్లబేరం.. బీజేపీ నేతలతో తిట్లు తిని పవన్ కళ్యాణ్‌లు కుదుర్చుకున్న పొత్తు కింది స్థాయిలో ఎక్కడా పొసగడం లేదు. వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక కలిసిన మూడు పార్టీలకు జనంలోనే కాదు ఆయా పార్టీల్లోనూ నిరాదరణే ఎదురవుతోంది. ఆ పార్టీల అగ్ర నేతల హడావుడే తప్ప, కింది స్థాయిలో ఎక్కడా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి పని చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
► సీట్లు దక్కని నేతలు తమ నియోజకవర్గాల్లో కూటమి తరఫున పని చేసేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. చంద్రబాబు సభలు పెట్టినా, వారు ఆ ఛాయలక్కూడా వెళ్లడం లేదు. ఆయన విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహించినా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి దూరంగా ఉన్నారు. తెనాలిలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభకు అక్కడి టీడీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజా డుమ్మా కొట్టారు.
►చంద్రబాబు సభల్లో చాలా చోట్ల బీజేపీ,జనసేన నాయకులను వేదికపైకి రానివ్వడం లేదు. ఆ పార్టీల అభ్యర్థులు ఉన్నచోట మొక్కుబడిగా పిలుస్తున్నా మిగిలిన నియోజకవర్గాల్లో వారిని దరిదాపుల్లోకి సైతం రానీయడం లేదు.టీడీపీ అభ్యర్థులున్న చోట్ల బీజేపీ, జనసేన నాయకులను పట్టించుకోవడంలేదు.
►అనంతపురం జిల్లాలో బాలకృష్ణ చేపట్టిన యాత్రలో జనసేన, బీజేపీ జాడే కనిపించడం లేదు. మరోవైపు చంద్రబాబు ఒక్కడే నిర్వహిస్తున్న సభలతోపాటు పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కలిసి నిర్వహిస్తున్న కూటమి సభలు కూడా అట్టర్‌ఫ్లాప్ అవుతున్నాయి. ఆ సభలకు జనం రావడం గగనమవుతోంది. దీంతో చంద్రబాబు ఒక్కడే వచ్చింనా, కూటమిగా వచ్చింనా ప్రయోజనం మాత్రం శూన్యమేనని ఇట్టే తెలుస్తోంది.
►నాయకులే కలవనప్పుడు ఇక ఆ పారీ్టల మధ్య ఓట్ల బదిలీ ఎలా జరుగుతుందన్నది విశ్లేషకులు ప్రశ్న.
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఓట్ల బదిలీ జరిగే అవకాశాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. పేరుకు మాత్రమే ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ.. నేతలు, కార్యకర్తల మధ్య ఏ దశలోనూ పొసగడం లేదు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నా, టీడీపీ పూర్తిగా సహకరించడం లేదు. అక్కడ టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ.. క్యాడర్ ఎవరూ జనసేనకు సహకరించకుండా కట్టడి చేసి తానొక్కడే పవన్ కళ్యాణ్ వద్దకు వెళుతూ ఆయన కోసం పని చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు.
కింది స్థాయిలో టీడీపీ క్యాడర్ కూడా జనసేన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉంది. తమ సీటును తాడూ బొంగరం లేని పార్టీ ఎగరేసుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీటును అన్యాయంగా జనసేనకు వదిలేసి సిగ్గు లేకుండా తిరుగుతున్నారని ఇటీవల వర్మను ఒక గ్రామంలో టీడీపీ కార్యకర్తలు నిలదీసి వెళ్లగొట్టారు. కోనసీమ జిల్లాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు పి.గన్నవరం, అమలాపురంలో సంయుక్తంగా నిర్వహించిన సభలకు జనం రాలేదు. రావులపాలెంలో నిర్వహించిన సభకు 3 వేల మంది కూడా రాలేదు.
కూటమి తొలి సభే తుస్సు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 28న జరిగిన కూటమి తొలి సభే తుస్సుమంది. ఆ సభకు 6 లక్షల మంది జనం వస్తారని హంగామా చేసినా, వచ్చింది వేలల్లోనే. కార్యకర్తల కోసం కేటాయించిన గ్యాలరీల్లో సభ ప్రారంభం నుంచి చివరి వరకు సగం పైగా ఖాళీగానే ఉండిపోయాయి. ఈ నెల 5న నరసాపురం, పాలకొల్లులో చంద్రబాబు నిర్వహించిన కూటమి సభలు పేలవంగా జరిగాయి. పాలకొల్లు సభలో చంద్రబాబు జనసేన రాష్ట్ర నేత బన్నీ వాసును ప్రచార రథం ఎక్కనీయక పోవడంతో ఆయన అలిగి వెళ్లిపోయారు.
తణుకులో బాబు, పవన్‌ల నిలదీత
ఈ నెల 10వ తేదీన తణుకులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను జనసేన పార్టీల నేతలు అడ్డుకుని నిలదీశారు. ఆశించిన స్థాయిలో జనం రాకపోగా, నిలదీతతో ఇద్దరు నేతలు ఖంగుతిన్నారు. తనకు ప్రకటించిన సీటును టీడీపీకి వదిలేశారని ఆగ్రహంతో ఉన్న జనసేన ఇన్‌ఛార్జి ఇన్‌చార్జి విడివాడ రామచంద్రరావు సభకు గైర్హాజరవ్వగా ఆయన అనుచరులు సభా వేదిక వద్దకు చేరుకుని ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. అక్కడే టీడీపీ, జనసేన కార్యకర్తలు తోపులాటకు దిగారు. గుంటూరు జిల్లా తాడికొండలో చంద్రబాబు నిర్వహిచిన సభలో జనసేన నాయకులను ప్రచార వాహనంపైకి ఎక్కంచి బీజేపీ నేతలను పక్కకు తోసివేశారు. తెనాలిలో పవన్‌కళ్యాణ్ సభకు అక్కడి టీడీపీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజా డుమ్మా కొట్టి నాదెండ్ల మనోహర్ కోసం తాను పని చేసేది లేదని చెప్పకనే చెప్పారు.
ప్రధాని మోడీ వచ్చింన సభే విఫలం
గత నెల 17వ తేదీన చిలకలూరిపేటలో ప్రధాని మోడీ హాజరైన కూటమి సభ విఫలమవడం పొత్తు పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఎంత ప్రయత్నించినా జనం అనుకున్న స్థాయిలో రాకపోగా సభను నిర్వహించడంలో టీడీపీ నేతలు విఫలమవడంతో అడుగడుగునా అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో మోడీ.. టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 6న చంద్రబాబు క్రోసూరు, సత్తెనపల్లిలో చేపట్టిన ప్రజాగళం సభల్లో జనసేన, బీజేపీ నేతలు కనిపించలేదు. సత్తెనపల్లి సభ జనం లేక అట్టర్‌ఫ్లాప్ అయ్యింది.
టీడీపీ తీరుపై జనసేన, బీజేపీ నేతల ఆగ్రహం
బాపట్ల జిల్లాలో ఇప్పటి వరకు మూడు ప్రజాగళం సభలు జరగ్గా ఒక్కటీ విజయవంతం కాలేదు. బాపట్ల, వేమూరు, రేపల్లెలో జరిగిన సభలకు జనం కరువయ్యారు. ఆ సభలకు జనసేన, బీజేపీ నేతలు ఒకరిద్దరిని ప్రచార వాహనంపైకి పిలవడమే తప్ప కార్యకర్తలు ఎక్కడా కనిపించ లేదు. టీడీపీ తమకు సభల గురించి చెప్పడం లేదని, అస్సలు తమను పట్టించు కోవడంలేదని జనసేన, బీజేపీ నేతలు వాపోతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో గత నెల 31న జరిగిన చంద్రబాబు సభలో పెట్టిన ఫ్లెక్సీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేరు లేకపోవడంతో ఆ పార్టీ నేతలు గొడవకు దిగారు.
అంతటా అదే తీరు
► ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాకలో ఈ నెల 14న చంద్రబాబు నిర్వహించిన సభకు బీజేపీ నేతలు హాజరు కాలేదు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రరెడ్డి సహా జిల్లా నాయకులెవ్వరూ హాజరవకపోడం చర్చనీయాంశమైంది. కూటమి పార్టీల నాయకుల జాడ కూడా కనిపించలేదు. చంద్రబాబు పర్యటనకు పెందుర్తి సీటు దక్కని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి దూరంగా ఉన్నారు. చివర్లో చంద్రబాబు ఆయన్ను పిలిపించుకుని మాట్లాడినా బండారు శాంతించలేదు.
►తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు ఆశించిన స్థాయిలో జరగలేదని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కొవ్వూరులో జరిగిన సభలో కూటమి నాయకులు కనిపించలేదు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో జరిగిన సభకు బీజేపీ, జనసేన నేతలు వెళ్లలేదు. ఈ నెల 10వ తేదీన నిడదవోలులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరైన సభకు జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ను ప్రచార వాహనంపైకి పిలిచి ఆ సీటును త్యాగం చేసిన టీడీపీ నేత బూరుగుపల్లి శేషారావును మాత్రం పట్టించుకోలేదు. దీంతో శేషారావు అనుచరులు గొడవకు దిగారు.
►నెల్లూరు జిల్లా కావలిలో గత నెల 29న చంద్రబాబు.. బీజేపీ, జనసేనలతో కలిసి నిర్వహించిన బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది. జనం లేకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన సభ నాలుగు గంటలు ఆలస్యంగా జరిగింది. అప్పటి వరకు చంద్రబాబు బస్సులోనే ఉండిపోయారు. ఈ నెల 29న ఉదయగిరిలో జరిగిన సభకు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గైర్హాజరాయ్యారు.
►కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గత నెల 31న చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభకు టీడీపీ అభ్యర్థి జయ నాగేశ్వరరెడ్డి.. బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు ఎవ్వరినీ ఆహ్వనించ లేదు. కర్నూలులోనూ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్.. కూటమి పార్టీలను పట్టించుకోకుండా ఒంటరిగానే ప్రచారం నిర్వహిస్తున్నారు.
►ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి సమావేశాలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. స్వయంగా చంద్రబాబు, బాలకృష్ణ ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నా.. బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎక్కడా కనిపించడం లేదు. గత నెల 28న చంద్రబాబు రాప్తాడులో నిర్వహించిన సభలో బీజేపీ ఊసే లేదు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం సభలోనూ బీజేపీ వాళ్లు ఎవరూ లేరు. తమకు ఆహ్వనం లేదని స్థానిక జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి, సభకు దూరంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment